Video: పులి దాడిలో వ్యక్తి దుర్మరణం!

ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. పులులు ఉండే ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లిన ఓ వ్యక్తిపై పులి దాడి చేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో పార్క్‌లో కలకలం రేగింది. సందర్శకులను వెంటనే బయటకు పంపించిన అధికారులు, పార్క్‌ను తాత్కాలికంగా మూసివేశారు.

Video: పులి దాడిలో వ్యక్తి దుర్మరణం!
Man Killed By Tiger After Entering Enclosure In Wildlife Park

Updated on: Oct 11, 2026 | 9:22 AM

ఇంగ్లండ్‌లోని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం 1.35 గంటల సమయంలో ఓ వ్యక్తి పులుల ఎన్‌క్లోజర్‌లోకి ప్రవేశించినట్లు పోలీసుల కు సమాచారం అందింది. ఆ వెంటనే పులి అతడిపై దాడి చేసింది. దాడిలో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని కాపాడేందుకు పోలీసులు, వైద్య సిబ్బంది ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు ఫలించలేదు. తీవ్ర గాయాల కారణంగా అతడు ఘటనాస్థలంలోనే మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలను పోలీసులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే, అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని, వారికి ప్రత్యేక అధికారులు సహాయం అందిస్తున్నారని తెలిపారు.

సందర్శకులను బయటకు పంపించిన అధికారులు

ఈ ఘటన జరిగిన వెంటనే వైల్డ్‌లైఫ్ పార్క్‌లో అత్యవసర చర్యలు చేపట్టారు. సందర్శకులను అక్కడి నుంచి బయటకు పంపించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పార్క్‌ను ఆదివారం వరకు మూసివేయనున్నట్లు యాజమాన్యం ప్రకటించింది.
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తమ సిబ్బంది వెంటనే స్పందించారని, సంబంధిత అధికారులతో కలిసి ఘటనకు దారితీసిన పరిస్థితులను పరిశీలిస్తున్నామని పార్క్ యాజమాన్యం తెలిపింది. సందర్శకులు, సిబ్బంది, జంతువుల భద్రతే తమకు ముఖ్యమనీ పార్క్ బయట ఉన్న ప్రజలకు ఎలాంటి  ముప్పు లేదని స్పష్టం చేశారు. మరోవైపు, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ దృశ్యాలు బాధాకరంగా ఉండటంతో వాటిని షేర్ చేయవద్దని పోలీసులు ప్రజలను కోరారు.

అంతరించిపోతున్న అముర్ పులులకు నిలయం

యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ 2009లో ప్రారంభమైంది. ఇందులోని ‘ల్యాండ్ ఆఫ్ ది టైగర్స్’ విభాగాన్ని 2011లో ఏర్పాటు చేశారు. దాదాపు రెండు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రత్యేక ప్రదేశంలో అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న అముర్ పులులను సంరక్షిస్తున్నారు. వీటిని సైబీరియన్ పులులు అని కూడా పిలుస్తారు.

ప్రస్తుతం అడవుల్లో సుమారు 500 అముర్ పులులు మాత్రమే మిగిలి ఉన్నట్లు అంచనా. సందర్శకులు పులులను దగ్గరగా వీక్షించేందుకు పార్క్‌లో సుమారు 300 మీటర్ల పొడవైన ఎత్తైన నడక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ మార్గం నుంచి పులులు అడవి తరహా వాతావరణంలో సంచరించడం, జలపాతం వద్ద ఆడుకోవడం చూడవచ్చు.

అయితే, ఆ వ్యక్తి ఎన్‌క్లోజర్‌లోకి ఎలా ప్రవేశించాడు? ఘటనకు ముందు అక్కడ ఏం జరిగింది? అనే విషయాలు ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Loading...
Unable to load recommendations.
Follow Us