ఫ్రీ కూల్‌డ్రింక్స్ కోసం ఎగబడిన జనం.. అసలు విషయం తెలిసి షాక్!
ఫ్రీ.. అనే మాట వింటే చాలు, జనం ఎలా ఎగబడతారో చూపే ఘటన జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలో శనివారం చోటుచేసుకుంది. జాతీయ రహదారిపై జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూల్‌డ్రింక్స్ సీసాలతో నిండిన ఒక వాహనం వచ్చి ఆగింది. వాహనంలో ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కూల్‌డ్రింక్ బాటిల్ చూపిస్తూ.. ఫ్రీగా ఇస్తున్నాం.. తీసుకోండి.. అని ప్రకటించడంతో అక్కడి దృశ్యం ఒక్కసారిగా మారిపోయింది.

ఫ్రీగా కూల్‌డ్రింక్స్ ఇస్తున్నారంటే చాలు.. మెట్‌పల్లి పట్టణంలో జనం ఎగబడ్డారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో కూల్‌డ్రింక్స్‌తో నిండిన వాహనం వచ్చి ఆగింది. వాహనంలో ఉన్న వ్యక్తి కూల్‌డ్రింక్ బాటిల్ చూపిస్తూ ఫ్రీగా ఇస్తున్నాం.. తీసుకోండి.. అని చెప్పడంతో అక్కడున్న ప్రజలు పెద్ద సంఖ్యలో ఒక్కసారిగా గుమిగూడారు.
కూల్‌డ్రింక్స్ కోసం ప్రజలు ఎగబడటంతో కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కొందరు ఈ దృశ్యాలను సెల్‌ఫోన్లలో వీడియోలు తీయడం ప్రారంభించారు. దీంతో విషయం బయటకు వెళ్తుందేమోనన్న ఉద్దేశంతో నిర్వాహకులు అక్కడి నుంచి వాహనాన్ని కొద్ది దూరం తరలించారు.
అనంతరం మెట్‌పల్లి పట్టణ శివారులోని మరో ప్రాంతానికి వెళ్లి కూల్‌డ్రింక్స్ పంపిణీ చేసినట్లు సమాచారం. అయితే ఫ్రీగా ఇస్తున్నారన్న ఆనందంలో ప్రజలు బాటిళ్లపై తయారీ తేదీ, గడువు తేదీ, నాణ్యత వివరాలను పరిశీలించకుండానే తీసుకుని తాగినట్లు తెలుస్తోంది.
పంపిణీ చేసిన కూల్‌డ్రింక్స్ గడువు తేదీకి దగ్గరగా ఉండటంతోనే ఇలా ఉచితంగా పంపిణీ చేశారనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి నిర్ధారణ లేదు. నిజంగానే గడువు తేదీ సమీపంలో ఉన్న ఉత్పత్తులను పంపిణీ చేశారా? లేక నాణ్యమైన కూల్‌డ్రింక్స్‌నే పంపిణీ చేశారా? అన్నది అధికారులు తేల్చాల్సి ఉంది.
గడువు ముగిసిన లేదా నాణ్యత లేని కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే తాగిన వారికి ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. కూల్‌డ్రింక్స్‌పై ఉన్న బ్యాచ్ నంబర్, తయారీ తేదీ, బెస్ట్ బిఫోర్ తేదీలను ఫుడ్ సేఫ్టీ అధికారులు పరిశీలించాల్సిన అవసరం ఉంది.
జాతీయ రహదారిపై పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడేలా కూల్‌డ్రింక్స్ పంపిణీ చేయడంపై కూడా అధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఫ్రీగా ఇస్తున్నారన్న కారణంతో ఏది పడితే అది తీసుకుని తాగకుండా.. ఆహార పదార్థాల గడువు తేదీ, నాణ్యతను పరిశీలించాల్సిన అవసరం ఉందని స్థానికులు సూచిస్తున్నారు. ఫ్రీ కూల్‌డ్రింక్స్ వెనుక అసలు కథేంటి.. గడువు తేదీకి దగ్గరగా ఉన్నవే పంపిణీ చేశారా.. నాణ్యతపై అధికారులు పరీక్షలు నిర్వహిస్తారా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.




