Telangana Election Results 2023: తెలంగాణలో మారిన బలాబలాలు.. లోక్‌సభ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీల కొత్త లెక్కలు
తెలంగాణలో హ్యాట్రిక్ పక్కా అనుకున్న గులాబీ పార్టీ జోరుకు పగ్గాలు వేసిన అసెంబ్లీ ఎన్నికలు, బలాబలాల తక్కెడలో కొత్త లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రెండు జోన్లను రెండు పార్టీలు పంచుకుంటే, మూడో జోన్ ముక్కోణపు ఫైటింగ్‌కు వేదికగా మారింది. గ్రామీణ ప్రాంత ఓటు బ్యాంక్ తమదేనని నమ్ముకున్న గులాబీకి నిరాశే మిగిలింది. మొత్తానికి మారిన బలాబలాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కొత్త సమీకరణాలను రచిస్తున్నాయి.
తెలంగాణలో హ్యాట్రిక్ పక్కా అనుకున్న గులాబీ పార్టీ జోరుకు పగ్గాలు వేసిన అసెంబ్లీ ఎన్నికలు, బలాబలాల తక్కెడలో కొత్త లెక్కలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రెండు జోన్లను రెండు పార్టీలు పంచుకుంటే, మూడో జోన్ ముక్కోణపు ఫైటింగ్‌కు వేదికగా మారింది. గ్రామీణ ప్రాంత ఓటు బ్యాంక్ తమదేనని నమ్ముకున్న గులాబీకి నిరాశే మిగిలింది. మొత్తానికి మారిన బలాబలాలు వచ్చే లోక్‌సభ ఎన్నికలకు కొత్త సమీకరణాలను రచిస్తున్నాయి.
మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అంటూ ఆ పార్టీ ఇచ్చిన నినాదానికి తెలంగాణ ప్రజలు జైకొట్టారు. హ్యాట్రిక్ కొట్టాలన్న గులాబీ ఆకాంక్షలకు ఓటర్లు థమ్సప్ చెప్పలేదు. తెలంగాణ రాజకీయ ముఖచిత్రాన్ని మూడు భాగాలుగా విభజిస్తే, అందులో భిన్నమైన రాజకీయ ముఖచిత్రాలు కనిపిస్తున్నాయి. దక్షిణ తెలంగాణ తన కంచుకోట అని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో మరోసారి చాటి చెప్పింది. ఇక్కడ తమను ఢీకొట్టడం రాజకీయ దురంధరుడైన కేసీఆర్‌కు కూడా సాధ్యం కాదని నిరూపించింది.
ఖమ్మం, నల్గొండ, వరంగల్, పాలమూరు, మెదక్ కలిపి దక్షిణ తెలంగాణగా పిలుచుకుంటారు. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కు 33 సీట్లు వస్తే, BRSకు 12 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ భాగస్వామి అయిన CPIకి ఒక సీటు దక్కింది. ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి నల్గొండ జిల్లాలను క్లీన్ స్వీప్ చేయాలని గులాబీ పార్టీ ఈసారి ఎత్తుగడలు వేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులను పార్టీలో చేర్చకుంది. కమ్యూనిస్టుల్లో CPIని కూడా కలుపుకుంది. అటు YSRTP అధినేత్రి వైఎస్ షర్మిల మద్దతు కూడా కాంగ్రెస్ తీసుకుని బలపడింది. BRS నేతలను అసెంబ్లీ గేటు కూడా తాకనీయనన్న పొంగులేటి తన సత్తా చాటుకున్నారు. తుమ్మలను బరిలోకి దించి, ఖమ్మంలో మంత్రి పువ్వాడకు కాంగ్రెస్ ఇంటికి పంపించింది.ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఎనిమిది సీట్లు దక్కాయి. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన CPI కొత్తగూడెం సీటుకు తన ఖాతాలో వేసుకుంది. దీంతో ST సెగ్మెంటు అయిన భద్రాచలం సీటుని మాత్రమే BRS దక్కించుకోగలిగింది.
ఇక కాంగ్రెస్ మహామహులున్న నల్గొండ జిల్లాలను ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 సీట్లకు 10 సీట్లు దక్కించుకన్న గులాబీ పార్టీ ఈ సారి చతికిలబడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు 11 సీట్లు వస్తే, BRSకు ఒకే సీటు దక్కింది. అంటే సూర్యాపేట నుంచి మంత్రి జగదీష్‌రెడ్డి మాత్రమే విజయం సాధించగలిగారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా కాంగ్రెస్ జోరుకు గులాబీ పార్టీ పగ్గాలు వేయలేకపోయింది. ఇక్కడినుంచి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి ఓడిపోయారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌కు పదకొండు సీట్లు వస్తే, BRSకు మూడు సీట్లు వచ్చాయి. అయితే, దక్షిణ తెలంగాణలో ఒకటైన ఉమ్మడి మెదక్ జిల్లాలో మాత్రం సీన్ మరోలా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్‌కు మూడు సీట్లే వస్తే, BRSకు ఏడు సీట్లు వచ్చాయి.
ఇక, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం గులాబీకి కంచుకోటగా నిలిచింది. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్‌కు గాలి వీస్తే, గ్రేటర్‌లో మాత్రం ఆ పార్టీకి మేటర్ లేదనిపించింది. తెలంగాణకు నడి మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో అభివృద్దిని, ఉపాథిని కళ్లముందు చూపించిన బీఆర్‌ఎస్‌ను ఇక్కడి ఓటర్లు ఆదరించారు. అభివృద్ధితోపాటు, శాంతిభద్రతలు అన్న అంశాలు సీమాంధ్రులను, మైనారిటీలను గులాబీ జెండా వైపే నిలిపేలా చేశాయి. గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డిలో మొత్తం 29 సీట్లు ఉన్నాయి. ఇక్కడ BRS 17 సీట్లను కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ తన గోషామహల్ సీటును నిలుపుకుంది. ఇక ఓల్డ్ సిటీలో మజ్లిస్ తన ఏడు సీట్లను నిలుపుకుంది. మరో నాలుగు సీట్లను కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది.
దక్షిణ తెలంగాణ, గ్రేటర్‌లకు భిన్నంగా ఉత్తర తెలంగాణలో బలాబలాలు మారిపోయాయి. ఉత్తర తెలంగాణ ప్రాంతం BRSకి కంచుకోటలా ఉంటే, ఇక్కడ కాంగ్రెస్, బీజేపీలు తమ సత్తాచాటిచెప్పాయి. ఉత్తర తెలంగాణలో 44 సీట్లు ఉన్నాయి. ఇందులో పది సీట్ల ఉమ్మడి ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ నాలుగు, BRS రెండు, BJP నాలుగు సీట్లను సాధించాయి. ఇక తొమ్మిదిసీట్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు నాలుగు, BRSకి రెండు, బీజేపీకి మూడు సీట్లు దక్కాయి. అటు 13 సీట్ల ఉమ్మడి కరీంనగర్‌లో కాంగ్రెస్ ఎనిమిది, BRSకి ఐదు సీట్లు సాధించాయి. ఇక 12 సీట్ల ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్‌కు పది సీట్లు, BRSకు రెండు సీట్లు వచ్చాయి.
తెలంగాణలో హ్యాట్రిక్ కొడతామన్న గులాబీ పార్టీ, ఉత్తర, దక్షిణ తెలంగాణల్లో ఘోరంగా దెబ్బతిన్నది. రైతుబంధు, దళితబంధు, డబుల్ బెడ్‌రూములను నమ్ముకున్న BRS, ప్రజానాడిని పట్టుకోవడంలో విఫలమైంది. ఇక సింగరేణి బెల్ట్ కూడా అధికారపార్టీకి షాక్ ఇచ్చింది. కానీ అభివృద్ధి, శాంతిభద్రతలకు KCR ప్రభుత్వం పెద్దపీట వేయడంతోపాటు, మజ్లిస్‌తో దోస్తీ… ఆ పార్టీకి గ్రేటర్, రంగారెడ్డిని బలమైన పునాదిగా మార్చాయి. మొత్తం మీద తెలంగాణలో మారిన బలాబలాలు, లోక్‌సభ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలకు సిలబస్‌ని అప్పగించాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లైవ్ కవరేజ్ :