నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు ఇప్పుడు వైరల్!

2026 నవంబర్ 13న ప్రపంచం అంతం కాబోతోందంటూ 66 ఏళ్ల క్రితం ప్రముఖ సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధనా కథనం ఇప్పుడు చర్చకు వచ్చింది. ఆ కథనాన్ని రాసింది జ్యోతిష్యులు కాదు.. భవిష్యత్తును అంచనా వేసే వ్యక్తులూ కాదు.. ఏకంగా శాస్త్రవేత్తలు! అప్పట్లో వారు వేసిన లెక్కల ప్రకారం 2026 నాటికి ప్రపంచ జనాభా అపరిమితంగా పెరిగిపోయి.. మనుషులు ఒకరిపై ఒకరు ఒత్తిడికి గురై నలిగిపోయే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మరి ఆ అంచనా నిజమవుతుందా? నవంబర్ 13న ఏదైనా ప్రమాదం జరగబోతోందా? అసలు 1960లో శాస్త్రవేత్తలు ఏం లెక్కలు వేశారు? ఈ ఆసక్తికర కథ వెనుక అసలు విషయం తెలుసుకుందాం.

నవంబర్ 13న డూమ్స్‌డే? 66 ఏళ్ల క్రితం శాస్త్రవేత్తలు వేసిన లెక్కలు ఇప్పుడు వైరల్!
A 1960 Science Paper Named November 13 As Doomsday Here Is Why

Updated on: Nov 11, 2026 | 12:03 AM

ప్రఖ్యాత జర్నల్ ‘సైన్స్’లో 1960లో ఓ పరిశోధనా కథనం ప్రచురితమైంది. దానికి పెట్టిన పేరు ‘Doomsday: Friday, 13 November, A.D. 2026’. 2026 నవంబర్ 13న డూమ్స్‌డే (ప్రళయ దినం) రాబోతోందన్న అర్థం వచ్చేలా ఆ శీర్షిక పెట్టారు. ఈ కథనాన్ని ఆస్ట్రియన్-అమెరికన్ ప్రొఫెసర్, సైబర్నెటిక్స్ నిపుణుడు హీన్జ్ వాన్ ఫోర్స్టర్ తన ఇద్దరు విద్యార్థులు ప్యాట్రిషియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమియోట్‌తో కలిసి రూపొందించారు. అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతుండటంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూమిపై ఉన్న ఆహారం, నీరు, నివాసం వంటి వనరులు పెరుగుతున్న జనాభాకు సరిపోతాయా? భవిష్యత్తులో మానవాళి తీవ్ర సంక్షోభంలో పడుతుందా? అనే ప్రశ్నలు చర్చకు వచ్చాయి. ఈ పరిస్థితిని అధ్యయనం చేసిన పరిశోధకులు ఓ సంచలన వాదనను తెరపైకి తెచ్చారు. సాధారణంగా జనాభా పెరుగుదల ఒక నిర్దిష్ట వేగంతో ఉంటుందని భావిస్తాం. కానీ మానవుల ప్రత్యేక సామర్థ్యాల వల్ల జనాభా పెరుగుదల ఊహించిన దానికంటే మరింత వేగంగా సాగవచ్చని వారు అభిప్రాయపడ్డారు.

గత 2 వేల ఏళ్ల జనాభా లెక్కలు.. 2026పై సంచలన అంచనా!

తమ వాదనకు ఆధారంగా పరిశోధకులు గత రెండు వేల సంవత్సరాల్లో ప్రపంచ జనాభాకు సంబంధించిన 24 అంచనాలను పరిశీలించారు. మానవ జనాభా పెరుగుదల గతంలో అనుకున్న దానికంటే వేగంగా సాగిందని గుర్తించారు. మనుషులు ఒకరితో ఒకరు సమాచారాన్ని పంచుకోవడం, సమూహాలుగా ఏర్పడి సమస్యలను పరిష్కరించుకోవడం వంటి సామర్థ్యాలు జనాభా పెరుగుదలకు మరింత ఊతమిస్తాయని వివరించారు.

ఈ గణాంకాలను ఆధారంగా చేసుకుని భవిష్యత్తు జనాభాను అంచనా వేశారు. వారి గణిత నమూనా ప్రకారం ఇదే వేగం కొనసాగితే 2026 నాటికి ప్రపంచ జనాభా అపరిమిత స్థాయికి చేరుకుంటుంది. అంటే జనాభా పెరుగుదల అదుపు తప్పి మానవాళి మనుగడకే ముప్పు ఏర్పడుతుంది. ఈ సందర్భంగా వారు చేసిన ఓ వ్యాఖ్య అప్పట్లోనే సంచలనం సృష్టించింది. ‘మా ముని ముని మనవళ్లు ఆకలితో చనిపోరు. ఒకరిపై ఒకరు ఒత్తిడికి గురై నలిగిపోతారు’ అని పేర్కొన్నారు. జనాభా పెరుగుదల వల్ల ఆహార కొరత మాత్రమే కాదు భూమిపై మనుషుల సంఖ్య విపరీతంగా పెరగడం కూడా సమస్యగా మారుతుందన్నది వారి ఉద్దేశం.

ప్రపంచవ్యాప్తంగా చర్చ.. విమర్శించిన శాస్త్రవేత్తలు

ఈ కథనం ప్రచురితమైన వెంటనే ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ‘టైమ్’, ‘ది న్యూయార్క్ టైమ్స్’ వంటి ప్రముఖ పత్రికలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి. కొందరు దీన్ని జనాభా పెరుగుదలపై చేసిన వ్యంగ్య వ్యాఖ్యగా భావించారు. మరికొందరు మాత్రం అందులోని గణిత లెక్కలను సీరియస్‌గా తీసుకున్నారు. అయితే పరిశోధకుల అంచనాలపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. పలువురు గణిత శాస్త్రవేత్తలు, జనాభా అధ్యయన నిపుణులు వారి లెక్కలను తప్పుబట్టారు. ఆ అంచనాలు అసంబద్ధంగా ఉన్నాయని, వాస్తవ పరిస్థితులను పూర్తిగా ప్రతిబింబించడం లేదని అభిప్రాయపడ్డారు. దీనికి పరిశోధకులు కూడా గట్టిగానే సమాధానమిచ్చారు. తమ గణిత నమూనాను సమర్థిస్తూ వాదనలు వినిపించారు. దీంతో ఈ ‘డూమ్స్‌డే’ సమీకరణం దశాబ్దాల పాటు చర్చలో నిలిచింది. 1960ల నుంచి 1980ల వరకు జనాభా శాస్త్రం, పర్యావరణం, జన్యు శాస్త్రానికి సంబంధించిన పలు పుస్తకాల్లోనూ దీనిని ప్రస్తావించారు.

1993లో అంచనాలు తారుమారు.. ఎందుకో తెలుసా?

ఈ కథనంలో అసలు ఆసక్తికరమైన మలుపు 1993 ప్రాంతంలో వచ్చింది. అంతకుముందు పరిశోధకుల అంచనాలు వాస్తవ జనాభా గణాంకాలకు దగ్గరగానే కనిపించాయి. 1970, 1980 దశకాలలోనూ వారి లెక్కలు చాలావరకు సరైన దిశలో ఉన్నట్లు అనిపించాయి. కానీ 1993 తర్వాత ప్రపంచ జనాభా పెరుగుదల వారి అంచనాల కంటే వెనుకబడటం ప్రారంభించింది.

దీనికి ప్రధాన కారణం జననాల రేటు తగ్గడం. 1960తో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచ జననాల రేటు సగానికి కంటే తక్కువకు పడిపోయింది. కుటుంబ నియంత్రణపై అవగాహన, విద్యా స్థాయి పెరగడం, పట్టణీకరణ, మహిళల విద్య, ఉద్యోగ అవకాశాలు ఈ మార్పుకు దోహదపడ్డాయి. జనాభా పెరుగుదలపై అప్పట్లో వ్యక్తమైన ఆందోళనలకు ప్రపంచం క్రమంగా పరిష్కారాలను వెతుక్కుంది. పరిశోధకులు ఊహించినట్లుగా జనాభా అపరిమితంగా పెరిగే పరిస్థితి రాలేదు. వారు సూచించిన జననాల రేటు తగ్గింపు దిశగా ప్రపంచవ్యాప్తంగా మార్పులు చోటుచేసుకున్నాయి.

మరి నవంబర్ 13న ఏం జరగబోతోంది?

ఇప్పుడు 2026 నవంబర్ 13 తేదీ దగ్గరపడుతుండటంతో 66 ఏళ్ల నాటి ఈ పరిశోధనా కథనం మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ప్రస్తుత పరిస్థితుల్లో నవంబర్ 13న ప్రపంచ వినాశనం జరుగుతుందనేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ కథనం వెనుక మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. హీన్జ్ వాన్ ఫోర్స్టర్ ఒకప్పుడు స్టేజ్ మ్యాజిషియన్‌గా పనిచేశారు. ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా సాధారణ విషయాన్ని అసాధారణంగా చూపించే కళ ఆయనకు తెలుసు. జనాభా పెరుగుదల వంటి తీవ్రమైన సమస్యపై ప్రపంచం దృష్టి పడేలా చేయడానికి ఆయన తన పరిశోధనలోనూ అదే తరహా ప్రదర్శనాత్మక శైలిని ఉపయోగించారు.

అందుకే 2026 నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందని భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ కథనం మాత్రం ఓ ముఖ్యమైన విషయాన్ని గుర్తుచేస్తోంది. జనాభా పెరుగుదల, ప్రకృతి వనరుల వినియోగం వంటి సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారాలు వెతకడం ఎంత అవసరమో ఈ పరిశోధన తెలియచేసింది.

Loading...
Unable to load recommendations.
Follow Us