
పశ్చిమాసియాలో యుద్ధం తీవ్ర రూపం దాల్చుతోంది! సౌదీ అరేబియా రాజధాని రియాద్ పేలుళ్లలో దద్దరిల్లింది. కింగ్ ఖాలిద్ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించినట్లు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. ఈ ఘటనతో రియాద్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీలోని భారతీయులు జాగ్రత్త అంటూ భారత రాయబార కార్యాలయం అడ్వైజరీ జారీ చేసింది.
మరోవైపు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు రియాద్ వైపు దూసుకొచ్చిన రెండు క్షిపణులను అడ్డుకున్నట్లు తెలిపాయి. రియాద్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో సౌదీ అరేబియాలోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. భారతీయులంతా అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దనీ, ఇళ్లలోనే ఉండాలని, అధికారిక మార్గాల ద్వారా జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని ఎంబసీ కోరింది.
రియాద్‌లో పేలుళ్ల నేపథ్యంలో విమాన రాకపోకలపైనా ప్రభావం పడింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ రియాద్‌కు వెళ్లే, అక్కడి నుంచి బయలుదేరే విమానాలను అక్టోబర్ 10 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఢిల్లీ నుంచి రియాద్‌కు వెళ్తున్న ఓ ఎయిర్ ఇండియా విమానం మధ్యలోనే వెనుదిరిగింది. రియాద్ విమానాశ్రయం సమీపంలో హౌతీ దాడి జరిగినట్లు వచ్చిన సమాచారంతో ఈ నిర్ణయం తీసుకుంది. అకాసా ఎయిర్ కూడా రియాద్‌కు సంబంధించిన విమానాలను రద్దు చేసింది. రియాద్‌లో వరుస పేలుళ్లు, హౌతీల క్షిపణి దాడి ప్రకటన, విమానాల రద్దుతో గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్న సౌదీ అధికారులు.. ప్రజలు అధికారిక సూచనలు పాటించాలని కోరుతున్నారు.