
ఎల్నీనో ప్రభావంతో రాష్ట్రంలో నెలకొన్న నీటి కొరతను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మాణంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమైంది. ఈ చర్చలకు ఇరిగేషన్ అధికారులు సిద్ధంగా ఉండాలని తాజా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌తో పాటు డిండి, అచ్చంపేట ఎత్తిపోతల ప్రాజెక్టులపై పీటముడిగా ఉన్న అంశాలన్నింటినీ ఈ సమావేశంలో చర్చించారు.
బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావంపై సమీక్ష
తుమ్మిడిహెట్టి వద్ద 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మిస్తే ఎంత నీటిని తెచ్చుకునే వీలుంది.. 150 మీటర్ల ఎత్తున ఎంత నీటిని ఎల్లంపల్లి వరకు తెచ్చుకునే వీలుందనే వివరాలను ఇరిగేషన్ ఇంజనీర్లు సీఎంకు వివరించారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణంతో మహారాష్ట్ర పరిధిలో ఎక్కడా గ్రామాలు ముంపునకు గురయ్యే ప్రమాదం లేదని స్పష్టం చేశారు. 152 మీటర్ల ఎత్తున నిర్మిస్తే దాదాపు 2,300 ఎకరాల భూములు ముంపునకు గురవుతాయని, 150 మీటర్ల ఎత్తున నిర్మిస్తే వెయ్యి ఎకరాల లోపే ముంపు ప్రభావం ఉంటుందని వెల్లడించారు.
మహారాష్ట్రలో ముంపు ప్రభావాన్ని అంచనా వేసుకొని, సాధ్యమైనంత నీటిని తెచ్చుకునేందుకు వీలుగా ఈ బ్యారేజీని నిర్మించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన రెండు రాష్ట్రాల అధికారుల సమావేశంలోని వివరాలన్నీ సిద్ధంగా ఉంచుకోవాలని, సీడబ్ల్యూసీ కోరిన సమాచారాన్ని అందజేయాలని సూచించారు.
ఆదిలాబాద్‌కు 2 లక్షల ఎకరాలకు సాగునీరే లక్ష్యం
అటవీ, గిరిజన ప్రాంతం, అత్యంత వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకే తుమ్మిడిహెట్టి బ్యారేజ్ నిర్మిస్తున్నామని సీఎం వివరించారు. అదే లక్ష్యాన్ని సాధించే సంకల్పంతో మహారాష్ట్ర ప్రభుత్వంతో సానుకూల చర్చలు, సంప్రదింపులు జరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ‘జల్ జంగిల్ జమీన్’ నినాదంతో ఏళ్లకేళ్లు పోరాడిన అటవీ ప్రాంతవాసులందరికీ ఈ ప్రాజెక్టు ద్వారా మేలు జరగాలని, అందుకే తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పనులను వేగవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
152 మీటర్ల ఎత్తు సాధన కోసం సాంకేతిక నివేదికలు
బ్యారేజీ ఎత్తుపై స్పష్టత వచ్చిన తర్వాత, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు నీటిని తెచ్చే ప్రాజెక్టు రూట్ డిజైన్లు, భూసేకరణపై దృష్టి సారించాలని ఇరిగేషన్ ఇంజనీర్లను సీఎం ఆదేశించారు. గతంలోనే 148 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర అంగీకరించిందని, అంత తక్కువ ఎత్తున బ్యారేజీ నిర్మిస్తే ఆశించినంత నీటిని తెచ్చుకునే వీలుండదని సీఎం అన్నారు. అందుకే 152 మీటర్ల ఎత్తున బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు అవసరమైన సాంకేతిక నివేదికలు, నీటి లభ్యత, ముంపు విస్తీర్ణం, ఇతర అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను సిద్ధంగా ఉంచాలన్నారు.
ఇటీవల ఢిల్లీలో కేంద్ర జల సంఘం ఆధ్వర్యంలో జరిగిన సమావేశాల వివరాలు, అక్కడ చర్చించిన అంశాలు, వారు కోరిన నివేదికలన్నీ వెంటనే సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మహారాష్ట్రతో చర్చల సందర్భంగా తెలంగాణ నీటి అవసరాలను స్పష్టంగా తెలియజేసి, మన వాదనను సమర్థంగా వినిపించాలని మంత్రులకు సీఎం సూచించారు.
డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు అదనపు జలాలు
డిండి ప్రాజెక్టుకు ఏదుల రిజర్వాయర్ నుంచి 0.5 టీఎంసీలు, అచ్చంపేట ఎత్తిపోతల పథకానికి 0.1 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ రెండు ప్రాజెక్టులకు అవసరమయ్యే మొత్తం 0.6 టీఎంసీల నీటిని శ్రీశైలం నుంచి అదనంగా సమకూర్చుకునే ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీశైలం, నార్లాపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్ వరకు ఈ అదనపు నీటిని లిఫ్ట్ చేసుకునేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎక్కడెక్కడ పంపులు, పంప్‌హౌస్‌లు అమర్చాలి.. ఇప్పుడున్న కెనాల్స్, టన్నెల్ సిస్టమ్ సామర్థ్యం సరిపోతుందా.. లేక ఎక్కడైనా కాలువల సామర్థ్యం పెంచుకోవాలా అనే అంశాలపై ఇరిగేషన్ విభాగం వెంటనే అధ్యయనం చేసి, తగిన డిజైన్లు రూపొందించాలని ఆదేశించారు. దీనివల్ల పాలమూరు ప్రాజెక్టు నీటి అవసరాలకు ఎలాంటి కోత పడదని సీఎం స్పష్టం చేశారు. పాలమూరు కేటాయింపులకు ఆటంకం కలగకుండా ఏదుల నుంచి డిండి, అచ్చంపేట ప్రాజెక్టులకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పాలమూరు ప్రాజెక్టుకు ఢోకా లేకుండా ప్రణాళిక
నార్లాపూర్ నుంచి డిండికి నీటిని తరలించాలా లేక ఏదుల నుంచి డిండికి నీటిని తీసుకోవాలా అనే అంశంపై మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల ప్రజాప్రతినిధుల అభ్యంతరాలు, విజ్ఞప్తులపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. నార్లాపూర్ నుంచి తరలిస్తే అయ్యే వ్యయం, ఏదుల నుంచి తీసుకుంటే అయ్యే అంచనా వ్యయాలను అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా సీఎంకు వివరించారు. మధ్యేమార్గంగా పాలమూరు ప్రాజెక్టు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా డిండి, అచ్చంపేట ఎత్తిపోతలకు నీటిని లిఫ్ట్ చేసేందుకు అదనపు నీటిని తెచ్చుకునే పనులు చేపట్టాలన్న సీఎం ప్రతిపాదనకు మంత్రులు పూర్తి మద్దతు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.