
రాష్ట్రంలోని నిరుద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి రేవంత్ సర్కార్ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే 1.3 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొంది. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఢిల్లీలో మంత్రులతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి వారికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలకు ముందుగానే పట్టభద్రుల నమోదు, ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా ఎన్నికలు జరగబోయే జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఓటర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.
ప్రజాప్రతినిధులు తమ నియోజకవర్గాల్లోని అర్హులైన గ్రాడ్యుయేట్ ఓటర్లను గుర్తించి.. అవగాహన కార్యక్రమాలను నిర్వహించడంతో పాటు పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, ఉపాధి కల్పనకు ఇస్తున్న ప్రాధాన్యతను ఓటర్లకు వివరించాలని తెలిపారు. ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వ పనితీరును ప్రస్తావిస్తూ.. గత ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, పోటీ పరీక్షలు నిర్వహించడంలో విఫలమైందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. గ్రూప్-1 పరీక్షలను విజయవంతంగా నిర్వహించడంతో పాటు డీఎస్సీ పోస్టులను కూడా భర్తీ చేసినట్టు తెలిపారు.
రాబోయే రెండేళ్లలో 1.3 లక్షల ఉద్యోగాలు
అలాగే ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఇప్పటికే 70 వేల నియామకాలు చేపట్టామని.. రాబోయే రెండేళ్లలో మిగిలిన 1.3 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ నియామక ప్రక్రియ జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.