
ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు చుక్కలు చూపిస్తుంటే, జపాన్ మాత్రం ఇళ్లను ఉచితంగా ఇచ్చేస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, ఇది నిజం. వాస్తవంగా ప్రపంచవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశాన్ని తాకుతుంటే, జపాన్‌లో మాత్రం ఇళ్లు అమ్ముడుపోక, నివాసం ఉండే వారు లేక లక్షలాది ఇళ్లు భూత్ బంగ్లాల్లా మారుతున్నాయి. జపాన్ ప్రభుత్వం వీటిని అకియా అని పిలుస్తుంది. జపాన్‌లో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. వృద్ధులు మరణించిన తర్వాత వారి ఇళ్లను చూసుకునే వారసులు లేకపోవడం వల్ల ఆ ఇళ్లు ఖాళీగా పడి ఉంటున్నాయి. యువత అంతా ఉపాధి, ఆధునిక జీవనశైలి కోసం పెద్ద నగరాలకు వెళ్లడం వల్ల పల్లెటూళ్లలో ఇళ్లను పట్టించుకునే వారు కరువయ్యారు.
మరోవైపు, జపాన్‌లో ‘ఒంటరి మరణాలు’ (Lonely Deaths) సంభవించిన ఇళ్లను అరిష్టంగా భావిస్తారు. అలాంటి ఇళ్లలో నివసించడానికి ఎవరూ ఇష్టపడరు. పాత ఇళ్లను కూల్చివేస్తే భూమిపై పన్ను పెరుగుతుంది. అందుకే యజమానులు ఆ ఇళ్లను అలాగే వదిలేస్తున్నారు తప్ప వేరే వారికి ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ ఖాళీ ఇళ్ల వల్ల నేరాలు పెరగడం, అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం అకియా బ్యాంక్ లను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా చాలా తక్కువ ధరకే లేదా ఉచితంగా ఇళ్లను అందిస్తున్నారు. విదేశీయులు కూడా ఈ ఇళ్లను కొనుగోలు చేయడానికి ఇప్పుడు ఆసక్తి చూపుతున్నారు. అయితే, వాటి మరమ్మతులకు భారీగా ఖర్చు చేయాల్సి రావడం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది.
Japan Free Houses
ఈ క్రమంలోనే జపాన్ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం వల్ల శిథిలావస్థకు చేరుతున్న గ్రామాలు మళ్లీ కళకళలాడుతాయని ఆశిస్తున్నారు. ఒకవేళ మీకు జపాన్ సంస్కృతి అంటే ఇష్టం ఉండి, అక్కడ స్థిరపడాలనుకుంటే, ఈ అకియా ఇల్లు మీకు సరిగ్గా సరిపోతాయి. ఏదిఏమైనప్పటికీ, జపాన్ ఎదుర్కొంటున్న ఈ సమస్య అభివృద్ధి చెందిన దేశాలకు ఒక హెచ్చరిక లాంటిది. జనాభా సమతుల్యత దెబ్బతింటే అది దేశ ఆర్థిక వ్యవస్థపై, మౌలిక సదుపాయాలపై ఎంతటి ప్రభావం చూపుతుందో జపాన్ అకియా ఇళ్లు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..