
వాహనంలో ఫుల్‌గా పెట్రోల్ కొట్టించినా.. మైలేజ్ రావడం లేదని లేదా ట్యాంక్ త్వరగానే ఖాళీ అయిపోతుందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అయితే మీరు పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాల బారిన పడి ఉండవచ్చు. బంకుల్లోని సిబ్బంది మీ కళ్లు కప్పి చాలా సులువుగా పెట్రోల్ చోరీకి పాల్పడుతుంటారు. ఇలాంటి ఇంధన స్కామ్‌ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి, మీ డబ్బును ఆదా చేసుకోవడానికి నిపుణులు కొన్ని సింపుల్ ట్రిక్స్ సూచించారు. వాటి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.
చాలామంది వాహనదారులు బంకుకు వెళ్లినప్పుడు రూ.100, రూ.200, రూ.500 లేదా రూ.1000 అంటూ రౌండ్ ఫిగర్‌తో పెట్రోల్ కొట్టిస్తారు. అయితే కొన్ని బంకుల్లోని మిషన్లలో ఈ రౌండ్ ఫిగర్ నంబర్లకు ముందే చిప్స్ లేదా కోడ్‌ల ద్వారా రీడింగ్ సెట్ చేసి ఉంచుతారనే ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల మీకు డబ్బుకు తగ్గ పెట్రోల్ రాదు. అందుకే ఇకపై ఇంధనం నింపేటప్పుడు రూ.101, రూ.204, రూ.509 లేదా రూ.1005 తో చెప్పి పెట్రోల్ పోయించుకోండి. దీనివల్ల మోసపోయే అవకాశం చాలా వరకు తగ్గుతుంది.
పెట్రోల్ బంకు సిబ్బంది మీ వాహనం ట్యాంకులో పైప్ పెట్టకముందే డిజిటల్ స్క్రీన్‌పై 0.00 రీడింగ్ ఉందో లేదో ఖచ్చితంగా గమనించాలి. కొన్నిసార్లు సిబ్బంది మీ దృష్టిని మళ్లించి, అంతకుముందు వాహనదారుడు కొట్టించిన రీడింగ్ నుండే ఇంధనాన్ని కొనసాగిస్తారు. దీనివల్ల మీకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది.
మీరు బంకులో ఉన్నప్పుడు మీ పూర్తి దృష్టి కేవలం రీడింగ్ మీటర్, నోజిల్ పైనే ఉండాలి. అక్కడ సిబ్బంది మాట్లాడే మాటలకు లోనవ్వడం, ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా ఉండటం లేదా అటుఇటూ చూడటం వంటివి చేస్తే వారు సులువుగా మిమ్మల్ని మోసం చేస్తారు. ఒకవేళ మీటర్ రీడింగ్ సాధారణం కంటే చాలా వేగంగా తిరుగుతున్నట్లు అనిపిస్తే ఏదో గందరగోళం ఉందని గ్రహించాలి.
ప్రతి పెట్రోల్ బంక్ మెషీన్, నోజిల్‌పై ప్రభుత్వ తూనికలు, కొలతల శాఖ వారి అధికారిక సీల్ ఉండాలి. ఒకవేళ ఈ సీల్స్ విరిగిపోయి ఉన్నా లేదా అనుమానాస్పదంగా అనిపించినా ఆ మెషీన్ సెట్టింగ్స్‌తో ఏదో తేడా చేశారని అర్థం చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ హ్యాకింగ్ ద్వారా స్క్రీన్‌పై నంబర్లు సరిగ్గా కనిపించినా, లోపల తక్కువ ఇంధనం పడేలా మేగ్నెటిక్ చిప్స్ అమర్చే ముఠాలు కూడా ఉంటాయి. అవాంతర లేదా నమ్మకం లేని ప్రైవేట్ బంకుల కంటే.. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి పేరున్న భరోసా కలిగిన ప్రభుత్వ బంకుల్లో పెట్రోల్ నింపుకోవడం ఎల్లప్పుడూ సురక్షితం. అక్కడ నాణ్యత, పరిమాణాల నియమాలు చాలా కఠినంగా ఉంటాయి.