
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన చిన్న అడవి పిల్లిగా నల్లకాళ్ల పిల్లి పేరు గాంచింది. చూడ్డానికి అమాయకంగా, చిన్నగా కనిపించినా.. వేటలో మాత్రం ఇది అసలైన మాస్టర్. పరిమాణాన్ని బట్టి చూస్తే, ఈ చిన్న పిల్లి చూపించే సాహసం, వేగం, తెలివితేటలు ఆశ్చర్యపరుస్తాయి. అందుకే పరిశోధకులు దీనిని “భూమిపై అత్యంత డెడ్లియెస్ట్ క్యాట్”గా పేర్కొంటున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఎడారి, గడ్డి మైదాన ప్రాంతాల్లో కనిపించే ఈ పిల్లి.. అక్కడి చిన్న అడవి పిల్లి జాతుల్లో ఒకటి. సాధారణంగా దీని బరువు 1 నుంచి 2.5 కిలోల మధ్యే ఉంటుంది. కానీ వేటలో దీని విజయశాతం సుమారు 60 శాతం వరకు ఉండటం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సింహాలు, పులులు వంటి పెద్ద మృగాల కంటే కూడా దీని హంటింగ్ సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండటం విశేషం.
ఒకసారి వేటను లక్ష్యంగా చేసుకుంటే.. దాన్ని పట్టుకునే వరకు ఈ పిల్లి వెనక్కి తగ్గదు. చాలా నిశ్శబ్దంగా మాటువేసి, ఒక్కసారిగా మెరుపువేగంతో దాడి చేస్తుంది. చిన్న పక్షులు, ఎలుకలు, బల్లులు, కీటకాలు వంటి జీవులు దీని ప్రధాన ఆహారం. ఈ పిల్లి ఎక్కువగా రాత్రివేళల్లోనే వేటాడుతుంది. చీకట్లో దీని కళ్ల చూపు, వినికిడి శక్తి అత్యంత పదునుగా పనిచేస్తాయి. ఒకే రాత్రిలో దాదాపు 30కి పైగా చిన్న జంతువులను వేటాడిన సందర్భాలు కూడా నమోదయ్యాయి. ఆహారం కోసం రాత్రి పూట 20 నుంచి 30 కిలోమీటర్ల వరకు సంచరిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఈ చిన్న పిల్లి చాలా అరుదైన జాతికి చెందింది. ప్రస్తుతం నివాస ప్రాంతాలు తగ్గిపోవడం, పర్యావరణ మార్పులు, ఇతర మృగాల ప్రమాదం కారణంగా వీటి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. అందుకే వన్యప్రాణి సంరక్షణ సంస్థలు ఈ జాతిని పరిరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయి. చిన్న శరీరం.. కానీ అసాధారణ ధైర్యం, అద్భుతమైన వేట నైపుణ్యం.. ఇవే నల్లకాళ్ల పిల్లిని ప్రపంచంలోనే అత్యంత డెడ్లియెస్ట్ పిల్లిగా నిలబెట్టాయి.
పాము కుబుసం ఎందుకు విడుస్తుంది.. దాన్ని ముట్టుకుంటే ప్రమాదమా.. ?