
ప్రకృతి ప్రపంచం ఎంత అద్భుతంగా ఉంటుందో, అంతకుమించి అనేక వింతలు, విశేషాలతో మనల్ని ఆశ్చర్యపరుస్తుంది. సాధారణంగా అడవిలో పెద్దవి, బలమైనవి అయిన జంతువులే అత్యంత ప్రమాదకరమైనవని, అవి చిన్న జీవులను సులభంగా వేటాడి ఆహారంగా మార్చుకుంటాయని మనం భావిస్తుంటాం. కానీ ప్రకృతి సిద్ధాంతం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కొన్ని చిన్న జీవులు తమ ప్రత్యేక రక్షణ వ్యవస్థలతో ఎంతటి పెద్ద మాంసాహార జంతువునైనా క్షణాల్లో నిస్సహాయంగా మార్చగలవు. సరిగ్గా ఇలాంటి వింత సంఘటనకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశమవుతోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక కప్ప తన సమీపంలో ఉన్న చిన్న కీటకాన్ని చూసి సులభమైన ఆహారం అనుకుంది. అకస్మాత్తుగా దానిపైకి దూకి, నోటితో పట్టుకుని మింగడానికి ప్రయత్నించింది. ది సహజంగా జరిగే సంఘటనలాగే అనిపిస్తుంది. కానీ అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. కప్ప నోటిలోకి వెళ్లిన ఆ కీటకం సాధారణమైనది కాదు. దాన్ని బాంబార్డియర్ బీటిల్ అని పిలుస్తారు. ఈ రకం పురుగులకు తమను తాము కాపాడుకోవడానికి ప్రకృతి ఇచ్చిన ఒక విచిత్రమైన రక్షణ యంత్రాంగం ఉంటుంది. బాంబార్డియర్ బీటిల్ శరీరం వెనుక భాగంలో ఒక ప్రత్యేకమైన రసాయన వ్యవస్థ ఉంటుంది. ఏదైనా వేటాడే జంతువు తనను పట్టుకోవడానికి లేదా తినడానికి ప్రయత్నించినప్పుడు, అది తన శరీరం నుండి తీవ్రమైన వేడి, మంటను పుట్టించే కెమికల్ స్ప్రేని వేగంగా విడుదల చేస్తుంది.
కప్ప ఆ పురుగును మింగగానే, ప్రమాదాన్ని పసిగట్టిన బీటిల్ కప్ప నోటి లోపలే ఆ ఘాటైన రసాయనాన్ని స్ప్రే చేసింది. ఆ వేడి, మంటను తట్టుకోలేకపోయిన కప్ప, మింగిన పురుగును తక్షణమే బయటకు ఉమ్మేసింది. కప్పలకు, బాంబార్డియర్ బీటిల్స్‌కు మధ్య జరిగే ఈ విచిత్ర పోరాటం శాస్త్రవేత్తలకు ఎంతో ఆసక్తికరమైన అంశంగా మారింది. దీనిపై గతంలో జరిగిన పరిశోధనల్లో కూడా ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. సజీవంగా ఉన్న బాంబార్డియర్ బీటిల్స్‌ను కప్పలు మింగినప్పుడు, చాలా వరకు కప్పలు వాటి రసాయన దాడిని తట్టుకోలేక కొద్దిసేపటికే బయటకు విసిరేసినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. విచిత్రమేమిటంటే.. కప్ప కడుపులోకి వెళ్లిన తర్వాత కూడా ఈ పురుగులు ప్రాణాలతో బయటపడటం విశేషం.
ప్రకృతిలో కేవలం శరీర పరిమాణం, భౌతిక బలం మాత్రమే గెలుపును నిర్ణయించవని ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. తేలికైన ఆహారం అనుకుని నోటివరకు తెచ్చుకున్న ఎర, క్షణాల్లోనే కప్పకు ఒక పెద్ద సమస్యగా మారి కూర్చుంది. చిన్న జీవి అయినప్పటికీ, తనకున్న వినూత్న రక్షణ తంత్రంతో పెద్ద జంతువును సైతం ఆశ్చర్యపరిచిన ఈ వింత పురుగు ఉదంతం ఇప్పుడు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది.