నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే..

శతాబ్దాలుగా మనల్ని అబ్బురపరుస్తున్న వింతల్లో పాముల పట్టే విద్య ఒకటి. నాగస్వరానికి పాము మైమరిచిపోయి లయబద్ధంగా ఊగుతుందేమో అని అనుకుంటే పొరపాటే. అసలు వినికిడి శక్తే లేని పాము ఆ రాగాలకు ఎలా ఊగుతుంది? దీని వెనుక ఉన్నది మంత్రాల మాయాజాలమా? లేక సైన్సా? అనే ఆసక్తికర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

నాగస్వరానికి పాములు లొంగిపోతాయా.. వందల ఏళ్ల మాయ వెనకున్న అసలు నిజం ఇదే..
The Science Of Snake Charming

Updated on: Jul 27, 2026 | 11:12 AM

బుట్టలోంచి తల పైకెత్తి, నాగస్వరం సంగీతానికి మైమరిచిపోయి ఊగుతున్న పామును మనం సినిమాల్లోనూ, వీధుల్లోనూ ఎన్నోసార్లు చూసే ఉంటాం. ఆ మంత్రముగ్ధమైన దృశ్యం చూసి పాము సంగీతానికి దాసోహమైందని, అదొక ఆధ్యాత్మిక శక్తి అని చాలామంది భావిస్తారు. ఈజిప్ట్ కాలం నుండి ప్రారంభమై, మన దేశంలో ఒకానొక కాలంలో ఎంతో ప్రాచుర్యం పొందిన ఈ పాముల విద్య వెనుక ఉన్నది మంత్రం కాదని, కేవలం సైన్స్ మాత్రమేనని శాస్త్రవేత్తలు, వణ్యప్రాణి నిపుణులు చెబుతున్నారు.

పాములకు అసలు వినికిడి శక్తి ఉందా?

నాగస్వరం నుంచి వచ్చే మధురమైన రాగాలను విని పాము నాట్యం చేస్తోందని అనుకుంటే అది పొరపాటే. మానవుల లాగా లేదా ఇతర క్షీరదాల లాగా పాములకు వెలుపలి చెవులు గానీ, కర్ణభేరి గానీ ఉండవు. వాటి లోపలి చెవి నిర్మాణం పుర్రె ఎముకల లోపల ముసిపోయి ఉంటుంది. అందువల్ల నాగస్వరంలోంచి వచ్చే ఏ హెచ్చుస్థాయి శబ్దాలను, సంగీతాన్ని పాములు వినలేవు. అయితే తమ దవడ ఎముకల ద్వారా నేల నుంచి వచ్చే కంపనాలను మాత్రమే అవి పసిగట్టగలవు. అంటే నాగస్వరం శబ్దానికి కాకుండా నేలపై కలిగే అదురును మాత్రమే అవి గ్రహిస్తాయి.

ఊగేది నాట్యం కోసం కాదు.. ప్రాణ రక్షణ కోసం..

సంగీతానికి మైమరచి ఊగుతున్నట్లు కనిపించే పాము, నిజానికి తీవ్రమైన భయంతో తనను తాను కాపాడుకోవడానికి సిద్ధమవుతున్న స్థితిలో ఉంటుంది.

బెదిరింపు ప్రతిస్పందన: బుట్ట మూత తీయగానే ఒక్కసారిగా వెలుగు పడటంతో పాటు ఎదురుగా పెద్ద మనిషి కనిపిస్తాడు. దీంతో పాము భయపడి, తనను తాను రక్షించుకోవడానికి పడగ విప్పి పెద్దదిగా కనిపింపజేస్తుంది.

నాగస్వరం కదలికలే కారణం: పాముల పట్టే వ్యక్తి తన నాగస్వరాన్ని అటూ ఇటూ తిప్పుతున్నప్పుడు, ఆ వస్తువును ఒక ప్రమాదకరమైన శత్రువుగా భావించి పాము దాన్ని తన చూపు పరిధిలోనే ఉంచుకోవడానికి యత్నిస్తుంది. నాగస్వరం ఎటు ఊగితే, పాము కళ్లు కూడా అటువైపుగా కదులుతాయి.

భ్రమ కలిగించే కదలికలు: ప్రదర్శనకారుడు నెమ్మదిగా ఊగుతూ, నేలపై కాళ్లతో తడుతూ పామును కంగారు పెడతాడు. చూసేవారికి పాము నాట్యం చేస్తున్నట్లు అనిపించినా, పాము దృష్టిలో అది తన ప్రాణాలు కాపాడుకోవడానికి చేసే పోరాటం మాత్రమే.

కనిపించని క్రూరత్వం.. అంతరించిపోతున్న కళ

పాముల విద్య చూడటానికి ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ దాని వెనుక తీవ్రమైన జీవ హింస దాగి ఉందనేది చేదు నిజం. పాము తనపై దాడి చేయకుండా ఉండేందుకు ప్రదర్శనకారులు కొందరు దారుణమైన మార్గాలను ఎంచుకుంటారు. పాము విషపు కోరలను పీకేయడం, విష గ్రంథులను తొలగించడం, నిద్రమాత్రలు లేదా మత్తు పదార్థాలు ఇవ్వడం, దాడి చేసే శక్తి లేకపోయేలా పస్తులు ఉంచడం వంటివి చేస్తుంటారు. దీనివల్ల చాలా పాములు తీవ్రంగా గాయపడటమే కాకుండా చనిపోతుంటాయి.

చట్టాలు – ప్రస్తుత పరిస్థితి

పాములపై జరుగుతున్న ఈ అన్యాయాలను అరికట్టేందుకు, జీవ వైవిధ్య పరిరక్షణలో భాగంగా అటవీ జీవుల సంరక్షణ చట్టం 1972 ద్వారా భారతదేశంలో పాములను పట్టుకోవడం, సొంతంగా ఉంచుకోవడాన్ని ప్రభుత్వం నిషేధించింది. కాలక్రమేణా కఠిన చట్టాలు అమలులోకి రావడంతో ఒకప్పుడు విస్తృతంగా కనిపించిన ఈ ప్రాచీన ప్రదర్శనలు ఇప్పుడు దాదాపుగా కనుమరుగైపోయాయి. అత్యంత ప్రమాదకరమైన విషపూరిత పాములను సైతం తమ సైగలతో లొంగదీసుకుంటున్నట్లు కనిపించే ఈ విద్య.. మంత్రాల మాయాజాలం కాదని, కేవలం ఒక జీవి మనుగడ సాగించే నైజం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Follow Us