
దొంగతనం చేయలేదని చెబుతున్నా.. తనపై చోరీ నింద వేయడంతో ఓ 17 ఏళ్ల బాలుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. తన మాట ఎవరూ నమ్మడం లేదనే ఆవేదనతో చివరకు రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది.
వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు తన చిన్నమ్మ, బాబాయ్ ఇంటికి వెళ్లాడు. అయితే ఇంట్లో ఉంచిన కొంత నగదు కనిపించకుండా పోయింది. దీంతో ఆ డబ్బును బాలుడే తీసుకున్నాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే తాను ఎలాంటి దొంగతనం చేయలేదని, తనపై అనవసరంగా నిందలు వేస్తున్నారని బాలుడు చెప్పాడు. అయినప్పటికీ తన మాట ఎవరూ నమ్మడం లేదని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.
ఈ పరిణామాలతో మనస్తాపానికి గురైన బాలుడు దేవరకద్ర సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడి జేబులో ఓ లేఖ లభించింది. చనిపోయే ముందు తన ఆవేదనను వివరిస్తూ అతడు ఆ లేఖ రాసినట్లు గుర్తించారు. తనపై వచ్చిన దొంగతనం ఆరోపణలు, వాటిపై తన వివరణను అందులో ప్రస్తావించాడు.
బాలుడి మృతితో తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే అతడు ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చోరీ ఆరోపణలతో మనస్తాపానికి గురైన బాలుడు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.