రష్యా నుంచి డీజిల్ కొనుగోళ్లు.. ‘అమెరికా ప్రయోజనాలే ముఖ్యం’ అంటూ ట్రంప్ సమర్థన!

ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే చైనా, భారత్‌పై భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించిన ట్రంప్‌, ఇప్పుడు రష్యా నుంచే డీజిల్ కొనుగోలుకు అనుమతివ్వడంపై విమర్శలు వస్తున్నాయి. రష్య నుంచి డీజిల్ కొనుగోళ్లకు తాత్కాలికంగా అనుమతిచ్చిన ట్రంప్ తన నిర్ణయాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. అమెరికా ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నానని స్పష్టం చేశారు.

రష్యా నుంచి డీజిల్ కొనుగోళ్లు.. ‘అమెరికా ప్రయోజనాలే ముఖ్యం’ అంటూ ట్రంప్ సమర్థన!
Trump Defends Russia Oil Deal After Backlash In Us

Updated on: Oct 13, 2026 | 10:26 AM

ఇటీవల నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయంలోనూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు యుద్ధాన్ని ముగించాలంటూ ప్రయత్నాలు చేస్తున్నామని చెబుతూనే.. మరోవైపు రష్యా నుంచి ఇంధన కొనుగోళ్లకు తాత్కాలికంగా అనుమతివ్వడం విమర్శలకు కారణమవుతోంది. డీజిల్ ధరలను తగ్గించడం అమెరికా ఆర్థిక ప్రయోజనాలకు అవసరమని ట్రంప్ ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. రష్యాకు వచ్చే ఆదాయం ఆ దేశ యుద్ధానికి ఉపయోగపడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సంబంధాల నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం అమెరికా రాజకీయాల్లో వివాదానికి దారితీసింది. రష్యా నుంచి డీజిల్ కొనుగోళ్లకు తాత్కాలిక అనుమతి ఇవ్వడాన్ని పలువురు అమెరికా చట్టసభ సభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ట్రంప్ ను  కోరారు. ఉక్రెయిన్ పౌరులపై రష్యా దాడులు కొనసాగుతున్న సమయంలో పుతిన్‌కు ఆర్థికంగా అండగా నిలవకూడదని, రష్యా చమురు కొనుగోళ్లకు అమెరికా అనుమతులు ఇవ్వడం ద్వారా ఆ దేశానికి ఆదాయం సమకూరే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఉక్రెయిన్ ఎన్నికలపై ట్రంప్ వ్యాఖ్యలకు యూరప్ కౌంటర్

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఉక్రెయిన్‌లో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాల్సిన సమయం వచ్చిందని, యుద్ధాన్ని ముగించేందుకు జెలెన్‌స్కీ తగినంతగా ప్రయత్నించడం లేదని విమర్శించారు. 2022లో రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్‌లో అధ్యక్ష ఎన్నికలు నిర్వహించకపోవడంపై ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఉక్రెయిన్ లో శాంతి స్థాపనకు జెలెన్‌స్కీనే ప్రధాన అడ్డంకి అన్నారు.

అయితే, యూరోపియన్ యూనియన్ విదేశాంగ చీఫ్ కాజా కల్లాస్ ఈ వ్యాఖ్యలను వ్యతిరేకించారు. కాల్పుల విరమణ ఒప్పందం లేకుండా ఉక్రెయిన్‌లో ఎన్నికలు నిర్వహించడానికి ఇది సరైన సమయం కాదని స్పష్టం చేశారు. యుద్ధ పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించడం కంటే ముందుగా కాల్పుల విరమణకు మార్గం సుగమం చేయడంపై దృష్టి పెట్టాలని అన్నారు.

అర్థం కాని ట్రంప్ వైఖరి

రష్యా నుంచి అత్యధికంగా ఇంధనం కొనుగోలు చేసే దేశాల్లో చైనా ముందుండగా.. భారత్, తుర్కియే, యూరోపియన్ యూనియన్ దేశాలు కూడా రష్యా నుంచి ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటున్నాయి. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేయడం వల్ల ఆ దేశానికి ఆదాయం పెరుగుతుందని, ఆ డబ్బుతో ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని కొనసాగించే అవకాశం ఉందని అమెరికా వాదించింది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం కల్పించే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను ట్రంప్ జారీ చేశారు.  భారత్‌పై కూడా 25 శాతం అదనపు సుంకాలు విధించింది. ఇప్పుడు అదే రష్యా నుంచి అమెరికా డీజిల్ కొనుగోలుకు సిద్ధం కావడంపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us