
ప్రకృతిలో ఎన్నో వింతలు దాగి ఉంటాయి. అందులో నెమలి, పాముకు మధ్య ఉండే వైరం ఒకటి. నెమళ్లు ఉన్న చోట పాములు ఉండటానికి భయపడతాయి. ఎంతటి విషపూరితమైన సర్పాన్నైనా సరే, నెమలి చాలా సులభంగా వేటాడి తినేస్తుంది. అసలు అంత భయంకరమైన విష సర్పాలను తిన్న తర్వాత కూడా నెమలి ఎలా బ్రతికుతుంది. ఆ పాము విషం నెమలి శరీరంపై ఎందుకు ప్రభావం చూపదు? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన సైన్స్ రహస్యం గురించి చాలా మందికి తెలియదు. నెమళ్లు సర్వభక్షక పక్షులు. ఇవి జొన్నలు, గోధుమలు, బియ్యం వంటి ధాన్యాలతో పాటు రకరకాల కీటకాలు, చిన్న పాములను ఆహారంగా తీసుకుంటాయి. ముఖ్యంగా విష సర్పాలను వేటాడటంలో నెమలిది ప్రత్యేక శైలి. పాము ఎదురుపడినప్పుడు నెమలి నేరుగా దాడి చేయకుండా, ముందుగా దాని కళ్లపై తన ముక్కుతో పొడిచి చూపు లేకుండా చేస్తుంది. ఆ తర్వాత ఆ పామును మింగేస్తుంది.
చాలామందికి వచ్చే పెద్ద సందేహం ఏంటంటే.. పాము విషం నెమలిని ఎందుకు చంపదు? నిపుణుల వివరాల ప్రకారం.. పాము విషంలో ఒక ప్రత్యేకమైన సంక్లిష్ట ప్రోటీన్ ఉంటుంది. ఈ విషం నేరుగా రక్తంలో కలిసినప్పుడు మాత్రమే ప్రాణాంతకంగా మారుతుంది. నెమలి పామును వేటాడినప్పుడు దానిని కొరకకుండా, నేరుగా నోటితో మింగేస్తుంది. ఇలా మింగడం వల్ల ఆ పాములోని విషం నెమలి రక్తప్రవాహంలోకి వెళ్లకుండా, నేరుగా దాని కడుపులోకి చేరుతుంది. కడుపులో ఉండే జీర్ణరసాలు ఆ విషపూరిత ప్రోటీన్‌ను సాధారణ ఆహారంలాగే జీర్ణం చేసేస్తాయి. అందుకే విషం రక్తంలో కలవకపోవడం వల్ల నెమలికి ఎలాంటి హాని జరగదు.
విష సర్పాలను తినడం నెమలికి సురక్షితమే అయినప్పటికీ.. ఇందులోనూ ఒక చిన్న ప్రమాదం దాగి ఉంది. పామును మింగే సమయంలో నెమలి నోటిలో గానీ, గొంతులో గానీ లేదా కడుపులో గానీ ఏదైనా చిన్న గాయం లేదా పుండు ఉంటే పరిస్థితి తలకిందులవుతుంది. ఆ గాయం ద్వారా పాము విషం నేరుగా రక్తంలో కలిసే అవకాశం ఉంటుంది. అలా జరిగితే నెమలి కూడా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.