Telangana: సినిమాను మంచిన స్టోరీ.. ఈ మాయగాళ్లు మామూలోళ్లు కాదు గురూ

ఒకటికి పది.. పదికి వంద.. వంద పెడితే లక్షా.. ఇదేదో కాయ్ రాజా కాయ్ ఆట అనుకుంటున్నారా? అస్సలు కాదు.. ఇది మంత్రాల పేరిట నిండా ముంచేసిన బురిడి మాయగాళ్ల క్షుద్రపూజల కథ‌. ఓ సినిమాలో గంగలో ముంచే నగలు డబుల్ అవుతాయన్నట్టు.. పూజలు చేస్తే డబ్బులు రెప్పింపు అవుతాయని చెప్పి మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాకు చెక్ పెట్టారు పోలీసులు.

Telangana: సినిమాను మంచిన స్టోరీ..  ఈ మాయగాళ్లు మామూలోళ్లు కాదు గురూ
Money Doubling Scam

Edited By:

Updated on: Nov 23, 2026 | 2:22 PM

రూపాయి నోటును పది రూపాయలుగా మార్చేస్తాం.. మీరు ఇచ్చిన డబ్బులను పూజలు చేసి రెట్టింపు చేస్తాం.. నాలుగు రెట్లు కూడా చేసి ఇస్తాం..! ఇలాంటి మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా..? కానీ అత్యాశకు పోయిన కొందరు మాత్రం నిజమేనని నమ్మి లక్షల రూపాయలు సమర్పించుకున్నారు. చివరకు చేతిలో ఉన్న సొమ్ముతో పాటు ఆశలు కూడా ఆవిరయ్యాయి. చివరకు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు మంత్రతంత్రాలు, పూజల పేరుతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్న ఓ అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టు చేశారు. మొత్తం ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, నగదుతో పాటు మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు. అసలు ఈ ముఠా మోసాలు ఎలా సాగించింది? అమాయకులను ఎలా బుట్టలో వేసుకుందో వివరాంగా చూద్దాం.

ఒక్క రూపాయి ఇస్తే పది రూపాయలు వస్తాయనే ఆశ.. పెట్టిన డబ్బులు రెట్టింపు అవుతాయనే అత్యాశ.. ఇదే ఈ ముఠా పెట్టుబడి. తమకు మంత్రశక్తులు ఉన్నాయని, ప్రత్యేక పూజలు చేస్తే డబ్బులు రెండింతలు, నాలుగింతలు అవుతాయని నమ్మించేవారు. మొదట పరిచయం పెంచుకుని.. నమ్మకం కుదిరాక అసలు ఆట మొదలుపెట్టేవారు. బాధితుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసి ఉడాయించేవారు.వివరాల్లోకి వెళ్తే..ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్‌హెచ్‌-44 సమీపంలో ఈ ముఠా బాగోతం బయటపడింది. ఈ నెల 19న తోకల రాజు అనే వ్యక్తికి ఫోన్ చేసిన నిందితులు.. ఇచ్చోడకు రావాలని సూచించారు. పూజలతో డబ్బులు రెట్టింపు చేస్తామని నమ్మించడంతో.. రాజు తన పరిచయస్తుడు శ్రీపతి శంకర్‌తో కలిసి రూ.3 లక్షల నగదుతో వారు చెప్పిన ప్రాంతానికి చేరుకున్నారు.

టీజీడబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్దకు వెళ్లగానే నిందితులు తమ అసలు స్వరూపం బయటపెట్టారు. నగదు చూపించమని అడిగి.. బాధితులు డబ్బులు చూపిస్తున్న సమయంలో ఒక్కసారిగా రూ.3 లక్షలు లాక్కున్నారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన బాధితులపై దాడి చేసి కారులో పరారయ్యారు. అయితే పారిపోతున్న సమయంలో ఓ నిందితుడి ఫొటోను బాధితుడు తన ఫోన్‌లో చిత్రీకరించడంతో పోలీసుల దర్యాప్తుకు కీలక ఆధారం లభించింది.

ఈ ముఠా మోసాలు చేయడానికి ప్రత్యేకమైన పద్ధతిని ఎంచుకుంది. బాధితులు తీసుకొచ్చిన డబ్బుల బ్యాగులను పూజల పేరుతో తీసుకునేవారు. ఆ తర్వాత అసలు నగదు ఉన్న బ్యాగులను.. తెల్లకాగితాలు లేదా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మ నోట్లతో నింపిన బ్యాగులతో మార్చేసేవారు. పూజ పూర్తయిందని, ఐదు నుంచి పది రోజుల వరకు బ్యాగులు తెరవొద్దని చెప్పి పంపించేవారు. తీరా బ్యాగులు తెరిచి చూస్తే అందులో నగదుకు బదులు కాగితాలు, బొమ్మ నోట్లు కనిపించేవి. బాధితులు నిలదీస్తే పూజ విఫలమైందని.. మరోసారి పూజ చేయాలని.. అందుకు మరింత డబ్బులు కావాలని కొత్త నాటకానికి తెరలేపేవారు. ఇలా ఒకసారి కాదు.. పదేపదే మోసాలకు పాల్పడేవారు.

ప్రధాన నిందితుడు ఆత్రం పరశురాం గతంలోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. బక్కన్నతో కలిసి ముఠాగా ఏర్పడి.. అతని బంధువులైన శేఖర్, శైలేష్‌లను కూడా ఇందులో భాగస్వాములను చేసుకున్నాడు. వీరికి మరో వ్యక్తి షేక్ అలీం కూడా తోడయ్యాడు. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనూ ఈ ముఠా మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చోడ, ఉట్నూర్, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. జిల్లా పరిధిలో 10 మంది బాధితులు ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 24 మందిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రజల కష్టార్జితాన్ని కొల్లగొట్టిన నిందితులు.. ఆ డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపినట్లు విచారణలో వెల్లడైంది. బాధితుల నుంచి వసూలు చేసిన డబ్బులను నలుగురు సభ్యులు సమానంగా పంచుకునేవారని పోలీసుల విచారణలో తేలింది. సొంత అవసరాలు, కారు ఈఎంఐలు, ఇంటి నిర్మాణం కోసం ఆ సొమ్మును ఖర్చు చేసినట్లు వెల్లడించారు.ఇచ్చోడ పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3.74 లక్షల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

కష్టపడకుండా డబ్బులు సంపాదించాలనే అత్యాశే ఇలాంటి ముఠాలకు ఆయుధంగా మారుతోంది. మంత్రతంత్రాలు, పూజలతో డబ్బులు రెట్టింపు చేస్తామనే మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదని తెలిసినా.. కొందరు ఆ మాయలో పడుతున్నారు. చివరకు జీవితాంతం కష్టపడి సంపాదించిన సొమ్మును పోగొట్టుకుంటున్నారు. డబ్బులు రెట్టింపు చేస్తామనే హామీ వెనుక అసలు ఉద్దేశం మీ జేబు ఖాళీ చేయడమేనని గుర్తించాలి. మూఢనమ్మకాల ముసుగులో సాగుతున్న ఈ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us