
రాత్రి వేళల్లో కుక్కలు నిరంతరాయంగా మొరగడం లేదా ఆకాశం వైపు చూస్తూ వింతగా ఊళ వేయడం మనకు తరచూ కనిపిస్తూనే ఉంటుంది. అలా కుక్కలు అరిస్తే.. ఆ ప్రాంతంలో దెయ్యాలు, భూతాలు తిరుగుతున్నాయని, ఆత్మలను చూసే కుక్కలు అలా అరుస్తాయని చాలా మంది నమ్ముతుంటారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముంది..? పశువైద్య, జీవశాస్త్ర నిపుణులు దీనిపై ఏమంటున్నారు? కుక్కల అరుపుల వెనుక దాగున్న ఆ ఆసక్తికరమైన శాస్త్రీయ కారణాలు తెలుసుకుందాం..
కుక్కల పూర్వీకులు తోడేళ్లు అనే విషయం మనకు తెలిసిందే. తోడేళ్లు రాత్రిపూట సమూహంగా ఉన్నప్పుడు ఒకరికొకరు సంకేతాలు ఇచ్చుకోవడానికి ఆకాశం వైపు తలపెట్టి అరుస్తుంటాయి. కుక్కలు కూడా అదే డిఎన్‌ఏ, సామర్థ్యాలను వారసత్వంగా పొందాయి. రాత్రిపూట వాతావరణం నిశబ్దంగా ఉండటం వల్ల వాటి పూర్వీకుల నాటి సహజ అలవాటు బయటకు వచ్చి అలా ఊళ వేస్తాయి. ఇందులో ఎలాంటి అతీంద్రియ శక్తుల ప్రమేయం లేదు.
కుక్కలకు వాసన పసిగట్టే శక్తి చాలా అద్భుతంగా ఉంటుంది. సైంటిఫిక్ స్టడీస్ ప్రకారం.. మనుషుల కంటే కుక్కలకు 10 లక్షల రెట్లు మెరుగైన వాసన పసిగట్టే సామర్థ్యం ఉంటుంది. రాత్రి గాలిలో దూరం నుండి వచ్చే అపరిచితుల వాసనలను, ఇతర జంతువులను లేదా కొత్త వాసనలను ఇవి క్షణాల్లో పసిగట్టగలవు. ఒకసారి చూసిన లేదా పసిగట్టిన వాసనను ఇవి జీవితాంతం గుర్తుంచుకోగలవు. రాత్రి వేళ ఏదైనా కొత్త వాసన రాగానే.. “ఎవరో అపరిచితులు వస్తున్నారు” అని అలెర్ట్ చేయడానికి గాలిని వాసన చూస్తూ ఊళ వేస్తాయి.
మనుషులు వినలేని అత్యంత సూక్ష్మమైన శబ్దాలను కూడా కుక్కలు సులభంగా వినగలవు. ఇవి సుమారు 16 నుండి 20 కిలోమీటర్ల దూరం నుండి వచ్చే శబ్దాలను కూడా హెర్ట్జ్ స్థాయిలో పసిగట్టే అద్భుతమైన వినికిడి శక్తిని కలిగి ఉంటాయి. దూరం నుండి వచ్చే వాహనాల హారన్లు, గాలి కదలికలు, చిన్న చిన్న శబ్దాలు వీటికి చాలా పెద్దవిగా వినిపిస్తాయి. అందుకే ఏదో ప్రమాదం జరుగుతోందని భావించి భయంతో లేదా హెచ్చరికగా అవి అరుస్తాయి.
ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మనుషుల కంటే కుక్కలు ఎక్కువగా భయపడతాయి. ప్రమాద చప్పుడు మనకు సాధారణంగానే అనిపించినా, కుక్కల పదునైన చెవులకు అది చాలా బిగ్గరగా, భయానకంగా వినిపిస్తుంది. అందుకే ప్రమాదం జరగగానే అవి గట్టిగా అరుస్తూ అక్కడి నుండి పారిపోతాయి.
కుక్కలు చాలా సామాజిక జంతువులు. రాత్రిపూట ఒక వీధిలో ఒక కుక్క అరవడం స్టార్ట్ చేస్తే.. చుట్టుపక్కల వీధుల్లోని కుక్కలన్నీ వరుసగా అరవడం మనం గమనించే ఉంటాం. ఇది అవి ఒకదానితో ఒకటి సంభాషించుకునే విధానం. తమ భూభాగంపై నియంత్రణను చూపించడానికి, అలాగే మనమందరం ఒకే సమూహం అనే భావనను ఒకరికొకరు తెలియజేసుకోవడానికి ఈ విధంగా నిరంతరాయంగా అరుస్తుంటాయి. మనం రాత్రిపూట రోడ్డుపై నడుస్తున్నప్పుడు మన అడుగుల చప్పుడు, బూట్ల శబ్దం, చేతుల కదలికలు కూడా వాటికి ముప్పుగా అనిపించి మనల్ని చూసి అరుస్తాయి.
మనుషుల కంటే కుక్కలకు రాత్రిపూట చూసే దృష్టి చాలా మెరుగ్గా ఉంటుంది. చీకట్లో కదిలే చిన్న నీడలను, ఎగిరే కీటకాలను, చెట్ల ఆకుల కదలికలను కూడా వాటి కళ్లు వేగంగా క్యాప్చర్ చేయగలవు. ఏదైనా అసాధారణ కదలిక కనిపిస్తే అవి వెంటనే అలర్ట్ అయి మొరగడం ప్రారంభిస్తాయి.
కుక్కలు ఒంటరిగా ఉన్నప్పుడు చాలా అభద్రతాభావానికి లోనవుతాయి. ఎవరైనా తమపై దాడి చేస్తారేమోనని ఆందోళన చెందుతాయి. ఉదాహరణకు.. ఏదైనా ప్రాంతంలో ఒక కుక్క చిరుతపులికో లేదా మరేదైనా క్రూర జంతువుకో చిక్కితే, దాని అరుపుల ద్వారా మిగతా కుక్కలు తీవ్ర భయాందోళనకు గురవుతాయి. ఆ ప్రభావంతో ఆ చుట్టుపక్కల ప్రాంతంలోని కుక్కలు కొన్ని రోజుల పాటు రాత్రిపూట మరింత ఎక్కువగా అరుస్తాయి.
ఇవే కాకుండా ఆకలి, అనారోగ్యం, ఒంట్లో ఏదైనా నొప్పి ఉన్నప్పుడు లేదా వాటిలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువైనప్పుడు కూడా కుక్కలు రాత్రిపూట అరుస్తుంటాయి. కాబట్టి కుక్కల అరుపుల వెనుక పూర్తిగా జీవశాస్త్ర, పర్యావరణ కారణాలే ఉన్నాయి తప్ప ఎలాంటి దెయ్యాలు, భూతాలు లేవు. పెంపుడు కుక్కల యజమానులు వాటికి సరైన శిక్షణ, వ్యాయామం, సమయానికి ఆహారం అందించడం ద్వారా ఈ రాత్రిపూట అరుపుల సమస్యను సులభంగా తగ్గించవచ్చు.