
పోలీసుల కళ్లు గప్పి, చేతి సంకెళ్లతోనే ఆసుపత్రి నుంచి పరారైన ఓ అండర్ ట్రయల్ ఖైదీ ఉదంతం హైదరాబాద్‌లో తీవ్ర కలకలం సృష్టించింది. హుస్సేనీ ఆలం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో.. పక్కా ప్లాన్‌తో తప్పించుకున్న నిందితురాలిని కమిషనర్ టాస్క్‌ఫోర్స్, చార్మినార్ జోన్ పోలీసులు అత్యంత చాకచక్యంగా పట్టుకున్నారు. రాంగోపాల్‌పేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో నిందితురాలైన ఘంటసాల త్రివేణి (26) ప్రస్తుతం చంచల్‌గూడ మహిళా జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. ఈ నెల 13న వైద్య పరీక్షల నిమిత్తం ఎస్కార్ట్ పోలీసులు ఆమెను పెట్లబుర్జ్‌లోని మోడరన్ మెటర్నిటీ హాస్పిటల్‌కు తీసుకువచ్చారు. ఆసుపత్రిలో రద్దీని ఆసరాగా చేసుకున్న త్రివేణి, ఉదయం 11 గంటల సమయంలో పోలీసుల పహారా నుంచి తప్పించుకుంది. చేతికి సంకెళ్లు ఉన్నప్పటికీ ఆమె అక్కడి నుంచి మాయం అవ్వడంతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
ఆసుపత్రి నుంచి పారిపోయిన త్రివేణి నేరుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఎక్కి.. తోటి ప్రయాణికుడి ఫోన్ ద్వారా తన బంధువులకు కాల్ చేసింది. తనకు బెయిల్ వచ్చిందని నమ్మబలికి, విజయవాడ స్టేషన్‌కు వచ్చి తనను తీసుకెళ్లాలని కోరింది. బంధువు ఆమెను తీసుకెళ్లి స్వస్థలం భీమవరం చేర్చాడు. అయితే పోలీసులు తమను పట్టుకుంటారనే భయంతో ఏప్రిల్ 15న మళ్లీ హైదరాబాద్ చేరుకున్న త్రివేణి, దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో తలదాచుకుంది. అనంతరం అక్కడి నుంచి గచ్చిబౌలిలోని ఒక కాఫీ డేకి చేరుకుంది.
ఖైదీ పరారీపై హుస్సేనీ ఆలం పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్ల సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టారు. టెక్నికల్ టీమ్, టాస్క్‌ఫోర్స్ బృందాలు ఫోన్ కాల్స్ ఆధారంగా ఆమె కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాయి. త్రివేణి గచ్చిబౌలిలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో అదనపు డీసీపీ శ్రీనివాస రావు పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్, హుస్సేనీ ఆలం పోలీసులు ఆమెను చుట్టుముట్టి అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి ఒక ఫోన్, పారిపోయేటప్పుడు తీసుకెళ్లిన చేతి సంకెళ్లను స్వాధీనం చేసుకున్నారు.
కేవలం రెండు రోజుల్లోనే నిందితురాలి ఎత్తుగడలను తిప్పికొట్టి, ఆమెను తిరిగి జైలుకు పంపిన పోలీసు బృందంపై ప్రశంసలు కురుస్తున్నాయి. చార్మినార్ జోన్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సాయిదాబాబు, ఎస్ఐలు రామారావు, స్వామి, మహేష్, కానిస్టేబుల్స్ ఈ ఆపరేషన్‌లో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం నిందితురాలిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి, తిరిగి చంచల్‌గూడ సెంట్రల్ జైలుకు తరలించారు.