Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త పథకం..

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్తగా మరో పథకాన్ని అమల్లోకి తెచ్చింది. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో అర్హత గల ప్రతి కుటుంబానికి 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం' కింద రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందించనున్నారు. హైదరాబాద్ జిల్లాలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని మంత్రి లాంఛనంగా ప్రారంభించి, రిజిస్ట్రేషన్ చేసుకున్న కుటుంబాలకు బీమా పత్రాలను అందజేశారు.

Telangana: తెలంగాణ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త పథకం..
Indiramma Kutumba Jeevana Bheema Scheme

Updated on: Nov 21, 2026 | 7:19 AM

తెలంగాణ ప్రజలకు మరో పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది రేవంత్ సర్కార్. పేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో మాజీ ప్రధానమంత్రి భారతరత్న ఇందిరా గాంధీ జయంతిని పురస్కరించుకుని నవంబర్ 19న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ జీవిత బీమా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించగా.. శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించే ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం ద్వారా తెలంగాణ దేశంలోనే ఈ తరహా పథకాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా నిలిచిందని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ప్రత్యేక పథకాల పరిధిలో, ముఖ్యంగా రైతులకు మాత్రమే అందుబాటులో ఉన్న జీవిత బీమా రక్షణను వివిధ వృత్తులు, ఉపాధి రంగాలకు చెందిన సాధారణ కుటుంబాలకు సైతం విస్తరించడం ఈ పథకం ప్రత్యేకత అని వివరించారు. ఆపద సమయంలో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలనే ప్రజా ప్రభుత్వ సంకల్పానికి ఇది నిదర్శనమని అన్నారు.

కుటుంబానికి జీవనాధారంగా ఉన్న సంపాదనపరుడు ఆకస్మికంగా మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతుందని, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలు, జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా పరిహారం అందించడం ద్వారా ఆర్థిక భద్రత కల్పించడంతో పాటు, బీమా ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే భరించడం వల్ల లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని స్పష్టం చేశారు. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాకుండా, కష్ట కాలంలో కుటుంబాలకు భరోసా, భద్రత కల్పించే అత్యంత ముఖ్యమైన సంక్షేమ కార్యక్రమమన్నారు.

ఈ పథకం విజయవంతమైన అమలుకు అర్హులైన ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించి, గరిష్ట స్థాయిలో నమోదు చేయించడం అత్యంత ముఖ్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, సన్న బియ్యం పంపిణీ, ఆహార భద్రత కార్డుల విస్తరణ, ఇందిరమ్మ ఇళ్ల వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రస్తావిస్తూ, అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us