
కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రయాణికులతో నిండిన ఓ బస్సులో లైంగిక వేధింపుల ఘటన చోటుచేసుకుంది. అయితే బాధిత యువతి భయపడకుండా ధైర్యంగా స్పందించి నిందితుడికి బుద్ధి చెప్పిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
హెబ్బల్ నుంచి మాన్యతా వైపు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతిని అదే బస్సులో ఉన్న వ్యక్తి అనుచితంగా తాకుతూ లైంగికంగా వేధించినట్లు తెలుస్తోంది. దీంతో ఆగ్రహానికి గురైన యువతి వెంటనే అతడిని నిలదీసి, బస్సులోనే చితకబాదింది. ఈ ఘటనతో ఒక్కసారిగా బస్సులో ఉన్న ప్రయాణికులు అప్రమత్తమయ్యారు.
యువతి వెంటనే జరిగిన విషయాన్ని బస్సు డ్రైవర్‌కు తెలియజేయగా, డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి బస్సును ఆపేశాడు. అనంతరం ప్రయాణికుల సహాయంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఈ ఘటనలో యువతి చూపిన ధైర్యాన్ని పలువురు ప్రయాణికులు అభినందించారు. ప్రజా రవాణాలో మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, బాధిత యువతి ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది.
వీడియో ఇక్కడ చూడండి..
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..