
ప్రేమకు చిహ్నంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన చారిత్రక కట్టడం తాజ్‌మహల్ శరద్ పూర్ణిమ అంటే..ఆశ్వయుజ పౌర్ణమి పర్వదినం సందర్భంగా సరికొత్త శోభను సంతరించుకుంది. పౌర్ణమి వెన్నెల కాంతుల్లో తడిచిముద్దయిన తెల్లటి పాలరాతి గోపురాలు ధగధగ మెరుస్తూ పర్యాటకులను కనువిందు చేశాయి. ఈ అద్భుతమైన రాత్రి సౌందర్యాన్ని కనులారా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి భారీ సంఖ్యలో పర్యాటకులు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా నగరానికి తరలివచ్చారు. నిండు పున్నమి రాత్రి వెండి వెలుగుల్లో మెరిసిపోతున్న తాజ్‌మహల్‌ను చూసి సందర్శకులు మంత్రముగ్ధులయ్యారు.
సాధారణంగా తాజ్‌మహల్‌ను పగటిపూట సందర్శించడం ఒకెత్తైతే, పౌర్ణమి వెన్నెల రాత్రి చూడటం మరొక అద్భుత అనుభూతి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా భారత పురాతత్వ సర్వేక్షణ సంస్థ ప్రతి నెలా పౌర్ణమి రోజుతో పాటు దానికి ముందు రెండు రోజులు, ఆ తర్వాత రెండు రోజులు కలుపుకుని మొత్తం ఐదు రోజుల పాటు రాత్రి వేళల్లో తాజ్‌మహల్ సందర్శనకు ప్రత్యేక అనుమతులు ఇస్తుంది. శరద్ పూర్ణిమ సందర్భంగా ఈ వీక్షణ మరింత ప్రత్యేకతను సంతరించుకుంది.
తాజ్‌మహల్ రాత్రి దర్శనం కోసం ఏఎస్ఐ కట్టుదిట్టమైన నిబంధనలను అమలు చేస్తోంది. రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య ఈ ప్రత్యేక ప్రవేశం ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా పర్యాటకులను గరిష్ఠంగా ఎనిమిది బ్యాచ్‌లుగా విభజించి, ప్రతి బ్యాచ్‌కు కేవలం 50 మంది చొప్పున ఒక రోజులో మొత్తం 400 మందికి మాత్రమే అనుమతిస్తారు. ఈ కఠినమైన నిబంధనల మధ్యే పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఈ అరుదైన అవకాశాన్ని దక్కించుకుంటున్నారు.
శరద్ పూర్ణిమ నాడు ఆకాశంలో వెన్నెల అత్యంత ప్రకాశవంతంగా ఉంటుంది. ఆ వెన్నెల కిరణాలు తాజ్‌మహల్‌లోని స్వచ్ఛమైన తెల్లటి పాలరాతి గోపురాలు, సున్నితమైన చెక్కుడు పనులపై పడినప్పుడు వెలువడే కాంతులు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. యమునా నది తీరాన వెన్నెల్లో మెరుస్తున్న ఈ మహాద్భుత కట్టడాన్ని చూస్తూ పర్యాటకులు పరవశించిపోయారు. ఈ మరపురాని అనుభూతిని తమ కెమెరాలలో బంధిస్తూ పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. సంస్కృతి, చరిత్ర ఉట్టిపడే ఈ పౌర్ణమి వేడుక ఆగ్రా పర్యాటక రంగంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.