
ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా వేదికగా నిత్యం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ, విలక్షణమైన ప్రతిభ గల సామాన్యులను ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. ఇటీవల ఆయన ఉత్తరాఖండ్‌లోని రమణీయమైన నైనిటాల్ పట్టణానికి చెందిన ఒక చిన్నారి వీధి ఇంద్రజాలికుడి వీడియోను షేర్ చేశారు. ఆ బాలుడి అసాధారణమైన టాలెంట్‌కు ఫిదా అయిన మహీంద్రా, అతడిని ప్రశంసించడమే కాకుండా, ఆ బాబు భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ముందుకొచ్చారు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో, ఒక చిన్న బాలుడు రోడ్డు పక్కన నిలబడి పర్యాటకులు, ప్రేక్షకుల కోసం అద్భుతమైన మేజిక్ ట్రిక్స్ ప్రదర్శించాడు. కొన్ని లోహపు కప్పులు, చిన్న ఎర్రటి బంతులను ఉపయోగించి అతడు చేస్తున్న మేజిక్ చూసేవారిని ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. బాలుడు మొదట బంతులను కప్పుల కింద పెట్టి, తన నేర్పుగల వేళ్ల కదలికలతో అత్యంత వేగంగా వాటిని అటూ ఇటూ కదుపుతాడు. ఆ బంతులు కొన్నిసార్లు మాయమైపోతూ, మరికొన్నిసార్లు ఊహించని విధంగా వేరొక కప్పు కింద ప్రత్యక్షమవుతూ ప్రేక్షకులను తికమక పెట్టాయి. అతని వేగం, కచ్చితత్వం, టైమింగ్ ప్రొఫెషనల్ మేజీషియన్లను తలపిస్తున్నాయి. కేవలం ట్రిక్కులు మాత్రమే కాదు, ఆ బాలుడి ముఖ కవళికలు, మాట్లాడే విధానం, ప్రేక్షకులను ఆకట్టుకునే ఆత్మవిశ్వాసం అతని వయస్సు కంటే ఎంతో పరిణతి చెందినట్లుగా ఉన్నాయి.
ఈ వీడియో ఆనంద్ మహీంద్రా దృష్టికి వెళ్లినప్పుడు ఆయన ఆ బాలుడి ప్రతిభకు పూర్తిగా ముగ్ధుడయ్యారు. “ఈ చిన్నారి అద్భుతమైన ప్రతిభావంతుడు” అని కొనియాడుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఆ బాలుడు ఇప్పటికీ నైనిటాల్ వీధుల్లోనే ఉన్నాడో లేదో తెలుసుకోవాలని, అతనికి సరైన అవకాశం కల్పిస్తే భవిష్యత్తులో ప్రపంచంలోనే గొప్ప ఇంద్రజాలికులలో ఒకరిగా ఎందుకు ఎదగలేడు? అని మహీంద్రా ప్రశ్నించారు. ఆ బాలుడి చదువుతో పాటు, మేజిక్ పట్ల అతనికున్న అభిరుచికి తానే స్వయంగా పూర్తి మద్దతు ఇస్తానని ప్రకటించారు. ఆ బాలుడి వివరాలు, అతని తల్లిదండ్రుల కాంటాక్ట్ నంబర్ తెలిస్తే తనకు తెలియజేయాలని నెటిజన్లను కోరారు.
ఆనంద్ మహీంద్రా తీసుకున్న ఈ నిర్ణయం సోషల్ మీడియాలో సరికొత్త చర్చకు దారితీసింది. భారతదేశంలో ఇలాంటి అద్భుతమైన ప్రతిభకు కొదువ లేదని, కానీ ఆర్థిక పరిమితుల వల్లే చాలామంది వెనకబడిపోతున్నారని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఆ చిన్నారిని వెతికి పట్టుకునేందుకు ప్రస్తుతం సోషల్ మీడియా ఆర్మీ రంగంలోకి దిగింది.
అద్భుతమైన వీడియో ఇక్కడ చూడండి..
Yeh ladka bahut talented hai.
Kya woh abhi bhi Nainital ki sadkon par kaam kar raha hai?
Main na sirf uski padhai mein madad karna chahta hoon, balki jaadu mein uski dilchaspi ko bhi badhava dena chahta hoon.
Kyon na woh duniya ke behtareen jaadugaron mein se ek bane?
Kya… pic.twitter.com/lju2LokTBj
— anand mahindra (@anandmahindra) June 5, 2026
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..