ఇన్‌స్టా రీల్స్ చూస్తే చాలు.. నెల జీతంతో ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?

సాధారణంగా ఉద్యోగం అంటే ఉదయం ఆఫీసుకు వెళ్లడం.. రోజంతా పని చేయడం.. సాయంత్రం ఇంటికి రావడం. కానీ ఇప్పుడు ఒక కంపెనీ మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన ఉద్యోగ అవకాశాన్ని ప్రకటించింది. ఈ ఉద్యోగంలో రోజంతా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ గడిపితే చాలు. అందుకు జీతం కూడా ఇస్తారట! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజమే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఓ కంపెనీ ఈ వినూత్న ఉద్యోగ ప్రకటన చేసింది.

ఇన్‌స్టా రీల్స్ చూస్తే చాలు.. నెల జీతంతో ఉద్యోగం.. ఎక్కడో తెలుసా?
Udaipur Company Offers Job To Scroll Instagram Reels All Day Looking For Doomscroller

Updated on: Nov 06, 2026 | 10:44 AM

ఉదయ్‌పూర్‌కు చెందిన ఇన్‌ఫ్లూయిష్ (Influish) అనే కంపెనీ ఈ ఉద్యోగం కోసం అభ్యర్థులను వెతుకుతోంది. ఈ పోస్టుకు ‘డూమ్‌స్క్రోలర్’ (Doomscroller) అని పేరు పెట్టింది. అంటే గంటల తరబడి సోషల్ మీడియాలో స్క్రోలింగ్ చేస్తూ గడిపే వ్యక్తి అన్నమాట. అయితే ఈ ఉద్యోగంలో కేవలం రీల్స్ చూస్తూ సమయం గడిపితే సరిపోదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఏ వీడియోలు వైరల్ అవుతున్నాయి? ఎలాంటి కంటెంట్‌ను ఎక్కువ మంది చూస్తున్నారు? కొత్తగా ఏయే ట్రెండ్స్ వస్తున్నాయి? అనే విషయాలను గుర్తించి కంపెనీకి తెలియజేయాలి. ఈ ఉద్యోగానికి సంబంధించిన వివరాలను కంపెనీ సిబ్బంది ఓ సోషల్ మీడియా వీడియో ద్వారా వెల్లడించారు. ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా ఉపయోగించే వారు తమ అలవాటునే ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చని తెలిపారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

ఈ ఉద్యోగంపై ఆసక్తి ఉన్నవారు కంపెనీ షేర్ చేసిన వీడియో కింద కామెంట్‌లో ‘Hi’ అని టైప్ చేయాలి. ఉదయ్‌పూర్‌లో ఉండే అభ్యర్థులకు దరఖాస్తు లింక్‌ను డైరెక్ట్ మెసేజ్ ద్వారా పంపిస్తామని కంపెనీ తెలిపింది. ఆ లింక్ ద్వారా ఓపెన్ అయ్యే ఫామ్‌లో అభ్యర్థులు తమ పేరు, ఫోన్ నంబర్, చిరునామా నమోదు చేయాలి. ఫుల్‌టైమ్ ఉద్యోగం కావాలా? లేక ఇంటర్న్‌షిప్ కావాలా పేర్కొనాలి. అలాగే ఏ పోస్టుకు దరఖాస్తు చేస్తున్నారో, ప్రస్తుతం ఎంత జీతం తీసుకుంటున్నారు, ఎంత జీతం ఆశిస్తున్నారో తెలియచేయాలి. చివరగా తమ రెజ్యూమ్‌ను అప్‌లోడ్ చేసి దరఖాస్తు సమర్పించాలి. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను కంపెనీ సంప్రదిస్తుంది.

11 వేల మందికి పైగా ఆసక్తి!

ఈ ఉద్యోగ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే 11 వేల మందికి పైగా అప్లికేషన్ ఫామ్ కోసం అభ్యర్థించినట్లు కంపెనీ తెలిపింది. ఈ ఉద్యోగం గురించి నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు. ‘ఇదే కదా పర్ఫెక్ట్ జాబ్ అంటే’, ‘ఇలాంటి అవకాశం కోసమే ఎదురుచూస్తున్నా’, ‘ఇది నా డ్రీమ్ జాబ్’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొకరు అయితే తనను ఉద్యోగంలోకి తీసుకుంటే ‘బెస్ట్ పెర్ఫార్మర్’ అవార్డు కూడా గెలుచుకుంటానంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

మొత్తానికి రోజంతా రీల్స్ చూస్తూ గడిపే అలవాటు ఉన్నవారికి.. అదే పనిగా మారి జీతం కూడా వస్తుందంటే ఈ ఉద్యోగం నిజంగానే ఆసక్తికరంగా ఉందని చెప్పాలి. అయితే ఈ పోస్టుకు సంబంధించిన జీతం వివరాలను కంపెనీ వెల్లడించలేదు.

Loading...
Unable to load recommendations.
Follow Us