
బ్రిటన్కు చెందిన ఓ మహిళ డిస్కౌంట్ సేల్కు వెళ్లింది. అక్కడ పాత వస్తువులు, ఇంట్లో ఉపయోగించే సామగ్రితో పాటు కొన్ని ఆభరణాలు అమ్మకానికి పెట్టారు. వాటిని చూస్తున్న సమయంలో ఓ ఉంగరం ఆమె దృష్టిని ఆకర్షించింది. దానిపై మెరిసే రాయి ఉండటంతో చూడటానికి అందంగా అనిపించింది. అయితే, అది విలువైన వజ్రపు ఉంగరం అని ఆమె అనుకోలేదు. సాధారణంగా అలంకరణ కోసం ధరించే నకిలీ నగ అని భావించింది. కేవలం ఐదు పౌండ్లు చెల్లించి దాన్ని కొంది. వారాంతంలో ఆ ఉంగరాన్ని ధరించింది. దాని మెరుపు ఆమెకు ఆసక్తిని కలిగించింది. దాంతో ఆ ఉంగరం ఏ లోహంతో తయారైంది? రాయి అసలైన వజ్రమేనా అనే సందేహాలు వచ్చాయి. దాని విలువ తెలుసుకోవాలని నిర్ణయించుకుంది.
ఆ ఉంగరాన్ని వాల్యుయేషన్ కు తీసుకెళ్లింది. అక్కడ రత్నాల నిపుణురాలు ఆశా నాయక్ ఉంగరాన్ని పరీక్షించి ఆ ఉంగరం 18 క్యారెట్ల బంగారంతో తయారైనట్లు గుర్తించారు. దానిపై ఉన్న రాయి కూడా అలంకరణ రాయి కాదని అది 3.02 క్యారెట్ల వజ్రమని నిర్ధారించారు. ఉంగరం విలువను సుమారు 15,000 పౌండ్లు (రూ.16 లక్షలకు పైగా) ఉంటుందని అంచనా వేశారు. కేవలం ఐదు పౌండ్లు పెట్టి కొనుగోలు చేసిన ఉంగరం ఇంత విలువైనదిగా తేలడంతో ఆ మహిళ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
సాధారణంగా కనిపించే వస్తువుల్లోనూ విలువైన సంపద దాగుండే అవకాశం ఉందని, ఇలాంటి అరుదైన వస్తువులను గుర్తించడమే తన ప్రత్యేకత అని రత్నాల నిపుణురాలు ఆశా నాయక్ స్పందించారు. సాధారణంగా కనిపించే ఆభరణాల్లో కూడా అద్భుత నాణ్యత, నైపుణ్యం, చరిత్ర దాగి ఉండవచ్చని అన్నారు. నిపుణులు పరిశీలించినప్పుడే వాటి అసలు విలువ బయటపడుతుందని తెలిపారు. ఉంగరాన్ని వేలం ద్వారా విక్రయిస్తామని WeBuyVintage సంస్థ ముందుకొచ్చింది. అయితే, ఆ మహిళ ఉంగరాన్ని విక్రయించిందా? లేదా అన్న విషయం తెలియరాలేదు. కేవలం ఐదు పౌండ్లతో కొనుగోలు చేసిన ఉంగరం విలువ దాదాపు 15,000 పౌండ్లు విలువ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అదృష్టం కలిసి రావడంతో పాటు సరైన సమయంలో నిపుణుల సలహా తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ ఉదంతం తెలియచేసింది.