తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త దిశ.. గ్లోబల్ సమ్మిట్‌లో 11 పాలసీల ఆవిష్కరణ

తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త కార్యాచరణకు సిద్ధమవుతోంది. పెట్టుబడుల ఆకర్షణ, ఉపాధి కల్పన, ఆధునిక సాంకేతిక రంగాల విస్తరణ లక్ష్యంగా 11 కొత్త పాలసీలను రూపొందించింది. ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా వీటిని ఆవిష్కరించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. పరిశ్రమలు, ఐటీ, విద్యా రంగాలకు సంబంధించిన ఈ విధానాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొత్త దిశను చూపించనున్నాయి.

తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త దిశ.. గ్లోబల్ సమ్మిట్‌లో 11 పాలసీల ఆవిష్కరణ
Telangana Global Summit

Edited By:

Updated on: Nov 28, 2026 | 11:48 AM

2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా సీఎం రేవంత్ రెడ్డి గతంలో తెలంగాణ రైజింగ్ విజన్–2047 డాక్యుమెంట్‌ను ఆవిష్కరించారు. దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పారిశ్రామిక రంగానికి అవసరమైన మార్పులు, భవిష్యత్ పెట్టుబడి అవకాశాలను దృష్టిలో ఉంచుకుని కొత్త పాలసీలకు రూపకల్పన చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో బలంగా ఉన్న పరిశ్రమలను మరింత విస్తరించడంతో పాటు, అంతర్జాతీయ పెట్టుబడులకు అనువైన కొత్త రంగాలను అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం, ఆధునిక మౌలిక సదుపాయాలు, నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాల కల్పన ఈ విధానాల ప్రధాన ఉద్దేశం.

తయారీ రంగానికి ఇండస్ట్రియల్ పాలసీ 2.0

రాష్ట్ర పారిశ్రామిక రంగంలో తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు ఇండస్ట్రియల్ పాలసీ 2.0ను తీసుకురానున్నారు. ముఖ్యంగా ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశమున్న వస్త్ర పరిశ్రమ, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల తయారీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ, టెక్స్‌టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0 ద్వారా ఈ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు తయారీ యూనిట్ల విస్తరణకు అవకాశాలు కల్పించనున్నారు. స్థానికంగా ఉత్పత్తి పెరగడం, ఉపాధి అవకాశాలు మెరుగుపడటం ఈ విధానాల ద్వారా సాధించాలన్నది ప్రభుత్వ ఆలోచన.

ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో మరిన్ని అవకాశాలు

రక్షణ, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల్లో తెలంగాణ ఇప్పటికే గుర్తింపు పొందింది. ఈ రంగాల్లో ఉన్న అవకాశాలను మరింత విస్తరించేందుకు ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీని రూపొందించారు. పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా, నిల్వ, సరఫరా వ్యవస్థలను బలోపేతం చేసేందుకు లాజిస్టిక్స్ పాలసీని కూడా తీసుకురానున్నారు. పరిశ్రమలకు అవసరమైన రవాణా సదుపాయాలు, గిడ్డంగుల అభివృద్ధి, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థల నిర్మాణం ఈ విధానంలో కీలక అంశాలుగా ఉండనున్నాయి.

ఐటీ, డేటా సెంటర్లు.. కొత్త పెట్టుబడుల లక్ష్యం

సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) ఏర్పాటు వేగంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయ సంస్థలు తమ కీలక కార్యకలాపాలను హైదరాబాద్ నుంచి నిర్వహించేందుకు ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో జీసీసీ పాలసీని ప్రత్యేకంగా రూపొందిస్తున్నారు.

అలాగే పెరుగుతున్న డిజిటల్ అవసరాలకు అనుగుణంగా డేటా సెంటర్ల ఏర్పాటును ప్రోత్సహించేందుకు డేటా సెంటర్స్ పాలసీ 2.0ను తీసుకురానున్నారు. ఐటీ రంగం అభివృద్ధికి సమగ్ర విధానంగా ఐసీటీ పాలసీ 2.0ను కూడా ఆవిష్కరించనున్నారు.ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక పాలసీ సిద్ధమవుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా కొత్త పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యేలా ఈ విధానం దోహదపడనుంది.

ఏవీజీసీ రంగానికి ప్రత్యేక ప్రోత్సాహం

యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాలు ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ రంగాల్లో తెలంగాణకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఏవీజీసీ పాలసీని రూపొందిస్తున్నారు.సృజనాత్మక పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధికి ఈ విధానం ప్రాధాన్యం ఇవ్వనుంది. డిజిటల్ కంటెంట్, వినోద రంగాల్లో కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించేందుకు ఇది ఉపయోగపడనుంది.

తెలంగాణలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లు

విదేశాల్లో పేరొందిన ఉన్నత విద్యాసంస్థలు తెలంగాణలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక విధానాన్ని తీసుకురానున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య, పరిశోధన అవకాశాలు రాష్ట్ర విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడం ఈ పాలసీ ప్రధాన లక్ష్యం.విదేశీ విద్యాసంస్థల రాకతో ఉన్నత విద్యా రంగంలో పోటీ పెరగడంతో పాటు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడనున్నాయి.

గ్లోబల్ సమ్మిట్‌లో 11 పాలసీలు

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ప్రభుత్వం ఆవిష్కరించనున్న కొత్త విధానాల్లో ఇండస్ట్రియల్ పాలసీ 2.0, ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ, టెక్స్‌టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0, ఏరోస్పేస్–డిఫెన్స్–స్పేస్ పాలసీ, లాజిస్టిక్స్ పాలసీ ఉన్నాయి.

వీటితో పాటు ఐసీటీ పాలసీ 2.0, గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ పాలసీ, డేటా సెంటర్స్ పాలసీ 2.0, ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీ, ఏవీజీసీ పాలసీ, ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీలను కూడా ఆవిష్కరించనున్నారు.

ఈ 11 విధానాలు తెలంగాణ పారిశ్రామిక రంగానికి కొత్త అవకాశాలను తెరవడంతో పాటు, రాష్ట్రాన్ని అంతర్జాతీయ పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా నిలబెట్టే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us