1.5 కోట్లలో ఒకే ఒక్కటి! ఒకే గర్భనాళంతో నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లి..మరో ట్విస్ట్ ఏంటంటే..

వైద్య విజ్ఞానంలో ఎప్పుడో గానీ కనిపించని ఒక అద్భుతమైన సంఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ నగరంలో చోటుచేసుకుంది. ఏ విధమైన ఫెర్టిలిటీ చికిత్సలు తీసుకోకుండా, సహజ సిద్ధంగా ఒకే కాన్పులో నలుగురు ఆడపిల్లలు జన్మించారు. విశేషమేమిటంటే ఈ నలుగురు పిల్లలు ఒకే పోలికలతో ఉండటమే కాకుండా, తల్లి గర్భంలో ఒకే ప్లాసెంటా (గర్భనాళం)ను పంచుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

1.5 కోట్లలో ఒకే ఒక్కటి! ఒకే గర్భనాళంతో నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చిన తల్లి..మరో ట్విస్ట్ ఏంటంటే..
Identical Quadruplet Girls

Updated on: Jul 21, 2026 | 4:20 PM

ఎలాంటి వైద్యం, మందులు లేకుండా నలుగురు శిశువులు జన్మించడం అత్యంత అరుదు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 7 లక్షల కేసులలో ఇలాంటివి ఒక్కసారి మాత్రమే జరుగుతుందని వైద్యులు అంచనా వేస్తున్నారు. ఇలాంటి అరుదైన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆస్ట్రేలియాకు చెందిన 34 ఏళ్ల జెనీటార్ నాఆమోఆనా అనే మహిళ జూలై 14న రాయల్ బ్రిస్బేన్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో సిజేరియన్ ద్వారా నలుగురు ఆడపిల్లలకు జన్మనిచ్చారు. గర్భధారణ సమయంలో ఒకే అండం నాలుగు భాగాలుగా విడిపోవడం వల్ల ఈ నలుగురు పిల్లలు ఏర్పడ్డారు. దీనిని మోనోజైగోటిక్ క్వాడ్రప్లెట్స్ అని పిలుస్తారు. వైద్యుల ప్రకారం దాదాపు 1.5 కోట్ల ప్రసవాలలో ఒకసారి మాత్రమే ఇలాంటి సంఘటన జరుగుతుంది. ఒకే ప్లాసెంటాను పంచుకోవడం వల్ల పిండాలకు ప్రమాదం ఎక్కువ కాబట్టి వైద్యులు ఆమెను 25వ వారం నుంచే ఆసుపత్రిలో ఉంచి నిరంతరం పర్యవేక్షించారు.

పుట్టిన నలుగురు పాపలు ఆరోగ్యంగా జన్మించిన తర్వాత వారికి ఎమిలీ, హ్యారియెట్, కేథరిన్, అలెక్సా అని పేర్లు పెట్టారు. ఇందులో నాల్గవ పాపకు అలెక్సా అనే పేరును, ఈ సంక్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రాథమిక వైద్యురాలు డాక్టర్ అలెక్సా బెండల్ గౌరవార్థం పెట్టడం విశేషం. ప్రస్తుతం ఈ చిన్నారులను ఐసీయూలోని ఇంక్యుబేటర్లలో ఉంచి సంరక్షిస్తున్నారు.

జెనీటార్, ఆమె భర్త జోర్థమ్‌లకు అప్పటికే 1 నుండి 10 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న నలుగురు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురు పాపల రాకతో వారి కుటుంబ సభ్యుల సంఖ్య ఏకంగా 10కి చేరింది. అంత పెద్ద కుటుంబాన్ని ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి పాత కారు సరిపోకపోవడంతో, వారు 10-సీటర్ల పెద్ద వ్యాన్ కొనుగోలు చేయడానికి GoFundMe అనే వెబ్‌సైట్ ద్వారా ప్రజలను ఆర్థిక సాయం కోరారు. ఈ వినూత్న కథనం నెటిజన్లను ఆకట్టుకోవడంతో ఇప్పటికే వేలాది డాలర్ల విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us