
ఉత్తరప్రదేశ్‌లోని మథుర, బృందావనం వంటి పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వారికి అక్కడ ఉండే కోతుల అల్లరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ క్షణాల్లో భక్తుల చేతుల్లోని వస్తువులను, కళ్ళజోళ్లను కోతులు మాయం చేస్తుంటాయి. తాజాగా బృందావనంలోని శ్రీ రాధా రాణి ఆలయ ప్రాంగణంలో జరిగిన ఒక విచిత్రమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఒక కోతి ఒక భక్తుడి చేతిలోని ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను లాక్కొని, ఒక భవనం పైకి ఎక్కి కూర్చుంది.
ఆ ఫోన్ యజమాని, చుట్టుపక్కల ఉన్న భక్తులు ఫోన్ తిరిగి ఇవ్వాలని కోతిని రకరకాలుగా బ్రతిమాలారు. శబ్దాలు చేస్తూ దాన్ని బెదిరించడానికి ప్రయత్నించారు. కానీ, ఆ కోతి మాత్రం ఫోన్‌ను గట్టిగా పట్టుకుని కూర్చుంది కానీ అస్సలు వదల్లేదు. ఫోన్ ఎక్కడ కింద పడేసి పాడుచేస్తుందోనని అందరూ టెన్షన్ పడుతున్న సమయంలో, అక్కడ ఉన్న ఒక స్థానిక వ్యక్తి ఒక అద్భుతమైన ఉపాయం ఆలోచించాడు.
కోతులకు ఫ్రూటీ (Frooti) జ్యూస్ అంటే చాలా ఇష్టమనే విషయాన్ని గ్రహించిన ఆ వ్యక్తి, ఒక ఫ్రూటీ ప్యాకెట్‌ను తీసుకువచ్చి కోతి వైపు విసిరాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ జరిగింది. ఆ కోతి చాలా తెలివిగా ప్రవర్తించింది. గాల్లోకి వచ్చిన ఫ్రూటీ ప్యాకెట్‌ను ఒక చేత్తో పట్టుకుంటూనే, మరో చేతిలో ఉన్న మొబైల్ ఫోన్‌ను ఏమాత్రం ఆలస్యం చేయకుండా కిందకు విసిరేసింది. కింద ఉన్న జనం ఆ ఫోన్‌ను సురక్షితంగా పట్టుకున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
भाई! नीचे से फ्रूटी फेंको, तब जाकर तुम्हारा आईफोन वापस मिलेगा।
No Cash, Only Juice pic.twitter.com/nziD5yioy6
— Dr. Sandeep (@Dr_sandeep01) June 22, 2026
ఈ మొత్తం దృశ్యాన్ని అక్కడ ఉన్న ఎవరో తమ మొబైల్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. కోతి వ్యాపార శైలిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇది పక్కా గివ్ అండ్ టేక్ బిజినెస్, ఈ కోతికి ఉన్న బిజినెస్ మైండ్ ఎవరికీ లేదు, డైరెక్ట్ డీలింగ్.. నో డిస్కౌంట్స్ అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. బృందావనంలో కోతులతో వ్యవహరించేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ వీడియో మరోసారి నిరూపించింది.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…