ఫ్లైట్ మిస్.. ఎయిర్‌లైన్స్‌కు కోర్టు షాక్.. ప్రయాణికుడికి రూ. 71 వేలు పరిహారం

విమానం ఎక్కాలంటే సమయానికి ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలి. లేదంటే చెక్‌ఇన్ కౌంటర్ మూసేస్తారు.. విమానం మిస్ అవుతుంది. కానీ ఓ ప్రయాణికుడు మాత్రం విమానం బయలుదేరడానికి గంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా ఫ్లైట్ ఎక్కలేకపోయాడు. సిబ్బంది నిర్లక్ష్యం, ఆలస్యం కారణంగానే తన ప్రయాణం రద్దయిందని ఆరోపించాడు. అంతేకాదు.. అత్యవసరంగా మరో టికెట్ కొనుక్కుని గమ్యస్థానానికి చేరుకోవాల్సి వచ్చింది. చివరకు ఈ వ్యవహారం వినియోగదారుల కమిషన్ వరకు వెళ్లింది. అక్కడ విమానయాన సంస్థకు ఊహించని షాక్ తగిలింది. ప్రయాణికుడికి ఏకంగా రూ.71,587 పరిహారం చెల్లించాలని ఆదేశించింది.

ఫ్లైట్ మిస్.. ఎయిర్‌లైన్స్‌కు కోర్టు షాక్.. ప్రయాణికుడికి రూ. 71 వేలు పరిహారం
Delhi Flyer Who Missed Bengaluru Flight Awarded Compensation As Airline Fails To Prove He Was Late

Updated on: Nov 06, 2026 | 9:23 AM

ఢిల్లీలో నివసించే ఓ వ్యక్తి 2025 జూన్‌లో అత్యవసర మీటింగ్‌ కోసం బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఇందుకోసం ఢిల్లీ నుంచి బెంగళూరుకు రానుపోను విమాన టికెట్లు ముందుగానే బుక్ చేసుకున్నాడు. అతడు ప్రయాణించాల్సిన విమానం ఉదయం 6.45 గంటలకు బయలుదేరాల్సి ఉంది. దీంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయాలనే ఉద్దేశంతో ఉదయం 5.45 గంటలకే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నాడు.

అయితే ఎయిర్‌పోర్టుకు చేరుకున్న తర్వాత అతడికి అసలు కష్టాలు మొదలయ్యాయి. చెక్‌ఇన్ ప్రక్రియలో విమానయాన సంస్థ సిబ్బంది సహకరించలేదని, తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రయాణికుడు ఆరోపించాడు. పలుమార్లు సహాయం కోరినా పట్టించుకోలేదని, దాదాపు 45 నిమిషాలకు పైగా తనను వేచి ఉండేలా చేశారని ఫిర్యాదు చేశాడు.

విమానంలో సీట్లు లేవంటూ మరో కౌంటర్‌కు పంపించారు!

ఇంతలో గ్రౌండ్ స్టాఫ్‌ ఉద్యోగి షాకింగ్ విషయం చెప్పాడు. విమానంలో సీట్లు ఖాళీగా లేవని, రీషెడ్యూలింగ్ గురించి తెలుసుకోవడానికి మరో హెల్ప్ డెస్క్‌కు వెళ్లాలని సూచించాడు. దీంతో ప్రయాణికుడు అక్కడికి వెళ్లి సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం చేశాడు. కానీ ఈలోపే సమయం మించిపోయింది. విమానం వెళ్లిపోవడంతో అతడు ప్రయాణించలేకపోయాడు. మీటింగ్‌ కు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉండటంతో మరో విమాన టికెట్ కొనడం తప్ప అతడికి వేరే మార్గం లేకపోయింది. అదే విమానయాన సంస్థలో ఆ రోజు తర్వాత మరో టికెట్ కొనుగోలు చేశాడు. ఇందుకోసం అదనంగా రూ.11,587 చెల్లించాడు.

తిరుగు ప్రయాణంలోనూ అదే సంస్థ నుంచి ఇబ్బందులు!

ఇక్కడితో ఈ వ్యవహారం ముగియలేదు. బెంగళూరు నుంచి తిరిగి ఢిల్లీకి వచ్చే సమయంలోనూ అతడికి ఇబ్బందులు ఎదురయ్యాయి. మొదట బుక్ చేసుకున్న టికెట్‌పై ప్రయాణించలేదనే కారణంతో సిబ్బంది తొలుత చెక్‌ఇన్‌కు అనుమతి నిరాకరించినట్లు ఆరోపించాడు. తాను అదే విమానయాన సంస్థలో మరో టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించానని వివరించిన తర్వాతే చివరకు బోర్డింగ్‌కు అనుమతించారని తెలిపాడు. దీంతో తనకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కోరుతూ న్యూఢిల్లీ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించాడు.

ప్రయాణికుడే ఆలస్యంగా వచ్చాడంటూ వాదన!

ఈ కేసులో విమానయాన సంస్థ తన వాదనను వినిపించింది. ప్రయాణికుడు ఉదయం 6.10 గంటలకు మాత్రమే చెక్‌ఇన్ కౌంటర్‌కు వచ్చాడని తెలిపింది. నిర్ణీత సమయానికి రాకపోవడంతో అతడిని ‘నో షో’గా పరిగణించామని పేర్కొంది. అంటే విమానం ఎక్కేందుకు ప్రయాణికుడు సమయానికి రాలేదని సంస్థ వాదించింది. అయితే ఈ వాదనను నిరూపించే ఆధారాలను మాత్రం సమర్పించలేకపోయింది. ప్రయాణికుడు ఎప్పుడు కౌంటర్‌కు వచ్చాడో తెలిపే సీసీటీవీ ఫుటేజీని కూడా అందించలేదు. ఇతర ఆధారాలు సైతం సమర్పించకపోవడంతో కమిషన్ విమానయాన సంస్థ వాదనను పరిగణనలోకి తీసుకోలేదు.

రూ.50 వేల మానసిక వేదన పరిహారం.. మొత్తం రూ.71,587!

ఈ కేసును కమిషన్ అధ్యక్షురాలు పూనమ్ చౌధరి, సభ్యుడు బారిక్ అహ్మద్‌తో కూడిన ధర్మాసనం విచారించింది. ప్రయాణికుడు ఆలస్యంగా వచ్చాడని విమానయాన సంస్థ ఆరోపించినప్పటికీ, అందుకు తగిన ఆధారాలు చూపించలేకపోయిందని పేర్కొంది. ముఖ్యంగా సీసీటీవీ ఫుటేజీ వంటి కీలక ఆధారాలు సమర్పించకపోవడాన్ని ప్రస్తావించింది.

చివరకు ప్రయాణికుడికి అనుకూలంగా తీర్పు వెలువరించింది. విమానయాన సంస్థ మొత్తం రూ.71,587 చెల్లించాలని ఆదేశించింది. ఇందులో అదనంగా కొనుగోలు చేసిన విమాన టికెట్ కోసం ఖర్చు చేసిన రూ.11,587 తిరిగి చెల్లించాలని, మానసిక వేదన, వేధింపులకు పరిహారంగా రూ.50,000 ఇవ్వాలని, న్యాయపరమైన ఖర్చుల కింద మరో రూ.10,000 చెల్లించాలని స్పష్టం చేసింది.

మొత్తానికి.. గంట ముందే ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా విమానం ఎక్కలేకపోయిన ప్రయాణికుడికి చివరకు వినియోగదారుల కమిషన్ ద్వారా ఊరట లభించింది. ప్రయాణికుడే ఆలస్యంగా వచ్చాడంటూ వాదించిన విమానయాన సంస్థ.. ఆ విషయాన్ని నిరూపించడానికి అవసరమైన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో అదనపు టికెట్ ఖర్చుతో పాటు మానసిక వేదనకు కూడా పరిహారం చెల్లించాల్సి వచ్చింది.

Loading...
Unable to load recommendations.
Follow Us