అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి

అమెరికాలోని ఫ్లోరిడాలో దారుణం జరిగింది. ఆటలాడటం కోసం పార్కుకు వెళ్లిన 13 ఏళ్ల బాలుడు ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు.ప్లేగ్రౌండ్‌లోని స్లైడ్‌కు ఉన్న ఓ వదులైన స్క్రూకు అతడి షర్టు చిక్కుకుని మెడకు బిగుసుకుపోయింది. దాంతో ఊపిరాడక మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మయామిలోని షెనాండో పార్క్‌లో సెప్టెంబర్ 25న ఈ ఘటన జరిగింది. మృతుడిని ఒల్విన్ డేనియల్ గా గుర్తించారు.

అయ్యో పాపం.. జారుడుబండలో షర్టు ఇరుక్కుని 13 ఏళ్ల బాలుడు మృతి
Florida Teen Strangled To Death After Shirt Gets Caught On Playground Slide Screw

Updated on: Oct 07, 2026 | 7:37 PM

ఘటన జరిగిన రోజు ఒల్విన్ స్కూల్‌కు వెళ్లాల్సి ఉంది. అయితే స్కూటర్‌పై పార్క్ కు వెళ్లినట్లు అతడి తల్లి ఎస్టెఫానియా తెలిపారు. ఆ రోజు సాయంత్రం వేళ పిల్లలతో పార్కుకు వచ్చిన ఓ వ్యక్తి ఒల్విన్‌ను గుర్తించి స్లైడ్‌లోని ఓ స్క్రూకు బాలుడి షర్ట్ చిక్కుకుని ఉండటాన్ని  గమనించాడు. ఒల్విన్‌ ను గుర్తించిన వ్యక్తి అతడిని బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. అయితే షర్ట్ స్క్రూకు బలంగా చిక్కు కోవడంతో సాధ్యం కాలేదు. ఆ వ్యక్తి మొదట బాలుడిని బయటకు లాగేందుకు యత్నించాడు.  రెండోసారి కూడా  బలంగా లాగడంతో ఒల్విన్ పడిపోయాడు. అప్పటికే బాలుడి చేయి షర్టులో ఇరుక్కుపోయి ఉండగా, షర్టు కాలర్ మెడ చుట్టూ బిగుసుకుపోయింది. అనంతరం ఒల్విన్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతడిని లైఫ్ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించారు. అయితే పరిస్థితి విషమించడంతో వారం తర్వాత అక్టోబర్ 1న అతడిని బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు.

ఘటనపై దర్యాప్తు

కుమారుడి మృతితో తల్లి ఎస్టెఫానియా తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ‘నా చిన్న బిడ్డ ఒల్విన్‌ ను కోల్పోతానని నేను ఎప్పుడూ అనుకోలేదు’ అంటూ కన్నీటి పర్యంతమైంది. కుమారుడి అంత్యక్రియల ఖర్చుల కోసం కుటుంబ సభ్యులు గోఫండ్‌మీ ద్వారా నిధులు సేకరిస్తున్నారు. బాలుడి తల్లి చెప్పిన విధంగానే ప్రమాదం జరిగిందా అనే విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ధ్రువీకరించలేదు.  బాలుడి పరిస్థితి విషమించి మృతి చెందిన మరుసటి రోజు షెనాండో పార్క్‌ను దర్యాప్తులో భాగంగా పోలీసులు మూసేసారు. ఆ తర్వాతి రోజే పార్క్‌లోని స్లైడ్‌ను తిరిగి పిల్లల వినియోగానికి తెరిచారు.  పిల్లలను పార్కులకు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనీ  తన కొడుకుకు జరిగిన విషాదాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి అంటూ ఎస్టెఫానియా తల్లిదండ్రులకు సూచించింది. పార్క్‌ స్లైడ్‌లో వదులుగా ఉన్న స్క్రూ వల్లే ఈ ప్రమాదం జరిగిందా? మరేదైనా కారణం అయి ఉంటుందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us