
ప్రతి మనిషి మరణించక తప్పదు. కానీ మరణపు చివరి క్షణాల్లో ఏం జరుగుతుందనేది ఇప్పటికీ ఒక పెద్ద రహస్యమే. మరణశయ్యపై ఉన్న వ్యక్తి చివరి నిమిషంలో ఏమి చూస్తాడు? అతడి మనసులో ఏం నడుస్తుంది? అనేది ఎవరికీ తెలియదు. అయితే ఇంగ్లాండ్‌కు చెందిన ఒక హాస్పిస్ నర్స్ అంటే తీవ్ర అనారోగ్యంతో చివరి దశలో ఉన్న రోగులకు సేవలు అందించే నర్సు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్ వేదికగా పంచుకున్న కొన్ని విషయాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఆమె తన సుదీర్ఘ కెరీర్‌లో కళ్లెదుటే ఎంతోమంది చనిపోవడాన్ని చూసింది. చనిపోయే ముందు చాలామంది రోగులు కొందరు వ్యక్తుల పేర్లను గొణుగుకోవడం ఆమె విన్నది. దీని ఆధారంగా ఒక వ్యక్తి మరణానికి ముందు ఎవరిని చూస్తాడో ఆమె వెల్లడించింది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మరణిస్తున్న వ్యక్తులు తమ కంటే ముందే చనిపోయిన బంధువులను, స్నేహితులను లేదా వారు ప్రాణంగా పెంచుకున్న పెంపుడు జంతువులను చూడటం ప్రారంభిస్తారట. వారు వారి పేర్లు పెట్టి పిలుస్తూ.. వారితో మాట్లాడటానికి, వారిని తాకడానికి ప్రయత్నిస్తారని, దాదాపు రోగులందరి జీవితాల్లోనూ ఈ పరిస్థితి చాలా సాధారణంగా జరుగుతుందని ఆమె చెబుతోంది.
ఈ నర్స్ చెప్పిన కొన్ని నిజాలు అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. ఒక వృద్ధురాలు చనిపోయే ముందు.. తన పెంపుడు పిల్లి గదిలో తిరుగుతోందని వెతుకుతూ ఉందట. అలాగే ఒక పురుష రోగి, పైకప్పు మూలలో తన చనిపోయిన భార్యను చూసిన తర్వాత పూర్తిగా స్తంభించిపోయాడట. వైద్య పరిభాషలో ఈ అనుభవాలను చివరి క్షణాల్లో కనిపించే దృశ్యాలు అని అంటారు. రోగులు మరణ దశలోకి ప్రవేశించినప్పుడు, వారు తరచుగా చనిపోయిన తమ ప్రియమైన వారిని చూస్తుంటారని హాస్పిస్ నర్సులు ధృవీకరిస్తున్నారు.
కొన్ని అధ్యయనాల ప్రకారం.. మరణశయ్యపై ఉన్న రోగులలో సుమారు 50శాతం నుండి 60శాతం మందికి ఇలాంటి అనుభవాలు కలుగుతాయని తేలింది. ఇవి సానుకూలంగా, ప్రశాంతంగా ఉంటాయట. అంతవరకు మరణ భయంతో ఉన్న రోగులు అకస్మాత్తుగా ప్రశాంతంగా మారిపోతారు. వారి భయం మాయమై, నవ్వడం ప్రారంభిస్తారు. రోగులు తరచుగా మరణించిన వారి పేర్లను తలుచుకుంటూ.. “అమ్మ ఇక్కడ ఉంది, నన్ను తీసుకెళ్లడానికి నాన్న ఇక్కడ ఉన్నారు, లేదా నా కుక్క ఇక్కడ ఉంది అని గొణుగుతారని నర్సులు చెబుతున్నారు. మరో హాస్పిస్ నర్సు పెన్నీ స్మిత్ కూడా ఇలాంటి అనుభవాలనే పంచుకున్నారు. ఒక మహిళ తన చాలా కాలంగా పెంచుకుంటున్న పెంపుడు కుక్క గాల్లో ఉన్నట్లు భావిస్తూ దాన్ని నిమురుతూ ఎంతో ఆనందాన్ని పొందిందని ఆమె చెప్పారు.
వైద్యపరంగా ఈ విషయాన్ని ఎండ్ ఆఫ్ లైఫ్ డ్రీమ్స్ అని పిలుస్తారు. మెదడులోని రసాయన మార్పులు, శరీరంలో ఆక్సిజన్ లోపం ఏర్పడటం లేదా వాడుతున్న మందుల ప్రభావాల వల్ల ఇవి సంభవించవచ్చని సైన్స్ చెబుతోంది. అయితే చాలా మంది నర్సులు, వైద్యులు ఇవి కేవలం భ్రాంతులు మాత్రమే కావని నమ్ముతారు. ఇవి రోగికి మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఇలాంటి అనుభవాలను పొందే రోగులు తక్కువ శారీరక, మానసిక బాధను అనుభవిస్తారని.. ఎంతో ప్రశాంతంగా కన్నుమూస్తారని అధ్యయనాలు వెల్లడించాయి.
చాలా సందర్భాల్లో రోగులు అకస్మాత్తుగా.. నేను వెళ్లాలి లేదా వాళ్ళు నన్ను పిలుస్తున్నారు అని చెప్పి ఆ తర్వాత పూర్తిగా ప్రశాంత స్థితికి చేరుకుని మరణిస్తారని నర్సులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ, మరణం పట్ల ఉండే భయాన్ని పోగొట్టి, మనిషి ప్రశాంతంగా నిష్క్రమించడానికి ఆఖరి క్షణాల్లో కనిపించే వింత దృశ్యాలు ప్రకృతి ప్రసాదించిన ఒక వరంగా వైద్య నిపుణులు భావిస్తున్నారు.