
తల్లి ప్రేమకు హద్దులు ఉండవు. పిల్లలు ఏ రంగంలో విజయం సాధించినా.. వారి కంటే ఎక్కువగా సంతోషించేది తల్లే. పిల్లల కలలను నిజం చేయడానికి తల్లి చేసే ప్రయత్నాలు వెలకట్టలేనివి. అలాంటి మాతృప్రేమకు అద్దం పట్టే ఓ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కూతురు వేదికపై నృత్యం చేస్తుంటే.. ప్రేక్షకుల మధ్య కూర్చున్న తల్లి కూడా ఆమెతో పాటు ప్రతి స్టెప్పును వేస్తూ కనిపించింది. ఈ దృశ్యం నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.
కూతురు డ్యాన్స్.. తల్లి మాత్రం ఫుల్ బిజీ!
తమిళనాడులోని మదురై పుస్తక మహోత్సవం 2026లో ఈ అందమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ కార్యక్రమంలో సాంప్రదాయ దుస్తులు ధరించిన ఓ యువతి వేదికపై తమిళ పాటకు అద్భుతంగా నృత్యం చేస్తోంది. నీలం, గులాబీ రంగుల చీరలో ఆమె ఎంతో ఉత్సాహంగా తన ప్రదర్శన కొనసాగిస్తోంది. అయితే ప్రేక్షకుల ముందు వరుసలో కూర్చున్న ఆమె తల్లి మాత్రం కూతురు డ్యాన్స్‌ను చూస్తూ ఉండలేకపోయింది. నారింజ రంగు చీర ధరించిన ఆమె.. కూతురు వేస్తున్న ప్రతి స్టెప్పును, చేతి కదలికలను, ముఖ కవళికలను తన సీటులో కూర్చునే అనుకరిస్తూ కనిపించింది. కూతురు ఎక్కడా తడబడకుండా ప్రదర్శన పూర్తి చేయాలనే ఆ తల్లి ఆరాటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
చివర్లో తల్లీకూతుళ్ల ఆనందం!
కూతురు తన నృత్య ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వీడియో చివర్లో తల్లీకూతుళ్లిద్దరూ వేదికపై కలిసి నిలబడి చిరునవ్వులు చిందించారు. ఈ దృశ్యం చూసిన వారిని మరింతగా ఆకట్టుకుంటోంది.
నెటిజన్ల భావోద్వేగ కామెంట్లు
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “పిల్లల విజయాన్ని తన విజయంగా భావించేది తల్లి మాత్రమే”, “కూతురు కంటే తల్లే ఎక్కువ ఉత్సాహంగా ఉంది”, “ఈ తల్లీకూతుళ్ల జంటకు ఎవరి దిష్టి తగలకూడదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. కూతురు వేదికపై వేసిన ప్రతి అడుగు వెనుక తల్లి ప్రేమ, ప్రోత్సాహం ఎంత గొప్పగా ఉంటాయో ఈ వీడియో మరోసారి నిరూపిస్తోంది. అందుకే నెటిజన్లు ఈ వీడియోను రోజులోనే అత్యంత అందమైన, హృదయాన్ని తాకే వీడియోగా అభివర్ణిస్తున్నారు.
వైరల్ వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..