
నేటి ఆధునిక ప్రపంచంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతిదీ ఆన్‌లైన్‌లోనే దొరుకుతోంది. ఉప్పు నుండి పప్పు వరకు, పిన్ నుండి విమానం టికెట్ల వరకు అన్నీ ఇంటి వద్దకే వస్తున్నాయి. కానీ, మీరు ఎప్పుడైనా ఆన్‌లైన్‌లో లైవ్ మేక డెలివరీ అవ్వడం చూశారా? వినడానికి వింతగా ఉన్నా, ఇది నిజం. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌లో @log.kya.kahenge అనే హ్యాండిల్ ద్వారా షేర్ చేయబడిన ఒక వీడియో ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో సూరత్‌లోని ఒక పార్శిల్ గోదాం (Warehouse) లో ఒక మేక కట్టిపడేసి ఉంది. విశేషమేమిటంటే, ఆ మేక వీపుపై ఆన్‌లైన్ షాపింగ్ సైట్‌లలో ఉండేటటువంటి QR కోడ్, అడ్రస్ స్టిక్కర్ (Delivery Label) అంటించి ఉంది. ఎవరో వ్యక్తి ఈ మేకను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశారని, అందుకే దీనిని కొరియర్ ద్వారా పంపించారని ఆ వీడియో చూస్తే తెలుస్తోంది.
ఈ వీడియో చూసిన నెటిజన్లు విస్తుపోతున్నారు. దీనిపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. చాలా మంది ఫన్నీగా స్పందించారు. ఇకపై పెళ్లిళ్లకు మేకలను కూడా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవచ్చన్నమాట అని కొందరు జోకులు వేస్తున్నారు. మరోవైపు జంతు ప్రేమికులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జీవించి ఉన్న జంతువును వస్తువులా భావించి ఇలా కొరియర్ చేయడం ఏంటి? ప్రయాణంలో దానికి గాలి, నీరు, ఆహారం ఎవరు అందిస్తారు? ఇది అమానవీయం అంటూ మండిపడుతున్నారు.
టెక్నాలజీ మన జీవితాలను సులభతరం చేస్తోంది అనడంలో సందేహం లేదు. కానీ, ప్రాణం ఉన్న మూగజీవాలను కూడా ఇలా వ్యాపార వస్తువుల్లా మార్చేయడంపై సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ వీడియో నిజంగా ఆన్‌లైన్ డెలివరీకి సంబంధించిందా లేక ఎవరైనా సరదాగా షూట్ చేశారా అన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ ఆన్‌లైన్ మేక మాత్రం ప్రస్తుతం ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..