ఇంటి మేడ పై కుంకుమ పువ్వు సాగు.. AIతో కేరళ వ్యక్తి అద్భుతం.. గ్రాముకు రూ.650!

కుంకుమ పువ్వు (Saffron) అనగానే మనకు గుర్తొచ్చేది కశ్మీర్‌. అక్కడి చల్లని వాతావరణంలో ఈ ఖరీదైన పంట ఎక్కువగా సాగవుతుంది. కేరళకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటి పైకప్పుపైనే కుంకుమ పువ్వును పండిస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టెక్నాలజీ సాయంతో పంటను సాగు చేస్తూ గ్రాము కుంకుమ పువ్వును రూ.650కు విక్రయిస్తున్నారు. ఇంతకీ ఈ సాగును ఎలా చేస్తున్నారో తెలుసుకుందాం.

ఇంటి మేడ పై కుంకుమ పువ్వు సాగు.. AIతో కేరళ వ్యక్తి అద్భుతం.. గ్రాముకు రూ.650!
Kerala Man Grows Kashmir Saffron On His Rooftop Using Ai

Updated on: Nov 02, 2026 | 10:58 PM

కేరళలోని త్రిస్సూర్‌కు చెందిన జేమ్స్ కప్పాని 20 ఏళ్లు సౌదీ అరేబియాలోని మిలిటరీ విభాగంలో పనిచేశారు. 2022లో స్వదేశానికి తిరిగి వచ్చిన ఆయన సొంతంగా వ్యాపారం చేయాలని భావించారు. కేరళ నుంచి కూరగాయలను ఎగుమతి చేసే వ్యాపారం ప్రయత్నించారు.  స్థానికంగా అవసరమైన స్థాయిలో కూరగాయలు లభించక ముంబై, తమిళనాడు నుంచి సరుకును తెప్పించాల్సి వచ్చేది.  ఆ వ్యాపార ఆలోచనను పక్కన పెట్టారు.

అదే ఏడాది వ్యాపార పనుల నిమిత్తం జమ్మూ కశ్మీర్‌లోని పాంపోర్‌కు వెళ్లిన జేమ్స్‌కు ఓ ఆసక్తికర విషయం తెలిసింది. నవంబర్ నెలలో అక్కడి పొలాలు ఊదా రంగు పూలతో నిండిపోయి కనిపించాయి. స్థానికులను అడిగి తెలుసుకోగా అవి కుంకుమ పువ్వు పూలని తెలిసింది. పూలలోని ఎరుపు రంగు భాగాలను సేకరించి ఖరీదైన కుంకుమ పువ్వును తయారు చేస్తారని తెలుసుకున్నారు.

మొదట విఫలం.. ఆ తర్వాత ఏఐ సాయంతో విజయం

కశ్మీర్‌లో పండే కుంకుమ పువ్వును కేరళలో ఎందుకు పండించకూడదన్న ఐడియాతో సాగు మొదలుపెట్టారు. జేమ్స్ మొదట కశ్మీర్ నుంచి ఒక కిలో కుంకుమ పువ్వు దుంపలను (Corms) కొనుగోలు చేశారు.  సాగు పద్ధతులపై అవగాహన లేకపోవడంతో తొలి ప్రయత్నం విఫలమైంది. పంట సాగుకు అవసరమైన పరిస్థితులపై పరిశోధన చేశారు. కుంకుమ పువ్వు పెరగడానికి తగిన ఉష్ణోగ్రత, తేమ, వెలుతురును కృత్రిమంగా అందించాల్సిన అవసరం ఉందని గుర్తించారు. 2025లో త్రిస్సూర్‌లోని తన ఇంటి పైకప్పుపై 150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రత్యేక సాగు గదిని ఏర్పాటు చేశారు. ఉష్ణోగ్రతను తగ్గించే చిల్లర్, మొక్కలకు అవసరమైన వెలుతురు అందించే గ్రో లైట్లు, గాలిలో తేమను పెంచే హ్యూమిడిఫైయర్లు, తేమను తగ్గించే డీహ్యూమిడిఫైయర్లను గదికి అమర్చారు.

ఏఐతో ఉష్ణోగ్రత, తేమ నియంత్రణ

 

 

 

జేమ్స్ తన కుమారుల సాయంతో ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ వ్యవస్థను రూపొందించారు. ఇది సాగు గదిలోని ఉష్ణోగ్రత, తేమ, వెలుతురును నియంత్రించడంలో సహాయపడుతుంది. ప్రతి అంశాన్ని ఎప్పటికప్పుడు చేతితో పరిశీలించాల్సిన అవసరాన్ని తగ్గించింది. కుటుంబ సభ్యులు  పంట కోత, పూల నుంచి కుంకుమ పువ్వును వేరు చేయడం, ప్రాసెసింగ్ వంటి పనుల్లో సహాయం చేస్తారు. జేమ్స్ ఏరోపోనిక్స్ విధానం ఉపయోగిస్తున్నారు. ఈ పద్ధతిలో మొక్కల వేర్లకు నీరు, పోషకాలను తుంపర్ల రూపంలో అందిస్తారు. సంప్రదాయ సాగు పద్ధతులకు భిన్నంగా, నియంత్రిత వాతావరణంలో పంటను పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది.

తొలి పంటలో 400 గ్రాముల కుంకుమ పువ్వు

 

 

సాగు గది సిద్ధమైన తర్వాత జేమ్స్ కశ్మీర్‌లోని పాంపోర్ నుంచి 150 కిలోల కుంకుమ పువ్వు దుంపలను కొనుగోలు చేశారు. ఒక్కో కిలోకు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు చెల్లించారు. వాటిని 180 నిలువు ట్రేలలో నాటారు. ఈ ప్రయత్నంలో  తొలి పంటగా 400 గ్రాముల కుంకుమ పువ్వు సాగైంది.  సొంత బ్రాండ్ పేరుతో గ్రాముకు రూ.650 చొప్పున విక్రయించారు. 2026లో మరో సాగును ప్రారంభించిన జేమ్స్  500 గ్రాముల పంట వస్తుందని ఆశిస్తున్నారు.

రూ.15 లక్షలతో పెద్ద యూనిట్ ఏర్పాటు

 

 

 

కుంకుమ పువ్వు సాగుపై ఆసక్తి ఉన్న ఇతరులకు జేమ్స్ శిక్షణ ఇస్తున్నారు. ఆటోమేటెడ్ సాగు యూనిట్లను ఏర్పాటు చేసుకునేందుకు సహాయం చేస్తున్నారు. 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ పెద్ద సాగు యూనిట్ ఏర్పాటు చేయడానికి రూ.15 లక్షలు ఖర్చవుతుందనీ  240 నుంచి 300 నిలువు ట్రేలను ఏర్పాటు చేసి కేజీ కిలో కుంకుమ పువ్వును పండించవచ్చనీ చెప్పారు.  తన సాగు యూనిట్ కి అవసరమైన పరికరాలు, సామగ్రి పుణె, బెంగళూరు, కొచ్చి నుంచి తెప్పించుకున్నారు.

కుంకుమ పువ్వు రేకులతోనూ ఆదాయం

 

జేమ్స్ తన వ్యాపారాన్ని విస్తరించేందుకు కొత్త మార్గాలను ఆలోచించారు. కుంకుమ పువ్వు పూల నుంచి మిగిలిపోయే రేకులను వృథా చేయకుండా బేబీ ఆయిల్, బేబీ బాత్ సోప్ తయారు చేస్తున్నారు.  కుంకుమ పువ్వు కలిపిన తేనె విక్రయిస్తున్నారు. ఒకే పంట నుంచి వివిధ రకాల ఉత్పత్తులను తయారు చేసి ఆదాయ మార్గాలను పెంచుకోవచ్చని తెలుసుకున్నారు. ఉత్పత్తులను ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లో విక్రయిస్తున్నారు. రష్యాలో తన బ్రాండ్ ఉత్పత్తుల విక్రయాల కోసం ఒప్పందం కుదుర్చుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లోకి ఉత్పత్తులను తీసుకెళ్లే అవకాశం ఏర్పడిందని ఆనందపడ్డారు. సంప్రదాయ సాగుకు భిన్నంగా ఏఐ, ఆటోమేషన్ టెక్నాలజీ ఉపయోగించి ఖరీదైన కశ్మీరీ కుంకుమ పువ్వు పంట ప్రయోగం చేపట్టిన జేమ్స్ కప్పాని అనుభవం ఆసక్తిగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us