
కశ్మీర్‌కు చెందిన 33 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజినీర్ ముదాసిర్ అలీ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఏడాది క్రితం తల్లి ఎలుగుబంటి దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మర్చిపోలేని విషాదంగా మిగిలిపోయింది. అతని మనసులో ఒకే ఆలోచన మొదలైంది. వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ప్రమాదం గురించి ముందుగానే తెలిస్తే కనీసం కొందరి ప్రాణాలైనా కాపాడవచ్చని భావించాడు. సాఫ్ట్వేర్ పరిజ్ఞానంతో ‘వైల్డ్పింగ్’ (Wildping) ఉచిత వెబ్‌సైట్‌ను రూపొందించాడు. తల్లి మరణించిన మొదటి వార్షికోత్సవం సందర్భంగా అక్టోబర్‌లో వెబ్‌సైట్‌ను ప్రారంభించాడు.
తల్లి మరణం తర్వాత ఈ ఆలోచన మనసులో ఉండేదని ముదాసిర్ అలీ తెలిపాడు. ఇలాంటి ఘటనలు తరచూ జరిగే ప్రాంతాల్లో నివసించే ప్రజలు తమను తాము రక్షించుకునేందుకు ఉపయోగపడే సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసినట్లు చెప్పాడు. తాను అనుభవించిన బాధను మరెవరూ అనుభవించకూడదనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం చేసినట్లు తెలిపాడు.
ఈ వెబ్సైట్ ప్రత్యేకత ఏంటంటే వన్యప్రాణులు ఎక్కడ సంచరిస్తున్నాయో స్థానికులే సమాచారాన్ని నమోదు చేస్తారు. ఒక గ్రామం సమీపంలో ఎలుగుబంటి కనిపిస్తే దాన్ని గుర్తించిన వ్యక్తి వెంటనే Wildping వెబ్సైట్లో ఆ వివరాలను నమోదు చేస్తాడు. అలాగే చిరుతపులులు, ఇతర వన్యప్రాణుల సంచార సమాచారాన్ని అందులో ఎంటర్ చేస్తారు.
ఆ ప్రాంతానికి సమీపంలో ఉన్న వారికి మొబైల్ ఫోన్లో హెచ్చరికలు అందుతాయి. అక్కడికి వెళ్లకుండా జాగ్రత్తపడతారు. పొలాలకు వెళ్లే రైతులు, ఒంటరిగా ప్రయాణించేవారికి ఈ సమాచారం హెల్ప్ అవుతోంది. వెబ్ సైట్ లో కొన్ని ప్రాంతాల చుట్టూ అలర్ట్ జోన్లను ఏర్పాటు చేసుకునే సదుపాయం ఉంది. తమ ఇల్లు, పొలం, పాఠశాల, పిల్లలు నడుచుకుంటూ వెళ్లే దారులను ఆ జోన్లలో చేర్చే అవకాశం ఉంది. ఆ ప్రాంతాల సమీపంలో ఎలుగుబంటి లేదా చిరుతపులి కనిపిస్తే వెంటనే హెచ్చరిక వస్తుంది.
ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతానికి పిల్లలను పంపక పోవడం, పొలాలకు వెళ్లడం వాయిదా వేసుకోవడం, అవసరమైతే అధికారులకు సమాచారం ఇవ్వడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వన్యప్రాణుల దాడులను పూర్తిగా ఆపలేకపోయినా ప్రమాదానికి ముందే అలర్ట్ ఇవ్వడం ద్వారా ఒక కుటుంబాన్ని కాపాడే అవకాశం ఉందని ముదాసిర్ వివరించారు.
హిమాలయ ప్రాంతాల్లో మనుషులు, వన్యప్రాణుల మధ్య ఘర్షణలు పెరుగుతున్నాయి. అడవుల నరికివేత, జంతువుల సహజ నివాస ప్రాంతాలు తగ్గడంతో వన్యప్రాణులు జనావాసాల వైపు వస్తున్నాయి. దీంతో ప్రజలు, జంతువులు ఎదురెదురుపడే ఘటనలు పెరుగుతున్నాయి. 2023 నుంచి కశ్మీర్ లో వన్యప్రాణుల దాడుల్లో కనీసం 50 మంది ప్రాణాలు కోల్పోయారు, వందలాది మంది గాయపడ్డారు. ఈ ప్రాంతంలో 80 శాతానికి పైగా మరణాలు హిమాలయన్ బ్లాక్ బేర్స్ వల్ల జరుగుతున్నాయి. హిమాలయన్ బ్లాక్ బేర్స్ అడవులతో కూడిన పర్వత ప్రాంతాల్లో నివసిస్తాయి. బ్రౌన్ బేర్స్ సాధారణంగా ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉంటాయి. చిరుతపులులు కూడా అడవుల్లో సంచరిస్తూ అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి.
ప్రపంచంలోని మరికొన్ని దేశాల్లోనూ వన్యప్రాణుల కదలికలను తెలియజేసే ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. అయితే కశ్మీర్ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ముదాసిర్ ఈ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ప్రస్తుతం ఇంగ్లిష్, హిందీ, ఉర్దూ భాషల్లో అందుబాటులో ఉంది. ప్రారంభించిన నెల రోజుల్లోనే ఈ వెబ్‌సైట్‌ను సుమారు 9 వేల మంది సందర్శించారు. వందలాది మంది ఉపయోగిస్తున్నారు. వన్యప్రాణులు కనిపించినప్పుడు వెంటనే సమాచారాన్ని నమోదు చేస్తున్నారు.
గత వారం తమ ప్రాంతంలో ఎలుగుబంటి కనిపించగానే వెంటనే వెబ్సైట్లో సమాచారం నమోదు చేసినట్లు యాసిర్ ఇక్బాల్ అనే స్థానికుడు తెలిపాడు. గ్రామంలో చాలా మంది ఈ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తున్నారని, ప్రాణాలను కాపాడటానికి వెబ్సైట్ ఉపయోగపడుతుందని అన్నాడు.
ఒక ప్రమాదం గురించి ముందుగానే తెలిస్తే ఒక కుటుంబం బయటకు వెళ్లకుండా ఆగుతుంది. పిల్లలు ప్రమాదకర ప్రాంతానికి వెళ్లరు. ఆ చిన్న అప్రమత్తతే ప్రాణాలను కాపాడుతోంది. తన తల్లిని కోల్పోయిన బాధ నుంచి పుట్టిన ఈ ఆలోచన ఇప్పుడు మరెంతోమందికి భరోసాగా మారుతోంది. టెక్నాలజీని ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగిస్తే ఎంతటి మంచి ఫలితాలు వస్తాయో ముదాసిర్ ప్రయత్నం నిరూపిస్తోంది.