F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!

అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులకు ట్రంప్ ప్రభుత్వం షాకిచ్చింది. F-1 వీసా ఉన్న విద్యార్థులు చదువుకు సంబంధించిన రంగంలో పని అనుభవం పొందే ఆప్షనల్ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ (OPT) ఫీజు 500 డాలర్ల నుంచి ఏకంగా 70,000 డాలర్లకు పెరగనుంది. భారతీయ విద్యార్థులపై ఈ నిర్ణయం ప్రభావం చూపే అవకాశం ఉంది.

F-1 విద్యార్థులకు షాక్.. ఓపీటీ ఫీజు $500 నుంచి $70,000కు పెంపు!
Trump Admin Proposes Hefty Opt Fee For F 1 International Students

Updated on: Oct 08, 2026 | 10:15 PM

అమెరికా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హోమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీ (DHS) ఈ ప్రతిపాదనను తీసుకొచ్చింది. విదేశీ విద్యార్థులు, యజమానులు, విద్యా సంస్థలు F-1 వీసా నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నాయా అనే విషయాన్ని నిర్ధారించడంతో పాటు మోసాలను అరికట్టడం, ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను పటిష్ఠం చేయడం, అమెరికన్‌ ఉద్యోగులను రక్షించడం ఈ ఫీజు ఉద్దేశమని DHS తెలిపింది.

$500 నుంచి ఏకంగా $70,000

ప్రస్తుతం OPT కోసం విద్యార్థులు చెల్లించే మొత్తం 500 డాలర్లు మాత్రమే. దీనిని ప్రతిపాదిత 70,000 డాలర్లతో పోలిస్తే భారీగా పెంచినట్లవుతుంది. F-1 వీసాపై అమెరికాలో చదువుకునే అర్హత ఉన్న విద్యార్థులు తమ చదువుతో సంబంధం ఉన్న ఉద్యోగాల్లో శిక్షణ, పని అనుభవం పొందేందుకు OPT ఉపయోగపడుతుంది. చదువుతున్న సమయంలో అర్హత కలిగిన విద్యార్థులు వారానికి 20 గంటల వరకు పని చేసే అవకాశం ఉంటుంది. గ్రాడ్యుయేషన్‌ తర్వాత కూడా పరిమిత కాలం పాటు ఈ శిక్షణ కొనసాగించవచ్చు.

STEM విద్యార్థులకు అదనపు అవకాశం

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్‌ (STEM) విభాగాల్లో డిగ్రీలు పూర్తిచేసిన విద్యార్థులకు అదనపు కాలం పాటు OPT శిక్షణ పొందే అవకాశం ఉంటుంది. అమెరికాలో ఉన్నత విద్య పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు OPT కీలకంగా మారింది. ముఖ్యంగా టెక్నాలజీ, ఇతర నైపుణ్య ఆధారిత రంగాల్లో ఉద్యోగాలు పొందినవారికి తర్వాత H-1B వీసా కోసం ప్రయత్నించడంలో ఇది ముఖ్యమైన దశ. OPTతో పాటు మరో వర్క్ ట్రైనింగ్‌ ప్రోగ్రామ్‌కు 30,000 డాలర్ల వరకు ఫీజు విధించే ప్రతిపాదన ఉన్నట్లు తెలిసింది. ప్రతిపాదిత నిబంధనలు అమల్లోకి వస్తే అమెరికాలో చదువుకుంటూ పని చేసే అనుభవం పొందాలనుకునే విదేశీ విద్యార్థులపై ఆర్థిక భారం భారీగా పెరిగే అవకాశం ఉంది.

చట్టపరమైన సవాళ్లు వచ్చే అవకాశం

ట్రంప్‌ ప్రభుత్వం విదేశీ విద్యార్థులు, కార్మికులు, వీసా హోల్డర్లకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేస్తున్న సమయంలో ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే దీనిపై ఇప్పటికే ఇమ్మిగ్రేషన్‌, టెక్నాలజీ రంగాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలోనే ఉంది. తుది నిబంధనలు, ఫీజు ఎంత ఉంటుంది, ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అనే అంశాలపై తుది నిర్ణయం రావలసి ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us