Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘PAANI’ యాప్

Telangana: తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేవలం అధికారుల పర్యవేక్షణ సరిపోదని, ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో జరుగుతున్న నీటి వృథాను గుర్తించేందుకు ప్రజల సహకారం తీసుకోవాలనే ఉద్దేశంతో PAANI యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు..

Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జలమండలి ‘PAANI’ యాప్
Tg Paani App

Updated on: Oct 29, 2026 | 7:15 PM

Telangana: నీటి సంరక్షణ ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు సామాజిక బాధ్యతగా స్వీకరించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. పెరుగుతున్న హైదరాబాద్ నగర జనాభా, తగ్గుతున్న భూగర్భ జలాలు, రాబోయే ఎల్‌-నినో పరిస్థితుల నేపథ్యంలో నీటి పొదుపును ప్రజా ఉద్యమంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు రూపొందించిన ‘PAANI’ (పానీ) మొబైల్ యాప్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా నీటి సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పరిరక్షణ, నీటి పునర్వినియోగం, భవిష్యత్తు తాగునీటి అవసరాలపై మాట్లాడారు.

జరిమానాల కంటే ప్రజల్లో మార్పే ముఖ్యం:

తాగునీటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేవలం అధికారుల పర్యవేక్షణ సరిపోదని, ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. నగరంలోని ప్రతి ప్రాంతంలో జరుగుతున్న నీటి వృథాను గుర్తించేందుకు ప్రజల సహకారం తీసుకోవాలనే ఉద్దేశంతో PAANI యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు.

నీటి దుర్వినియోగానికి పాల్పడేవారిపై జరిమానాలు విధించడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం కాదని, అలాంటి చర్యలు పునరావృతం కాకుండా ప్రజల్లో అవగాహన, బాధ్యత పెంచడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ముందుగా అవగాహన కల్పిస్తామని, అయినప్పటికీ నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ప్రతి పౌరుడు వాటర్ వాలంటీర్‌గా మారాలి:

సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ వాటర్ వాలంటీర్‌గా నమోదు చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. పాత్రికేయులు, ఆర్టీఐ కార్యకర్తలు, ప్రభుత్వ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, కాలనీ సంక్షేమ సంఘాల సభ్యులు, యువతతో పాటు ఆసక్తి ఉన్న పౌరులందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చన్నారు. తమ పరిసరాల్లో తాగునీటి వృథా, దుర్వినియోగం జరుగుతున్నట్లు గుర్తిస్తే PAANI యాప్ ద్వారా జలమండలి అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అందిన సమాచారంపై అధికారులు పరిశీలించి తగిన చర్యలు చేపడతారని తెలిపారు. నీటి సంరక్షణలో చురుగ్గా పాల్గొనే వాలంటీర్ల సేవలను గుర్తించి ప్రోత్సహిస్తామన్నారు.

భారీ వర్షాలు కురిసినా పెరగని భూగర్భ జలాలు:

హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవడం ఆందోళనకరమని మంత్రి పేర్కొన్నారు. వర్షాల సమయంలో రహదారులు జలమయమవుతున్నా, ఆ నీటిని భూమిలోకి ఇంకించే వ్యవస్థలు తగినంతగా లేకపోవడం వల్ల విలువైన జలవనరులు వృథా అవుతున్నాయని తెలిపారు. గతంలో గ్రామాల్లో చెరువులు, బావులు, సహజ నీటి నిల్వ వ్యవస్థల ద్వారా భూగర్భ జలాలు సంరక్షించబడేవని గుర్తుచేశారు. ప్రస్తుతం నగర విస్తరణ, కాంక్రీటు నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాల పెరుగుదలతో వర్షపు నీరు భూమిలోకి ఇంకే అవకాశాలు తగ్గుతున్నాయని వివరించారు.

ఎల్‌నినో నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు:

రాబోయే ఎల్‌-నినో పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి లభ్యతపై సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికే భూగర్భ జలాల తగ్గుదల, ట్యాంకర్లకు పెరుగుతున్న డిమాండ్ వంటి అంశాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని ముందస్తు చర్యలు చేపడుతోందన్నారు. నీటి వనరులను పెంచుకోవడం, సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడం, నీటి వృథాను తగ్గించడం, ప్రజల్లో అవగాహన పెంచడం వంటి చర్యలను సమాంతరంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

వాటర్ వాలంటీర్ నమోదు:

జలమండలి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆసక్తి ఉన్న పౌరులు వాటర్ వాలంటీర్లుగా నమోదు చేసుకోవచ్చు. నమోదు ధ్రువీకరణ అనంతరం PAANI యాప్ ద్వారా నీటి దుర్వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని అధికారులకు అందించవచ్చు.

ఈ సందర్భంగా జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గడం, సింగూరు- మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు పడిపోవడంతో రాబోయే వేసవిలో తాగునీటి సరఫరాకు సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం నగరానికి రోజుకు 560 నుంచి 570 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నప్పటికీ, భూగర్భ జలాలు తగ్గడంతో ట్యాంకర్ల డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని తెలిపారు. వచ్చే జనవరి నుంచి ఆగస్టు వరకు సింగూరు- మంజీరా నుంచి సుమారు 100 ఎంజీడీల నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందన్నారు. దీన్ని అధిగమించేందుకు గోదావరి, కృష్ణా, ఉస్మాన్‌సాగర్ నుంచి అదనంగా 60 ఎంజీడీల నీటిని సమీకరించేందుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. అయినప్పటికీ 40 నుంచి 50 ఎంజీడీల లోటు ఉండే అవకాశం ఉందని, పటాన్‌చెరు నుంచి నార్సింగి వరకు సుమారు మూడు లక్షల కనెక్షన్లపై ప్రభావం పడవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికే అత్యవసర కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వానికి సమర్పించినట్లు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us