
మొహముద్‌పై FBIకి 2024 డిసెంబర్‌లోనే అనుమానం వచ్చింది. ఓ రహస్య వ్యక్తికి అతడు మెసేజ్‌లు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. తొలుత సోమాలియాకు వెళ్లి అల్-షబాబ్ మిలిటెంట్లలో చేరాలని ఆసక్తి చూపాడు. సోమాలియాకు వెళ్లేందుకు అవసరమైనంత డబ్బు తన వద్ద లేదని ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ లో చేరేందుకు ప్రయత్నాలు చేసాడు.
అక్టోబర్ 24న మాల్‌లో హమాంగ్ గిరిజన సమూహం ఆధ్వర్యంలో జరగనున్న ఆర్ట్స్ కార్యక్రమాన్ని లక్ష్యంగా చేసుకుని మాల్ ఆఫ్ అమెరికాపై దాడి చేసి భారీ సంఖ్యలో ముస్లిమేతరులను హతమార్చాలని ప్లాన్ చేసాడు. అండర్‌కవర్ ఆపరేషన్‌కు వినియోగించిన ఓ FBI ఉద్యోగి తనను తాను ఇస్లామిక్ స్టేట్ ఐసిస్ సభ్యుడని పరిచయం చేసుకున్నాడు. మొహముద్ అతని వద్ద ఒక AK-47, 200 రౌండ్ల మందుగుండు సామగ్రిని 600 డాలర్లకు కొనుగోలు చేశాడు. నువ్వు దాడి చేయడం నిజమేనా అని ఇన్ఫార్మర్ ప్రశ్నించగా.. తాను వంద శాతం సిద్ధంగా ఉన్నానని మొహముద్ మెసేజ్ చేసాడు. ఆయుధాలు చేతికి అందిన వెంటనే అధికారులు మొహముద్ ను అదుపులోకి తీసుకున్నారు. మిన్నెసోటా రాష్ట్రం రిచ్‌ఫీల్డ్‌లోని పబ్లిక్ పార్క్ లో అరెస్ట్ చేశారు.
మొహముద్‌పై రెండేళ్ల పాటు నిఘా పెట్టిన FBI అధికారులు 2025 మేలో అతడి ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో అతడి తల్లి.. తన కుమారుడు స్కూల్ నుంచి ఇంకా ఇంటికి రాలేదని చెప్పింది. ఆమె అతడి తండ్రికి ఫోన్ చేయగా.. FBI అధికారులతో మాట్లాడేందుకు నిరాకరించి, వారి వివరాలను తన లాయర్‌కు ఇస్తాననీ చెప్పిన తండ్రి తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. సోమాలియా మూలాలకు చెందిన మొహముద్ అమెరికా పౌరుడైనప్పటికీ తీవ్రవాద భావజాలానికి ప్రభావితమయ్యాడనీ మాల్ లో దాడి చేసి ఉంటే 30 నుంచి 60 మందిని చంపే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్ ప్రాసిక్యూటర్ డేనియల్ రోసెన్ విస్తుపోయే అంశాన్ని బయటపెట్టారు. ‘పిల్లలు తీవ్రవాద భావజాలం వైపు వెళ్తున్నారనే సంకేతాలు కనిపించినా.. ఆ విషయాన్ని ఫెడరల్ అధికారులు హెచ్చరించినా.. తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోవాల’ని రోసెన్ గట్టిగా చెప్పారు.
సెయింట్ పాల్‌లోని ఫెడరల్ కోర్టులో అతడిని హాజరుపరచగా తనకు ఉద్యోగం, ఇల్లు, కారు లేవని, బ్యాంకులో డబ్బు కూడా లేదని జడ్జి ముందు చెప్పాడు. కుటుంబ సభ్యులు, న్యాయవాది ఈ కేసుపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. మిన్నెసోటాలో సోమాలియా మూలాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో నివసిస్తున్నారు. 1990లలో శరణార్థులుగా అమెరికాకు వచ్చి ఈ సమాజం అక్కడ విస్తరించింది. గతంలో కూడా కొందరు మిలిటెంట్ సంస్థల్లో చేరేందుకు ప్రయత్నించి పలు కేసుల్లో అరెస్టయ్యారు.