
సాధారణంగా 90 ఏళ్లు దాటిన తర్వాత నడవడానికే కర్ర సాయం వెతుక్కుంటారు. కానీ, ఒక వృద్ధురాలు మాత్రం గాల్లో దూసుకెళ్లే విమానం పైకప్పుపై నిలబడి సాహసకృత్యాలు చేసి ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. జర్మనీకి చెందిన 99 ఏళ్ల హెల్గా డఫీ అనే వృద్ధురాలు గాలిలో ఎగిరే విమానం రెక్కపై నిలబడి విన్యాసాలు చేసి, ప్రపంచంలోనే అత్యంత వయోధిక మహిళా వింగ్ వాకర్ గా సరికొత్త రికార్డు సృష్టించింది.
1927 సెప్టెంబరు 23న జన్మించిన హెల్గా డఫీ, 99 సంవత్సరాల 21 రోజుల వయస్సులో ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నారు. చిన్నతనం నుంచే సాహసాలంటే ఇష్టపడే హెల్గాకు, గాల్లో ఎగిరే విమానం పైభాగంలో నిలబడి ప్రయాణించాలనే కోరిక ఉండేది. అయితే కేవలం తన వ్యక్తిగత ఆశయాన్ని నెరవేర్చుకోవడమే కాకుండా, ఒక మంచి ఆశయం కోసం ఆమె ఈ ప్రమాదకరమైన స్టంట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఎయిర్ అంబులెన్స్ ఛారిటీ సంస్థకు నిధులు సేకరించే లక్ష్యంతో ఆమె ఈ సాహసానికి శ్రీకారం చుట్టారు.
యుకే లోని సైరెన్సెస్టర్లో ఎరోసుపర్బాటిక్స్ వింగ్ వాకర్స్ బృందం సహాయంతో ఈ కార్యక్రమం జరిగింది. విమానం భూమిపై నుంచి ఆకాశంలోకి ఎగిరినప్పుడు హెల్గా విమానం పైభాగాన ఉన్న ప్రత్యేక స్టాండ్కు సురక్షితంగా కట్టివేయబడ్డారు. ఆకాశంలో వేగంగా వీచే ఈదురుగాలులు, వణుకు పుట్టించే ఎత్తులోనూ ఆమె ఎలాంటి భయం లేకుండా చిరునవ్వుతో చేతులు ఊపుతూ ప్రయాణించారు.
ఈ సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రత్యక్షమవ్వగానే క్షణాల్లో వైరల్గా మారింది. 99 ఏళ్ల వయస్సులో కూడా ఆమె చూపించిన నిబ్బరం, ధైర్యాన్ని చూసి నెటిజన్లు ముగ్ధులవుతున్నారు. వయస్సు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే అని ఈ అవ్వ నిరూపించారు అని కొందరు కామెంట్ చేయగా, ఛారిటీ కోసం ఈ వయస్సులో అంతటి రిస్క్ తీసుకోవడం నిజంగా అభినందనీయం అని మరికొందరు ప్రశంసిస్తున్నారు. గట్టి పట్టుదల, సమాజానికి మేలు చేయాలనే తపన ఉంటే ఏ వయసులోనైనా చరిత్ర సృష్టించవచ్చని హెల్గా డఫీ మరోసారి నిరూపించారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..