2025లో ఇండియన్స్ ఎక్కువగా వెతికింది ఇవే.. గూగుల్ టాప్ సెర్చ్‌లో మహాకుంభమేళా సంచలనం..

2025లో భారతీయులు ఏ టూరిస్ట్ ప్లేస్‌లను ఎక్కువ వెతికారో తెలుసా..? ఊహించని విధంగా ఆధ్యాత్మిక పర్యాటకం బాగా పెరిగింది. వీసా రహిత అంతర్జాతీయ గమ్యస్థానాలైన ఫిలిప్పీన్స్, జార్జియా, మారిషస్, మాల్దీవులతో పాటు దేశీయంగా కశ్మీర్ మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ నివేదిక భారతీయుల ఆధ్యాత్మిక, సహజ సౌందర్య, వీసా రహిత ప్రయాణాలపై దృష్టిని స్పష్టం చేస్తుంది.

2025లో ఇండియన్స్ ఎక్కువగా వెతికింది ఇవే.. గూగుల్ టాప్ సెర్చ్‌లో మహాకుంభమేళా సంచలనం..
Most Searched Travel Destinations 2025

Updated on: Dec 07, 2025 | 11:30 AM

2025 సంవత్సరం ఎండింగ్‌కు వచ్చింది. 2026 నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టడానికి మరికొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. ఈ సందర్భంగా చాలా మంది కొత్త ట్రిప్ ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గూగుల్ 2025లో భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన పర్యాటక ప్రదేశాల జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం ఈ ఏడాది ఆధ్యాత్మిక పర్యాటకం భారీగా పెరిగినట్లు స్పష్టమైంది. ఆ తర్వాత అంతర్జాతీయ వీసా రహిత గమ్యస్థానాలు ప్రముఖంగా నిలిచాయి.

ఆధ్యాత్మిక పర్యాటకానికి అగ్రస్థానం

గూగుల్ సెర్చ్‌లలో అత్యధికంగా సెర్చ్ చేసిన పర్యాటక ప్రదేశాల జాబితాలో మహాకుంభమేళా అగ్రస్థానంలో నిలిచింది. 2025 జనవరి-ఫిబ్రవరిలో ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన ఈ చారిత్రక ఘట్టాన్ని కోట్లాది మంది సందర్శించారు. ఈ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఆధ్యాత్మిక పర్యాటక రంగం పెరుగుదల ఎంత ఎక్కువగా ఉందో స్పష్టమైంది. మహాకుంభమేళా తర్వాత గుజరాత్‌లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సోమనాథ్ కూడా సెర్చ్ జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. ఇది భారతీయులు వినోదంతో పాటు ఆధ్యాత్మికత పట్ల కూడా ఆసక్తి కలిగి ఉన్నారని రుజువు చేసింది.

అంతర్జాతీయంగా అత్యధికంగా శోధించిన దేశాలు

అంతర్జాతీయ గమ్యస్థానాలలో ఫిలిప్పీన్స్ రెండవ స్థానంలో ఉంది. భారతీయులకు వీసా రహిత ప్రవేశం కల్పించిన తర్వాత ప్రత్యక్ష విమాన సేవలు, అందమైన బీచ్‌లతో ఫిలిప్పీన్స్ సందర్శకుల సంఖ్య పెరిగింది. యూరోపియన్ సంస్కృతి కలిగిన దేశమైన జార్జియా తక్కువ బడ్జెట్‌తో ప్రయాణించే అవకాశం, వీసా పొందడం సులభం కావడం వల్ల భారతీయ ప్రయాణికులను ఆకర్షించింది.

వీసా రహిత ద్వీప దేశాల ఆదరణ

వీసా రహిత ప్రవేశం కారణంగా ద్వీప దేశాలు కూడా భారతీయులకు ఇష్టమైనవిగా మారాయి. మారిషస్ నూతన వధూవరులను, సాహస ప్రియులను కూడా ఆకర్షించి, అత్యధికంగా కోరుకునే గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది. విలాసవంతమైన రిసార్ట్‌లు, అద్భుతమైన నీలి సముద్రాలకు ప్రసిద్ధి చెందిన మాల్దీవులు కూడా రాజకీయ సంక్షోభం ఉన్నప్పటికీ ఇష్టమైన గమ్యస్థానాలలో ఒకటిగా కొనసాగింది.

ఆసియాలోని ఇతర గమ్యస్థానాలు

ఫు క్వాక్ (వియత్నాం) ద్వీపం ఈ సంవత్సరం ప్రజాదరణలో అనూహ్య పెరుగుదలను చూసింది. అందమైన బీచ్‌లు, గొప్ప రిసార్ట్‌లు. సరళమైన ఇ-వీసా నియమాలు ఈ ద్వీపాన్ని బెస్ట్ ఆప్షన్‌గా మార్చాయి. అదేవిధంగా వీసా రహిత ప్రవేశం, మనోహరమైన బీచ్‌లతో ఫుకెట్ (థాయిలాండ్‌) కూడా భారతీయులను ఆకర్షించింది.

దేశీయ ఆకర్షణగా కశ్మీర్

ఈ ఏడాది ఏప్రిల్ 22న పహల్గామ్ దాడిలో 26 మంది మరణించిన తర్వాత కాశ్మీర్ పర్యాటకం క్షీణించిందని భావించినప్పటికీ ఈ ప్రాంతం సెర్చ్ జాబితాలో ప్రముఖ స్థానంలో నిలిచింది. కాశ్మీర్ దాని అందమైన ప్రదేశాలతో పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉంది. మొత్తంగా 2025లో భారతీయలు అంతర్జాతీయ వీసా రహిత గమ్యస్థానాలపై, అలాగే దేశంలోని ఆధ్యాత్మిక, సహజ సౌందర్య ప్రదేశాలపై కూడా దృష్టి పెట్టినట్లు ఈ గూగుల్ నివేదిక తేటతెల్లం చేసింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..