Video: సిగ్గుచేటు! గంగా తీరంలో చెత్త.. ఏరి తీసిన విదేశీ మహిళలు!

Rishikesh Ganga cleanup: పవిత్ర గంగానది.. కోట్లాది మంది భారతీయుల ఆరాధ్య నది. గంగమ్మ తీరానికి వెళ్లి పుణ్యస్నానాలు ఆచరించాలని, కొంత సమయం అక్కడ గడపాలని ఎంతోమంది కోరుకుంటారు. అయితే అంతటి పవిత్రమైన నది పరిసరాలను శుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మాత్రం కొందరు మరిచిపోతున్నారు. ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, చెత్తాచెదారం పడేస్తూ కాలుష్యానికి కారణమవుతున్నారు. కానీ ఇప్పుడు మన దేశంలో జరుగుతున్న ఓ ఘటన చూస్తే మాత్రం ఒక్కసారిగా ఆలోచనలో పడాల్సిందే. మనం చేయాల్సిన పనిని విదేశాల నుంచి వచ్చిన పర్యాటక మహిళలు చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

Video: సిగ్గుచేటు! గంగా తీరంలో చెత్త.. ఏరి తీసిన విదేశీ మహిళలు!
Foreign Tourists Clean Ganga Ghat In Rishikesh Leaving Indians Questioning Civic Sense

Updated on: Nov 23, 2026 | 6:00 PM

గంగా తీరంలో విదేశీ మహిళల స్వచ్ఛతా కార్యక్రమం!

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌ ఆధ్యాత్మికతకు, ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. ఇక్కడి గంగా ఘాట్లను సందర్శించేందుకు దేశవిదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. అయితే ఈ ప్రాంతంలోని ఓ ఘాట్‌ వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారం పేరుకుపోయింది. దీంతో అక్కడికి వచ్చిన కొందరు విదేశీ మహిళలు స్వయంగా రంగంలోకి దిగారు. చేతులకు గ్లౌజులు ధరించి, చేతిలో నల్లటి చెత్త సంచులు పట్టుకుని గంగా నది ఒడ్డున శుభ్రతా కార్యక్రమం చేపట్టారు. ఇసుకలో పడేసిన ప్లాస్టిక్ కవర్లు, రేపర్లు, ఇతర వ్యర్థాలను ఒక్కొక్కటిగా ఏరి సంచుల్లో వేసుకున్నారు. ఘాట్‌ పరిసరాల్లోని రాళ్ల మధ్య ఉన్న చెత్తను కూడా వదలకుండా శుభ్రం చేశారు. పర్యాటకులుగా వచ్చిన వారు అక్కడి పరిసరాలను శుభ్రం చేసే పనిలో నిమగ్నమవడం అందరినీ ఆకర్షించింది.

మన దేశానికి వచ్చి.. మనం చేయాల్సిన పని చేస్తున్నారు!

ఈ దృశ్యాలను ప్రసన్న కుమార్ అనే వ్యక్తి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. గంగా ఘాట్‌ను సందర్శించిన సమయంలో కనిపించిన ఈ దృశ్యాలను చూసి షాకైనట్లు తెలిపారు. మన దేశానికి విదేశాల నుంచి వచ్చిన మహిళలు మనం పడేసిన ప్లాస్టిక్ కవర్లు, చెత్తను ఏరుతూ గంగానది పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. మన సంస్కృతి, వారసత్వ సంపదను కాపాడేందుకు విదేశీయులు ప్రయత్నిస్తుంటే మనలో కొందరు మాత్రం వాటిని కలుషితం చేస్తున్నారని వీడియోలో చెప్పుకొచ్చారు. ‘వాళ్లు విదేశాల నుంచి వచ్చి మన వారసత్వ సంపదను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు. మనం ఏమో గంగానదికి వెళ్లి దానిని కలుషితం చేస్తున్నాం’, అతని వ్యాఖ్యలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Foreign tourists cleaned plastic waste at a Rishikesh ghat

విదేశీ మహిళలకు ప్రశంసలు.. మన బాధ్యతపై ప్రశ్నలు!

వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. విదేశీ మహిళలు చూపించిన బాధ్యతాయుత ప్రవర్తనను ప్రశంసిస్తూనే మన దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో చెత్త వేస్తున్న వారి తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘నిజమైన పౌర బాధ్యత అంటే ఇదే’ అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా, ‘ప్రజల్లో అవగాహన మరింత పెరగాలని కోరుకుంటున్నాను’ అని మరో యూజర్ అభిప్రాయపడ్డారు.పర్యాటక ప్రాంతాలకు వెళ్లడం, ఫొటోలు దిగడం, సరదాగా గడపడం మాత్రమే కాదు. అక్కడి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం కూడా మన బాధ్యతేనని పలువురు గుర్తుచేస్తున్నారు.

నిజానికి గంగానది కోట్లాది మంది విశ్వాసాలకు ప్రతీక. అలాంటి నదిని పూజిస్తూనే దాని ఒడ్డున చెత్త వేయడం ఎంతవరకు సమంజసం? విదేశీ పర్యాటకులు మనకు ఆదర్శంగా నిలిచే పరిస్థితి ఎందుకు రావాలి? ఈ వీడియో ప్రతి ఒక్కరూ తమను తాము ప్రశ్నించుకునేలా చేస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us