
అమెరికా మంత్రి రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ మరోసారి తన విచిత్రమైన చర్యలతో వార్తల్లో నిలిచారు. పామును పట్టుకోవడానికి అత్యుత్సాహం చూపడంతో అది కాటేసింది. అమెరికా ఆరోగ్య, మానవ సేవల కార్యదర్శి రాబర్ట్ ఎఫ్.కెన్నెడీ జూనియర్ ఫ్లోరిడాలోని ప్రముఖ డాక్టర్ ఓజ్ ఇంటిపై రెండు బ్లాక్ రేసర్ జాతి పాములు కనిపించాయి. వెంటనే కెన్నెడీ వాటిని తన చేతుల్లోకి తీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇంతలో ఓ పాము ఆయన చేతిపై కాటు వేసింది. అది విషపూరితమైన పాము కాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అసలేం జరిగిందంటే..
ఫ్లోరిడాకు చెందిన ఈ వీడియోలో ఆర్‌ఎఫ్‌కే జూనియర్ రెండు పెద్ద పాములను చేతులతో పట్టుకుని కనిపించారు. ఈ సమయంలో ఆయన భార్య Cheryl Hines జాగ్రత్తగా ఉండమని హెచ్చరించడం వీడియోలో వినిపించింది. అయితే ఒక్కసారిగా పాముల్లో ఒకటి ఆయన చేతిపై కాటు వేసింది. అయినప్పటికీ ఆయన నవ్వుతూనే ఉండటం వీడియోలో చూడొచ్చు. డాక్టర్ ఓజ్ పామ్ బీచ్ నివాసంలోని పేటియో ప్రాంతంలో ఉన్న పాములను ఆయన బయటకు తీస్తున్న క్రమంలో పాము ఆయన చేతిపై కాటు వేసింది.
విదేశీ మీడియా కథనాల ప్రకారం అవి “సదర్న్ బ్లాక్ రేసర్” అనే జాతికి చెందిన పాములు. ఇవి ఫ్లోరిడాలో సాధారణంగా కనిపిస్తాయి. వేగంగా కదిలే ఈ పాములు మనుషులకు పెద్దగా హానికరం కావు. అయినప్పటికీ ఈ పాములను చేతులతో పట్టుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో మీమ్స్, జోకులు వెల్లువెత్తాయి. కొందరు ఆయనను “ఫ్లోరిడా ఫైనల్ బాస్” అంటూ కామెంట్ చేశారు. మరికొందరు “ఆర్‌ఎఫ్‌కే జూనియర్ పాములను పట్టుకోవడం చూస్తే మొబైల్ చార్జింగ్ వైర్లు పట్టుకున్నట్టుంది” అంటూ వ్యంగ్యంగా స్పందించారు. ఇంకొందరు అమెరికా రాజకీయాలు మాత్రమే ఇప్పటి వరకు వింతగా ఉన్నాయి, ఇప్పుడు పాములతో ఆడుకోవడం కొత్త లెవెల్ అంటూ పోస్టులు పెట్టారు.
Cheryl cheerleads the removal of a pair of Black Racers from Dr Oz’s patio. pic.twitter.com/A0iiRzOeIF
— Robert F. Kennedy Jr (@RobertKennedyJr) May 26, 2026
కాగా ఫ్లోరిడాలో 40కి పైగా పాముల జాతులు ఉన్నాయి. వాటిలో కొన్ని అత్యంత విషపూరితమైనవి కూడా. పాములను పట్టుకోవడానికి శిక్షణ పొందిన నిపుణులు ప్రత్యేక గ్లోవ్స్, హుక్స్, రక్షణ పరికరాలు ఉపయోగిస్తారు. సాధారణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అడవి పాములను తాకకూడదని నిపుణులు చెబుతున్నారు. అయితే నేటి కాలంలో సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసం చాలామంది ప్రమాదకరమైన పనులు చేస్తున్నారు. ముఖ్యంగా పాములు వంటి విషసర్పాల విషయంలో సరైన అవగాహన లేకుండా దగ్గరికి వెళ్లడం ప్రాణాపాయానికి దారితీస్తుంది.