
Funny Beggar Video: రోడ్డు పక్కన కూర్చుని అడుక్కునే వాడికి కూడా ఇంత ఈగో, ఇంత వెటకారం ఉంటుందా అనిపించేలా ఓ వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. తనను ప్రశ్నించిన ఒక వ్యక్తికి సదరు భిక్షగాడు ఇచ్చిన కౌంటర్ వింటే ఎవరైనా సరే ముక్కున వేలేసుకోవాల్సిందే. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోను దిగ్గజ క్రికెటర్లు శిఖర్ ధావన్, యూజువేంద్ర చాహల్ తమ హావభావాలతో పండించడం గమనార్హం.
నేటి డిజిటల్ యుగంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతుంటాయి. వాటిలో కొన్ని ఆలోచింపజేసేవి ఉంటే, మరికొన్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తుంటాయి. తాజాగా వైరల్ అవుతున్న శిఖర్ ధావన్, చాహల్ వీడియో నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. ఒక అందమైన పార్కులో, పచ్చటి గడ్డిపై కూర్చుని ఉన్న చాహల్, దారి వెంబడి వెళ్తున్న వారిని అడుక్కుంటుండటం మనకు ఈ వీడియోలో కనిపిస్తుంది.
ఆ సమయంలో అటుగా వెళ్తున్న టీమిండియా మాజీ ప్లేయర్ శిఖర్ ధావన్, చేతిలో గిన్నె పట్టుకుని భిక్షాటన చేస్తున్న చాహల్‌ను కోపంగా అతని వైపు చూస్తూ, “రోడ్డు మీద కూర్చుని ఇలా డబ్బులు అడుక్కోవడానికి నీకు సిగ్గుగా అనిపించడం లేదా?” అంటూ గద్దించాడు. సాధారణంగా ఇలాంటి ప్రశ్నలు ఎదురైనప్పుడు భిక్షాటన చేసేవారు భయపడటమో లేదా ఏడుస్తూ తమ కష్టాలు చెప్పుకోవడమో చేస్తారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది.
ఆ ప్రశ్న వినగానే చాహల్ ఏమాత్రం తడుముకోకుండా, ఎంతో నిర్లక్ష్యంగా పైకి చూశాడు. చేతిలో ఉన్న నాణేలను గిన్నెలో వేస్తూ.. “నువ్వు ఇచ్చే ఆ పది రూపాయల కోసం నేను విడిగా ఒక ఆఫీస్ తెరిచి కూర్చోవాలా ఏంటి?” అంటూ ఎదురు దెబ్బ కొట్టాడు. ఆ సమాధానానికి శిఖర్ ధావన్ నోట మాట రాకుండా ముఖం తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
ఈ వీడియో ఫన్నీ స్కిట్ కోసమే అనే విషయాన్ని పక్కన పెడితే.. ఇందులో ఉన్న డైలాగ్ టైమింగ్, సదరు వ్యక్తి హావభావాలు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. “భిక్షగాడికి కూడా ఆత్మగౌరవం ఎక్కువే”, “వ్యాపారంలో పెట్టుబడికి తగ్గట్టే ఆఫీస్ ఉంటుంది కదా మరి” అంటూ నెటిజన్లు రకరకాల కామెడీ కామెంట్లు పెడుతున్నారు. మీమ్స్ ప్రియులకు ఈ వీడియో ఒక మంచి కంటెంట్‌గా మారిపోయింది.
మరిన్ని ట్రెండింగ్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..