
అత్తాకోడళ్ల మధ్య ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు వస్తుంటాయి. కుటుంబంలో చిన్నచిన్న విషయాలకే మనస్పర్థలు రావడం, ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోవడం వంటి కారణాలతో వారి మధ్య దూరం పెరుగుతుందని అంటుంటారు. అయితే, ప్రతి అత్తాకోడళ్ల బంధం ఇలాగే ఉంటుందని చెప్పలేం. ఒకరిపై ఒకరికి ప్రేమ, గౌరవం, నమ్మకం ఉంటే ఆ బంధం కూడా ఎంతో ఆప్యాయంగా మారుతుంది. దీనికి నిదర్శనంగా నిలుస్తోంది చైనాకు చెందిన 68 ఏళ్ల మహిళ తన కోడలిని 17 ఏళ్లుగా కంటికి రెప్పలా చూసుకుంటున్న హృదయాన్ని కదిలించే కథ.
చైనాలోని షాన్డాంగ్ ప్రావిన్స్ కింగ్యున్ కౌంటీకి చెందిన జు అనే మహిళకు 2009లో పెళ్లయిన నెల రోజులకే రోడ్డు ప్రమాదంలో ఓ ట్రక్కు ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయమై స్పృహ లేని స్థితిలోకి వెళ్లింది. కొత్త కోడలి పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు చలించిపోయారు. అత్త జువాన్ ఫెంగ్యింగ్ అప్పటి నుంచి దాదాపు 17 ఏళ్లుగా కోడలిని చూసుకుంటోంది.
కోడలిని చూసుకోవడం జువాన్కు నిత్యకృత్యంగా మారిపోయింది. ఒక్కోసారి ఒక పూట భోజనం తినిపించడానికి దాదాపు గంట సమయం పట్టేది. ద్రవాహారాన్ని కొద్దికొద్దిగా చెంచాతో తినిపించేది. ఎక్కువసేపు ఒకే స్థితిలో పడుకుని ఉండటం వల్ల శరీరంపై పుండ్లు ఏర్పడకుండా రోజుకు పదిసార్లకు పైగా ఆమెను పక్కకు తిప్పేది. అలాగే శరీరాన్ని శుభ్రంగా ఉంచడంతో పాటు కండరాలకు మసాజ్ చేసేది. కోడలు స్పందించకపోయినా ఆమెతో మాట్లాడటం మాత్రం మానలేదు. తన గ్రామంలో జరుగుతున్న విషయాలను చెప్పేది. వార్తలు వినిపించేది. కోడలికి ఇష్టమైన పాటలు పెట్టేది. పదేపదే పేరుపెట్టి పిలుస్తూ ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించేది. అలా రోజులు, నెలలు కాదు.. ఏకంగా 17 ఏళ్లపాటు కోడలి బాగోగులను చూసుకుంటూ వచ్చింది.
కొన్నేళ్ల తర్వాత జు స్పృహలేని స్థితి నుంచి బయటపడింది. అయితే ప్రమాదంలో మెదడుకు తీవ్ర గాయమైన కారణంగా ఆమె ఆలోచనా సామర్థ్యం చిన్నపిల్లల స్థాయికి దిగజారడం కుటుంబాన్ని కలచివేసింది. దీంతో జువాన్ కోడలికి మళ్లీ ప్రాథమిక నైపుణ్యాలను నేర్పించడం ప్రారంభించింది. వ్యాయామాలు చేయిస్తూ, రోజువారీ పనులను మళ్లీ అలవాటు చేసింది. ప్రస్తుతం జు కొన్ని పదాలు మాట్లాడుతోంది. తనకు తానుగా వంట చేయడం నేర్చుకుంది. ఇన్నేళ్ల కష్టానికి ఫలితంగా కోడలిలో వచ్చిన ఈ మార్పులు జువాన్కు కొంత ఊరటనిస్తున్నాయి.
జువాన్ ఫెంగ్యింగ్ వయసు 68 ఏళ్లు. ఆమె కూడా అధిక రక్తపోటు, కాళ్లలో దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతోంది. అయినప్పటికీ కోడలి భవిష్యత్తు గురించే ఎక్కువగా ఆలోచిస్తోంది. ‘ఆమె నా కొడుకును పెళ్లి చేసుకుంది ఆమె కూడా నా బిడ్డే. అలాంటప్పుడు ఆమెను ఎలా వదిలేస్తాను?’ అంటుంది. తన కోడలు మరింతగా కోలుకోవాలన్నదే ఆమె కోరిక.
జువాన్ ఫెంగ్యింగ్ తన కోడలి కోసం చేస్తున్న సేవలను చూసి సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అత్త ప్రేమ మాతృప్రేమ కంటె గొప్పదని ఒకరు వ్యాఖ్యానించగా, మరికొందరు ఆమె ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలని ఆకాంక్షించారు. అత్తాకోడళ్ల బంధంపై అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. కానీ తన కోడలిని సొంత బిడ్డగా భావించి 17 ఏళ్లుగా సేవలు చేస్తున్న జువాన్ కథ కుటుంబ బంధాల్లోని ఆప్యాయతకు నిదర్శనంగా నిలుస్తోంది. తన ఆరోగ్య సమస్యలను సైతం పక్కనపెట్టి కోడలి భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్న ఈ 68 ఏళ్ల మహిళ కథ ఇప్పుడు హృదయాలను కదిలిస్తోంది.