
పంజాబ్, అమృత్‌సర్‌లోని ద్వారకా రోడ్‌లో ‘ది వాకింగ్ స్ట్రీట్’ అనే ఫుడ్ స్టాల్‌ను ఒక జంట నడుపుతోంది. వీరు తయారుచేసే ప్రత్యేకమైన ‘షరాబీ మటన్’ వంటకం తయారీ వీడియో ఇటీవల వైరల్ ఐంది. ఆ వీడియోలో విక్రేత వేడిగా ఉన్న మటన్ కర్రీపై నేరుగా ఆల్కహాల్ పోసి, దాన్ని శుద్ధమైన దేశీ నెయ్యితో వండుతారు. మిగిలిన రెస్టారెంట్లు కేవలం పేరుకే నెయ్యి వాడుతారని, తాను మాత్రం నిజమైన నెయ్యి వాడతాను అని ఆయన ప్రచారం చేస్తారు. వినియోగదారులు ఆసక్తిగా చూస్తుండగా, మద్యం పోసే దృశ్యం ఆన్‌లైన్‌లో లక్షల వ్యూస్ పొందింది.
ఈ వీడియోపై నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. చాలా మంది ఈ జంట సృజనాత్మకతను, వంటకాలను ఇష్టపడడాన్ని ప్రశంసించారు. అయితే మరికొందరు దీని చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తారు. ‘FSSAI అత్యంత పనికిరాని అవినీతి సంస్థ’ అంటూ దీనిపై X (ట్విట్టర్)లో ఒక పోస్ట్ వైరల్ ఐంది. ‘బార్ లైసెన్స్ లేకుండా బహిరంగంగా వంటలో ఆల్కహాల్ వాడడం చట్టబద్ధమేనా? పిల్లలు తింటే పరిస్థితి ఏమిటి?’ అంటూ ప్రశ్నించారు.
ఈ చర్చలో వంట నిపుణులు, ఆహార ప్రియులు ప్రవేశించి అసలు విషయాన్ని వివరించారు. వంటలో ఆల్కహాల్ వాడడం సర్వసాధారణమైన పద్ధతేనని వారు తెలిపారు. వంట చేసే సమయంలో అధిక వేడి కారణంగా ఆల్కహాల్ ఆవిరైపోతుంది. అది కేవలం వంటకానికి సువాసన, రుచిని మాత్రమే ఇస్తుంది. మద్యం యొక్క మత్తు పదార్థం మిగలదు అని వారు వివరించారు.
WTH is this even Legal? Do they have a Bar License? What if children eat these things
FSSAI is the most useless and corrupt organisation pic.twitter.com/xH1CprZTym
— Hindutva Knight (@HPhobiaWatch) October 11, 2025
ఒక వినియోగదారుడు ‘ఆల్కహాల్‌కు నీటి కంటే తక్కువ మరిగే స్థానం ఉంటుంది. దానిని సరిగా ఉడికిస్తే, అది పూర్తిగా ఆవిరైపోతుంది. ఇందులో కంగారుపడాల్సిన పని లేదు’ అని రాశారు. మరొకరు ‘విశ్రాంతి తీసుకోండి, దీనిని డిగ్లేజింగ్ (deglazing) అంటారు. చెఫ్‌లు పాన్‌లో ఉన్న రుచులను పైకి తీసుకురాడానికి ఆల్కహాల్ (వైన్, రమ్, విస్కీ వంటివి) ఉపయోగిస్తారు. వేడి ఆల్కహాల్‌ను కాల్చేస్తుంది, కేవలం సువాసన, గాఢత మాత్రమే మిగులుతుంది. ఈ మటన్ గ్రేవీ తింటే ఎవరూ మత్తుకు గురికారు, దీనికి బార్ లైసెన్స్ అవసరం లేదు’ అని రాశారు. ఈ స్పందనలు సాంప్రదాయ వంట పద్ధతులు, ఆధునిక ఆందోళనల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చూపాయి.