రాజకీయాలకు అతీతంగా దసరా పండగా.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పల్లెపహాడ్‌

దసరా పండుగ అంటే దేశవ్యాప్తంగా ఆయుధ పూజలు చేస్తారు, రావణ దహనాలు నిర్వహిస్తారు, జమ్మి చెట్టుకు పూజలు చేసి అలాయ్-బలాయ్ తీసుకుంటారు. కానీ, ఆ గ్రామంలో మాత్రం దసరా పండుగ వస్తే రాజకీయాలన్నీ పక్కనపడతాయి. పార్టీలు వేరైనా.. సిద్ధాంతాలు వేరైనా.. దసరా పండుగ నాడు ఊరంతా కలిసి వెరైటీ సంబరాలు చేసుకుంటారు. 80 ఏళ్లుగా సాగుతున్న ఈ అపూర్వ, విలక్షణ సాంప్రదాయం గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

రాజకీయాలకు అతీతంగా దసరా పండగా.. దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న పల్లెపహాడ్‌
Pallepahad Village Dussehra

Edited By:

Updated on: Oct 20, 2026 | 1:15 PM

యాదాద్రి జిల్లా మోత్కూరు మండలం పల్లెపహాడ్ లో దసరా పండుగను వినూత్న రీతిలో జరుపుకుంటారు. సాధారణంగా రాజకీయాలు అంటేనే శత్రుత్వాలు.. ఎన్నికలు వస్తే చాలు కత్తులు దూసుకునే నాయకులు.. ఒకరి ముఖం ఒకరు చూసేందుకు ఇష్టపడరు. మరి దసరా పండుగ రోజు ఘర్షణ పడుతుంటాయి. కానీ ఈ గ్రామంలో సీన్ టోటల్‌గా రివర్స్! దసరా పండుగ వచ్చిందంటే చాలు రంగు రంగుల జెండాలతో ఊరేగింపుగా జనం, డప్పు చప్పుళ్లు, ఉత్సాహంగా పండుగ జరుపుకుంటారు.

విలక్షణ సాంప్రదాయం..

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పల్లెపహాడ్ వాసులు కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. తెలంగాణ సాయుధపోరాటం ముగించుకున్న తదుపరి వచ్చిన తొలి పండగ దసరా. దసరా పండుగకు నాటి పూర్వికులు సరికొత్త సాంప్రదాయానికి నాంది పలికారు. నిజాం నవాబు మీద విజయం సాధించినందుకు ఆ రోజుకు గుర్తుగా పల్లెపహాడ్ గ్రామంలో నాటి దళ నాయకుడు చాకిలి అయిలయ్య నేతృత్వంలో ఉన్న పెద్ద బురుజు మీద కమ్యూనిస్టులు ఎర్రజెండాను ఎగరవేశారు. ఊరంతా ప్రదర్శనలు నిర్వహించి పండగను జరుపుకొన్నారు.

పార్టీలు వేరైనా జెండాల పండుగ ఒక్కటే..

దసరా రోజు గ్రామంలోని కమ్యూనిస్టు పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్.. ఇలా అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ తమ పార్టీ జెండాలను చేతబూని రోడ్ల పైకి వస్తారు. ఊరంతా జెండాలను ఎగరవేస్తూ, భారీ ప్రదర్శనలు నిర్వహిస్తూ దసరా ఉత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపు కుంటారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఎలా ఉన్నా, దసరా పండుగ నాడు మాత్రం జెండాలు వేరైనా.. మా అజెండా మాత్రం ఒక్కటిగా నిలుస్తున్నారు. కులమతాలకు అతీతంగా, అంతకంటే మిన్నగా రాజకీయ రంగులను పక్కనపెట్టి అందరూ ఒకే తాటిపైకి వస్తారు.

80 ఏళ్లుగా సాగుతున్న అపూర్వ ఘట్టం..

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 80 ఏళ్లుగా ఈ విలక్షణ సాంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారు. జెండాలు వేరైనా.. మా అజెండా మాత్రం ఒకటే, అదే ‘గ్రామ ఐక్యత’ అంటూ ఇక్కడి ప్రజలు దేశానికే సరికొత్త ఆదర్శంగా నిలుస్తున్నారు. పార్టీలు వేరైనా మేమంతా ఒకే తల్లి పిల్లలం అని పల్లె పహాడ్ గ్రామం చాటిచెబుతోంది. ఏకంగా 80 ఏళ్లుగా ఈ విలక్షణ సాంప్రదాయాన్ని ఇక్కడి ప్రజలు కొనసాగిస్తున్నారని గ్రామ సీపీఐ నాయకుడు కూసుమంచి హరిశ్చంద్ర గర్వంగా చెబుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us