
ఇళ్లలో, రెస్టారెంట్లలో, చిరువ్యాపారుల వద్ద మనం రోజూ చూసే ప్లాస్టిక్ స్టూల్స్ మధ్యలో ఒక చిన్న గుండ్రని రంధ్రం ఉండటం సర్వసాధారణం. చాలామంది ఇది కేవలం అందం కోసమో లేదా డిజైన్ కోసమో ఇచ్చిన రంధ్రమని భావిస్తుంటారు. అయితే, ఈ చిన్న మార్పు వెనుక బలమైన శాస్త్రీయ కారణాలు, ఇంజనీరింగ్ సూత్రాలు దాగి ఉన్నాయి. స్థలాన్ని ఆదా చేసేందుకు స్టూల్స్‌ను సాధారణంగా ఒకదానిపై ఒకటి పేర్చుతుంటారు. ఒకవేళ మధ్యలో రంధ్రం లేకపోతే రెండు స్టూల్స్ మధ్య ఉన్న గాలి బయటకు పోయి అక్కడ శూన్యం ఏర్పడుతుంది. దీనివల్ల వాతావరణ పీడనం ప్రభావంతో అవి ఒకదానికొకటి గట్టిగా అతుక్కుపోయి, వాటిని వేరు చేయడం చాలా కష్టమవుతుంది. మధ్యలో రంధ్రం ఉండటం వల్ల గాలి రాకపోకలు సులభమై, పేర్చిన స్టూల్స్‌ను సులువుగా విడదీయవచ్చు.
ఒక వ్యక్తి స్టూల్‌పై కూర్చున్నప్పుడు వారి శరీర బరువు మొత్తం మధ్యభాగంలోనే కేంద్రీకృతమై అధిక ఒత్తిడి పడుతుంది. రంధ్రం లేని ఫ్లాట్ సర్ఫేస్ అయితే ఆ ఒత్తిడికి ప్లాస్టిక్ అకస్మాత్తుగా పగిలిపోయే ప్రమాదం ఉంది. ఈ గుండ్రని రంధ్రం వల్ల బరువు మొత్తం స్టూల్ నాలుగు కాళ్లపై సమానంగా పంపిణీ అవుతుంది.
చదరపు లేదా కోణాల ఆకారంలో రంధ్రాలు పెడితే ఆ మూలల్లో ఒత్తిడి పెరిగి పగుళ్లు వచ్చే ముప్పు ఉంటుంది. అదే గుండ్రని ఆకారం అయితే ఒత్తిడి అంతటా సమానంగా వ్యాపించి స్టూల్‌కు గరిష్ట బలాన్ని, మన్నికను ఇస్తుంది. అంతేకాకుండా ఈ రంధ్రం ఒక చిన్న హ్యాండిల్‌లా పనిచేస్తుంది. స్టూల్‌ను ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా లేదా ఒక వేలితో సులభంగా పైకి లేపాలన్నా ఈ రంధ్రం చక్కగా ఉపయోగపడుతుంది.
బాత్రూంలలో స్నానం చేసేటప్పుడు లేదా ఆరుబయట వాడేటప్పుడు స్టూల్ పైభాగంలో నీరు నిలిచిపోకుండా ఈ రంధ్రం ద్వారా వెంటనే కిందకు వెళ్లిపోతుంది. దీనివల్ల స్టూల్ త్వరగా ఆరిపోయి శుభ్రంగా, పాచి పట్టకుండా ఉంటుంది.
ప్లాస్టిక్ అచ్చులలో ద్రవరూప ప్లాస్టిక్‌ను నింపేటప్పుడు ఈ రంధ్ర నిర్మాణం మెటీరియల్ సమానంగా వ్యాపించడానికి తోడ్పడుతుంది. అంతేకాకుండా మధ్యలో కొంత ప్లాస్టిక్ ఆదా అవ్వడం వల్ల తయారీ ఖర్చులు తగ్గడంతో పాటు స్టూల్ తేలికగా తయారవుతుంది. పైకి సాధారణంగా కనిపించే ఈ చిన్న గుండ్రని రంధ్రం.. స్టూల్ బలాన్ని పెంచడంలోనూ, ఎక్కువ కాలం మన్నేలా చేయడంలోనూ కీలక పాత్ర పోషిస్తోంది.