Sangareddy: ఫోన్ కొనడానికి డబ్బలు లేవని ఇతగాడు ఏం చేశాడో తెలుసా..?

ఫోన్ కొనుగోలు చేయడంతో పాటు వీడియోగ్రఫీ పరికరాలు సమకూర్చుకునేందుకు డబ్బులు అవసరం కావడంతో ఓ యువకుడు సొంత మామ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డాడు. ఐదు తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలు, నగదును అపహరించిన మేనల్లుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

Sangareddy: ఫోన్ కొనడానికి డబ్బలు లేవని ఇతగాడు ఏం చేశాడో తెలుసా..?
Mobile

Edited By:

Updated on: Nov 05, 2026 | 3:26 PM

ఫోన్ కొనుగోలుతో పాటు వీడియోగ్రఫీకి అవసరమైన పరికరాలు సమకూర్చుకోవాలనుకున్న ఓ యువకుడు.. అందుకోసం దొంగతనానికి పాల్పడ్డాడు. అదీ తనకు వరుసకు మామయ్య అయ్యే వ్యక్తి ఇంట్లోనే. బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును అపహరించి పోలీసులకు చిక్కాడు. సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అందోల్ మండలం మాన్సానిపల్లికి చెందిన శ్రీశైలం గత శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి ఓ బంధువు ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. అదే కార్యక్రమానికి హాజరైన అతని మేనల్లుడు సారా చంద్రశేఖర్.. మామ కుటుంబం ఇంట్లో లేదని గమనించాడు. ఇదే అదనుగా భావించి చోరీకి పథకం వేశాడు.

అనుకున్నదే తడవుగా మామ ఇంటి తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించాడు. రెండు బీరువాలను ధ్వంసం చేసి అందులో ఉన్న ఐదు తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండి గొలుసులు, రూ.8 వేల నగదును అపహరించాడు. శుభకార్యం ముగించుకుని ఇంటికి తిరిగొచ్చిన శ్రీశైలం కుటుంబ సభ్యులకు పగిలిన తాళాలు, ధ్వంసమైన బీరువాలు కనిపించాయి. దీంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గ్రామంలోని సీసీ కెమెరాల దృశ్యాలను పరిశీలించగా.. ఓ వ్యక్తి బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. ఆ దృశ్యాలు, నిందితుడి ఫొటో ఆధారంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలో చోరీ చేసింది బాధితుడి మేనల్లుడేనని తేలింది. రంగంపేట గ్రామానికి చెందిన సారా చంద్రశేఖర్ ఈ దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.

ఫోన్ కొనడంతో పాటు వీడియోగ్రఫీ పరికరాలు సమకూర్చుకునేందుకు డబ్బులు అవసరం కావడంతో మామ ఇంట్లోనే చోరీ చేసినట్లు విచారణలో చంద్రశేఖర్ అంగీకరించాడు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చోరీకి గురైన బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. సొంత బంధువుల ఇంట్లోనే మేనల్లుడు చోరీకి పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

Loading...
Unable to load recommendations.
Follow Us