
దుబాయ్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన ఉద్యోగినికి రూ. 4 కోట్ల లంబోర్గిని ఉరుస్ కారును గిఫ్ట్‌గా ఇచ్చారు. నటాలియా చావెజ్ ఈ స్థాయిలో బహుమతి అందుకోవడానికి కారణం ఆమె పనితీరే. రెండేళ్లలో ఆమె 500 మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ సేల్స్ పూర్తి చేశారు. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.4,400 కోట్లు.
దుబాయ్‌లోని రిచ్కీ ప్రాపర్టీస్ (Richkey Properties) రియల్ ఎస్టేట్ సంస్థ సీఈవో దబాన్ ఉత్మాన్ తన కంపెనీలో పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ ఏజెంట్ నటాలియా చావెజ్‌కు కారును బహుమతిగా ఇచ్చారు. కంపెనీ మూడో వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ఆమెను వేదికపైకి పిలిచి సీఈవో ట్రోఫీ ఇచ్చారు. ట్రోఫీ తీసుకున్న నటాలియా తన సీటు దగ్గరికి వెళుతుండగా సీఈవో ఆమెను ఆపారు. ‘నటాలియా.. ఎక్కడికి వెళ్తున్నావు? కార్యక్రమం ఇంకా పూర్తి కాలేదు’ అన్నారు. కౌంట్‌డౌన్ ఇచ్చి, రిబ్బన్ తొలగించడంతో నీలం రంగు లంబోర్గిని కారును చూసి నటాలియా ఆశ్చర్యానికి గురయ్యారు. అవార్డుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని భావించిన ఆమెకు ఏకంగా నాలుగు కోట్ల రూపాయల విలువైన కారు బహుమతిగా లభించింది.
నటాలియా చావెజ్ ఈ స్థాయిలో బహుమతి అందుకోవడానికి కారణం ఆమె పనితీరే. గత రెండేళ్లలో ఆమె 500 మిలియన్ డాలర్ల రియల్ ఎస్టేట్ అమ్మకాలను పూర్తి చేశారు. భారత కరెన్సీలో ఈ మొత్తం దాదాపు రూ.4,400 కోట్లు. అమ్మకాల్లో చూపిన అసాధారణ ప్రతిభతో ఆమె సంస్థలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. 2026 మొదటి త్రైమాసికంలో మూడో స్థానంలో నిలిచిన నటాలియా.. రెండవ, మూడవ త్రైమాసికాల్లో టాప్ పెర్ఫార్మర్గా నిలిచారు. 2026 సంవత్సరానికి కంపెనీలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగినిగా ఎంపికయ్యారు. విజయానికి గుర్తింపుగా కంపెనీ ఆమెకు నాలుగు ప్రధాన అవార్డులను అందించింది వాటితో పాటు లంబోర్గిని కారును బహుమతిగా ఇచ్చింది.
ఖరీదైన కారును బహుమతిగా అందించిన వీడియోను రిచ్కీ ప్రాపర్టీస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. వీడియో చూసిన నెటిజన్లు నటాలియా విజయాన్ని ప్రశంసిస్తున్నారు. కష్టపడి పనిచేస్తే గుర్తింపు, ప్రతిఫలం ఎలా ఉంటాయో ఈ ఘటన నిరూపిస్తోందని పలువురు కామెంట్లు చేస్తున్నారు. రెడిట్‌లో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా ఆదాయం సంపాదించే అవకాశం ఉండటంతో చాలామంది ఈ రంగం వైపు ఆసక్తి చూపిస్తున్నారని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే ఈ రంగంలో సంపాదన అంత సులభం కాదని మరికొందరు అంటున్నారు. సాఫ్ట్వేర్ వంటి ఉద్యోగాలతో పోలిస్తే రియల్ ఎస్టేట్‌లో ఆదాయం స్థిరంగా ఉండదని, ఒక్కోసారి నెలల తరబడి కమీషన్ కూడా రాకపోవడంతో బ్రోకర్లు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అన్నారు. రెండేళ్లలో 500 మిలియన్ డాలర్ల విలువైన అమ్మకాలు సాధించడం చిన్న విషయం కాదని, నటాలియా కష్టానికి, ప్రతిభకు లంబోర్గిని బహుమతి తగిన గుర్తింపని పలువురు ప్రశంసించారు. మొత్తానికి ఓ ఉద్యోగిని సాధించిన విజయం, ఆమెకు లభించిన ఖరీదైన బహుమతి ఇప్పుడు దుబాయ్ రియల్ ఎస్టేట్ రంగంలో చర్చనీయాంశంగా మారింది.