
మెట్రో నగరాల్లో బహుళ అంతస్తుల భవనాలు (High-rise buildings) వేగంగా పెరుగుతున్నాయి. అయితే, ఈ ఎత్తైన భవనాలలో అగ్ని ప్రమాదాలు లేదా భూకంపాలు వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోంది. అలాంటి సమయాల్లో లిఫ్టులు పనిచేయవు, మెట్లు పూర్తిగా పొగతో నిండిపోతాయి. ఈ తీవ్రమైన సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపుతూ ఢిల్లీకి చెందిన సేఫ్ స్కైడ్రాప్ (Safe Skydrop) అనే సేఫ్టీ స్టార్టప్ సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. భారతదేశపు మొట్టమొదటి సిఈ-ధృవీకృత (CE-certified) పర్సనల్ వర్టికల్ ఎగ్రెస్ పరికరాన్ని వీరు పరిచయం చేశారు. దీన్నే బాల్కనీ ఎస్కేప్ సిస్టమ్ అని పిలుస్తున్నారు.
ఈ సరికొత్త భద్రతా పరికరం ఎలా పనిచేస్తుందో చూపించే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒక వ్యక్తి బాల్కనీ నుండి చాలా నెమ్మదిగా, సురక్షితంగా కిందకు దిగడం మనం అందులో చూడవచ్చు. ఈ పరికరం అతిపెద్ద ప్రత్యేకత ఏమిటంటే, ఇది పనిచేయడానికి ఎటువంటి విద్యుత్ (Electricity) లేదా బ్యాటరీల అవసరం లేదు. దీనిని బాల్కనీలోని ఒక బలమైన గోడకు శాశ్వతంగా అమర్చుతారు.
అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, భవనంలో ఉన్న వ్యక్తి కేవలం ఈ యూనిట్‌ను తెరిచి, దానిలోని సేఫ్టీ హార్నెస్ (Safety Harness) ధరించి, తన్ను తాను కేబుల్‌కు కనెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ సిస్టమ్ స్వయంచాలకంగా, అత్యంత సురక్షితమైన, నియంత్రిత వేగంతో వ్యక్తిని కిందకు దించుతుంది. ఇందులో పిల్లల కోసం VIP ప్రత్యేకమైన సేఫ్టీ హార్నెస్ సౌకర్యం కూడా ఉంది. ఒకే కేబుల్ సహాయంతో కుటుంబ సభ్యులు ఒకరి తర్వాత ఒకరు వరుసగా కిందకు దిగవచ్చు. ఈ కేబుల్ దాదాపు 99 మీటర్ల ఎత్తు (సుమారు 30 అంతస్తుల వరకు) సమర్థవంతంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.
ఈ పరికరాన్ని కొనుగోలు చేసే ప్రతి వినియోగదారునికి కంపెనీ ఉచితంగా శిక్షణ (Training) ఇవ్వడంతో పాటు, క్రమం తప్పకుండా దీని పనితీరును చెక్ చేస్తూ ఉంటుంది. అత్యవసర సమయాల్లో రెస్క్యూ టీమ్స్ వచ్చే వరకు వేచి చూడకుండా, ప్రజలు తమ ప్రాణాలను తామే స్వయంగా కాపాడుకునేలా చేయడం ఈ ఆవిష్కరణ ముఖ్య ఉద్దేశ్యం.
ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. అగ్ని ప్రమాదాల సమయంలో ఇలాంటి పరికరాలు ప్రాణదాతలుగా మారుతాయని కొందరు ప్రశంసిస్తుండగా, మరికొందరు అత్యవసర సమయాల్లో ఒకరి తర్వాత ఒకరు ఎంత వేగంగా కిందకు దిగవచ్చనే దానిపై మరిన్ని ప్రాక్టికల్ డెమోలు ఇవ్వాలని కోరుతున్నారు. ఏదేమైనప్పటికీ, ఎత్తైన భవనాల్లో నివసించే వారి భద్రతకు ఈ సరికొత్త ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…