
ఎలక్ట్రిక్ వాహనాలు ఇక కేవలం పర్యావరణ పరిరక్షణకే పరిమితం కావడం లేదు. ఉపాధి కోసం కొత్త అవకాశాలను కూడా తెరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్త్రీనిధి ద్వారా ప్రత్యేక రుణ పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎలక్ట్రిక్ ఆటోలు, ద్విచక్రవాహనాలు కొనుగోలు చేసేందుకు తక్కువ వడ్డీపై రుణాలు పొందేలా ప్రణాళిక రూపొందించారు.
ప్రస్తుతం డెలివరీ సేవలు, క్యాబ్ సర్వీసులు, సరుకు రవాణా వంటి రంగాల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటంతో సంపాదనలో ఎక్కువ భాగం ఆదా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మహిళలు కూడా ఈ రంగంలో అడుగుపెట్టేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది.
పథకం ద్వారా కొనుగోలు చేసే ఈ-ప్యాసింజర్ ఆటోలను ప్రయాణికుల రవాణాకు ఉపయోగించడంతో పాటు ఈ-ట్రాలీ ఆటోల ద్వారా చిన్న వ్యాపారాలు, మార్కెట్ సరుకు రవాణా, వ్యవసాయ ఉత్పత్తుల తరలింపు వంటి పనులు నిర్వహించవచ్చు. అలాగే ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాలతో ఈ-కామర్స్ డెలివరీలు, కొరియర్ సేవలు, ఫుడ్ డెలివరీ, ఫీల్డ్ విజిట్లు వంటి అనేక రంగాల్లో ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉంటాయి.
రుణం పొందే మహిళలు ప్రైవేట్ ఫైనాన్సర్లను ఆశ్రయించాల్సిన అవసరం లేకుండా సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. దీంతో కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. మహిళలు మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఈ వాహనాలను వినియోగించి అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఈ పథకం కింద ఈ-ప్యాసింజర్ ఆటో కొనుగోలుకు రూ.2.74 లక్షలు, ఈ-ట్రాలీ ఆటోకు రూ.3.13 లక్షల వరకు రుణం అందించనున్నారు. ఈ రుణాన్ని 60 నెలల్లో వార్షిక 11 శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలి. ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉండటంతో ఇంధన ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనం కొనుగోలుకు రూ.1 లక్ష వరకు రుణం అందించనుండగా, దానిని 48 నెలల్లో వాయిదాల రూపంలో చెల్లించే అవకాశం కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా మహిళల ఆదాయ మార్గాలు విస్తరించడమే కాకుండా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం కూడా పెరిగే అవకాశం ఉంది. ఒకవైపు కార్బన్ ఉద్గారాలు తగ్గుతుండగా, మరోవైపు మహిళల ఆర్థిక స్వావలంబనకు కొత్త దారి ఏర్పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…